Wednesday, April 20, 2022

కర్మ - జన్మ, ప్రారబ్ధ కర్మని గుర్తించడం ఎలా?

🧘‍♂️37-కర్మ - జన్మ🧘‍♀️
🕉️🌞🌏🌙🌟🚩

ప్రారబ్ధ కర్మని గుర్తించడం ఎలా?

మన ప్రమేయం లేకుండా మనకి జరిగేవన్నీ ప్రారబ్దకర్మలు అవుతాయి. ఉదాహరణకి మనం వెళ్ళే రైలుకి ప్రమాదం సంభవించడంలో మన ప్రమేయం ఉండదు కాబట్టి మనకి అందులో వాటిల్లే కష్టం ప్రారబ్ద కర్మ అవుతుంది.


ముఖ్యంగా పుట్టుక, మరణం, వివాహం, సంపాదన, సంతానం, మరణం మొదలైన ముఖ్య జీవిత భాగాలు తప్పక ప్రారబ్ధ కర్మానుసారమే మనకి లభిస్తాయి. ఎవరికి వారు తమ సమర్ధత వల్లే తాము ఫలానా ఉన్నత స్థితికి చేరుకున్నామని భావిస్తూంటారు. అలాగే తమ అసమర్ధత వల్లే ఫలానా నీచ స్థితికి చేరుకున్నామని అనుకుంటారు. కాని అవేమీ నిజం కాదు. అన్నీ మన ప్రయత్నంతో పొందుతున్నాం అని అజ్ఞానంతో ఇలా భ్రమపడతాం. అది నిజం కాదు.


పూర్వ జన్మల్లో చేసిన మంచి కర్మల ఫలితాల వల్లే ఈ జన్మలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపాదన, సుఖాలు లభిస్తాయి. దుష్కర్మల వల్ల అనారోగ్యం, ధనలేమి లాంటి కష్టాలు వస్తాయి. ఈ జన్మలోని వాటి అనుభవాల వల్ల ఆ కర్మలు ఖర్చయి రద్దవుతాయి.


ప్రారబ్ధ కర్మని గుర్తించడానికి రెండు కొలమానాలు ఉన్నాయి.

1. చేయవలసిన పనిని చక్కగా చేసినా దాని ఫలం రాకపోతే అప్పుడు పూర్వ కర్మరూపమైన దైవం బలవత్తరమైనది (ప్రారబ్ద కర్మ) అని భావించాలి.


అసంకల్పితమేవేహ యాదకస్మాత్ ప్రవర్తతే!
నివర్త్యారంభమారబ్ధం ననుదైవస్య కర్మతత్!!
- అయోధ్య కాండ, 22-24

భావం:

ప్రారంభించిన పనికి అడ్డుగా ఊహింపరాని విధంగా, అకస్మాత్తుగా ఏదైనా వచ్చిపడితే అది దైవ విలసితమే.


2. ఏ విధమైన ప్రయత్నం లేకుండా ఏదైనా లభించకూడనిది లభిస్తే అది కూడా ప్రారబ్ధ కర్మ అని భావించాలి. మనం రైల్లో ప్రయాణిస్తూండగా కిటికీ అంచున ఉంచిన మన చేతి మీద దాని తలుపు అకస్మాత్తుగా కిందకి జారి మన చేతికి దెబ్బ తగిలితే అది ప్రారబ్ద కర్మానుభవానికే జరిగింది. తలవని తలంపుగా జరిగేవి అన్నీ కూడా ప్రారబ్ద కర్మ పరిపాకం వల్లే జరుగుతాయి.


లాటరీ రావడం కూడా ప్రారబ్ద కర్మ కిందకే వస్తుంది. టిక్కెట్ తగిలి ధనం దుఃఖాలే కాక సుఖాలు కూడా ప్రారబ్ద కర్మానుభవం ప్రకారం అనుకోకుండా వస్తాయి. దీనికి మనందరికీ తెలిసిన చక్కటి ఉదాహరణలు ముగ్గురు ఉన్నారు.


ఎంతో ప్రయత్నం మీద, ఎన్నో సర్దుబాట్లు చేస్తే కాని భారత ప్రధాని పదవి లభించదు. దాని మీద ఎప్పుడూ చాలామంది రాజకీయ ప్రత్యర్ధుల కళ్ళు ఉంటాయి. ఎలాంటి ప్రయత్నం లేకుండా భారత చరిత్రలో ముగ్గుర్ని ఆ పదవి వరించింది.


ఇందిరా గాంధీని కామరాజ నాడార్ ప్రధాన మంత్రిని చేసాడు.


పి.వి. నరసింహరావు సామాను సర్దుకుని ఢిల్లీ నించి వెళ్ళిపోయే దశలో భారత ప్రధాని అయి అయిదేళ్ళు పాలించాడు.


చివరి రోజు దాకా సోనియాగాంధి ప్రధాన మంత్రి అవుతుందని అంతా భావించారు కాని మన్మోహన్ సింగ్ ఏ ప్రయత్నం లేకుండా, ఆఖరికి పార్లమెంట్ సభ్యుడు కూడా కాకుండా ప్రధాని అయారు. వారి పూర్వజన్మార్జిత ప్రారబ్ద కర్మే వారు ప్రయత్నించకపోయినా పరిస్థితులని వారికి అనుకూలంగా మార్చేసింది.


అలా అని ఏ విధమైన ప్రయత్నం చేయకుండా 'నా కర్మ ఇంతే' అని అనుకునేవాడు తనకి తను ద్రోహం చేసుకుంటూ దైవద్రోహం చేస్తున్నట్లే. కొన్ని ఈ జన్మలో చేసే ప్రయత్నంతో అగామికర్మల వల్లే లభ్యం అవుతాయి అని విస్మరించకూడదు. ప్రారబ్ధ కర్మల వల్ల కలిగే కష్టాలకన్నా చాలామందికి ఇలా ఈ జన్మలో స్వేచ్ఛా చిత్తంతో చేసే కర్మల వల్లే ఎక్కువ కష్టనష్టాలు వస్తుంటాయి.


ఆంతా ప్రారబ్ద కర్మేనా?

మనలో చాలామంది తమకేం జరిగినా 'అంతా నా కర్మ' అనుకుని, అది తమ ప్రారబ్ధ కర్మ వల్లే అని భావిస్తారు. పక్కవారు కూడా చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా' అని అది వారి ప్రారబ్ద కర్మవల్లే జరిగిందని అనుకుంటారు.


మనిషికి జీవితంలో కలిగే కష్టసుఖాలన్నీ ప్రారబ్ధకర్మలై వుండాలని లేదు. వాటిలో కొన్ని ప్రారబ్ద కర్మానుసారం కలిగితే, మరికొన్ని ఈ జన్మలోనే, స్వేచ్ఛా ఇచ్ఛతో, స్వబుద్ధితో అగామి కర్మలని ఆచరించడం వల్ల కలుగుతూంటాయి.


ఒకడు నిర్దోషి అయి కూడా జైలుకి వెళ్తే అది తప్పక ప్రారబ్ధ కర్మ వల్ల జరిగినట్లు, అదే నిజంగా దోషి అయి అప్పుడు జైలుకి వెళ్తే అది ప్రారబ్ద కర్మ వల్ల కాక, ఈ జన్మలో చేసుకున్న అగామి కర్మ వల్ల అవచ్చు. ఈ జన్మలో చేసిన కర్మ తాలుకు ఫలితం వచ్చే జన్మ దాకా వాయిదా పడకుండా ఈ జన్మలోనే ఫలితం చూపించడం వల్ల అతను జైలుకి వెళ్ళచ్చును.


పక్కింటి వాడిని కొడితే తిరిగి మనల్ని రెండు కొడతాడు. అది తక్షణ ఫలితం ఇచ్చిన అగామి కర్మ అవుతుంది. దొంగ పోలీసులకి దొరికిపోవడం కూడా అగామి కర్మ ఫలితం తప్ప ప్రారబ్ద కర్మ ఫలితం అవదు.

🕉️🌞🌏🌙🌟🚩

సేకరణ

No comments:

Post a Comment