Friday, May 27, 2022

నేటి జీవిత సత్యం. చైతన్య స్వరూపమైన మనిషి పంచకోశాలను కలిగి ఉన్నాడు. అలాగని మనిషి పంచకోశాలు కాడు, దేహమూ కాడు. అనాత్మ కాడు. ఆత్మ మాత్రమే.

నేటి జీవిత సత్యం.

కత్తిని ఉంచటానికి ఒరను ఉపయోగిస్తాం. అవసరమైనప్పుడు ఒర నుంచి బయటకుతీస్తాం. పని పూర్తయ్యాక ఒరలో ఉంచుతాం. కత్తి వేరు, ఒర వేరు. ఒరలో ఉన్నంతమాత్రాన కత్తి కత్తి కాకుండా పోదు. కోశం అంటే ఒర అని అర్థం ఉంది. అలాగే పంచకోశాలనే ఒరలో ఉన్నంతమాత్రాన మనిషి ఆత్మ కాకుండా పోడు. చైతన్య స్వరూపమైన మనిషి పంచకోశాలను కలిగి ఉన్నాడు. అలాగని మనిషి పంచకోశాలు కాడు, దేహమూ కాడు. అనాత్మ కాడు. ఆత్మ మాత్రమే. పంచకోశాల కన్నా వేరుగా ఉన్న ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి. పంచకోశాలతో కప్పి ఉన్న జీవుడు తాను పరిమితుడనని భావిస్తుంటాడు. వాటి వికారాలన్నీ తనవిగా భ్రమపడతాడు. వాటి గుణాలు తనవే అనుకుంటాడు. తన నిజస్వరూపాన్ని మరచిపోతాడు. విచారణ చేసి చూస్తే, తాను ఈ పంచకోశాలు కాదని, వాటికన్న తాను వేరుగా, విలక్షణంగా, వాటిని గమనిస్తూ, కేవలం సాక్షిగా చూస్తూ ఉన్న ఆత్మ చైతన్యాన్ని అని గ్రహిస్తాడు. ఇంతకీ ఏమిటీ పంచకోశాలు?
అన్నమయ కోశం.. అంటే స్థూల దేహం. ఈ దేహం పుట్టుకతో వచ్చి, కొంతకాలం ఉండి, మరణంతో అంతమవుతున్నది. ప్రారబ్ధం ప్రకారం నడుస్తున్నది. మనిషి ఈ దేహాన్నీ, దీని కదలికలను, పనులను స్పష్టంగా తెలుసుకోగలుతాడు. కన్ను పోయినా, కాలు విరిగినా తానే పోయాను, తానే విరిగానని అనుకోరు కదా! కాబట్టి మనిషి దేహం కన్నా వేరుగా ఉన్న ఆత్మగా భావించాల్సి ఉంటుంది.
ప్రాణమయ కోశం.. అంటే ప్రాణాలు. వాయుచలనమే ప్రాణం. బయట ఉన్న గాలి ముక్కు ద్వారా లోనికి వెళ్లి, పనిచేస్తునప్పుడు దానినే ప్రాణం అన్నారు. అది ముక్కు పుటాల ద్వారా లోపలికి వెళ్లటం, బయటికి రావటం మనిషికి తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి మనిషిని ప్రాణమయ కోశంగా భావించడానికీ వీల్లేదు.
మనోమయ కోశం.. జాగ్రత్‌, స్వప్నావస్థలలో మనసు జగత్తును సృష్టించుకొని అందులో విహరిస్తుంటుంది. సుషుప్తిలో మనసు లయమైపోవటంతో జగత్తు లయమైపోతుంది. ఈ మొత్తాన్ని తెలుసుకునే మనిషి వేరుగా ఉన్నాడు. మనసులో కలిగే సంకల్పాలన్నిటిని అతను గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనిషి మనసు కన్నా వేరుగా ఉంటాడు.
విజ్ఞానమయ కోశం.. ఇదే బుద్ధి. లోతుగా విషయ గ్రహణం చేసేది. మనసులోని భావాలను నిర్ణయించి, నిశ్చయించేదిదే. ఇక్కడే అనేక కోరికలుంటాయి. దీనికొక స్వభావం ఉన్నది. అది ఎలాంటిదో మనిషి తెలుసుకుంటూనే ఉంటాడు. బుద్ధిలో ఎలాంటి కోరికలున్నాయో, ఏయే లక్ష్యాలను సాధించాలని అనుకుంటున్నదో, ఎలాంటి స్వభావం కలిగినదో తెలుసుకునే మనిషి, బుద్ధి కన్నా వేరుగా ఉంటాడు. కాబట్టి మనిషి విజ్ఞానమయ కోశం కాజాలడు.

ఆనందమయ కోశం.. ఇది సుషుప్తిలో మాత్రం వ్యక్తమవుతుంది. గాఢ నిద్రలో ఏ విషయ జ్ఞానమూ లేదు. అలాగే ఆత్మజ్ఞానమూ లేదు. ఏ వృత్తులూ కదలని స్ధితి కాబట్టి ఆనందాన్నిస్తుంది. కానీ, అది శాశ్వతం కాదు. ప్రకృతి వికారం వల్ల ఈ స్థితి కలుగుతున్నది కాబట్టి ఇది పరిమితం (కొంతసేపు ఉండేది), వికారం (మారేది) ఈ స్థితిని కూడా తెలుసుకునే మనిషి వేరుగా ఉంటాడు. కాబట్టి, మనిషి ఆనందమయ కోశం కూడా కాదు. ఇంకా చెప్పాలంటే మనిషి వీటన్నిటికీ అతీతమైన ఆత్మగా చెప్పవచ్చు. ఈ ప్రకారంగా యుక్తితో పంచకోశాలను విచారించి, వాటిని తెలుసుకునే, గ్రహించే మనిషి వేరుగా ఉన్నాడని, అదే చైతన్యమని గ్రహించి, ఆత్మగా అనుభూతి చెందాలి.

పంచకోశాలను వేరుచేయటానికి ఉదాహరణగా వడ్ల నుంచి బియ్యాన్ని వేరుచేయటాన్ని చెప్తారు. బియ్యాన్ని ఊక, తవుడు కప్పి ఉన్నప్పుడు వడ్లు అంటాం. అవి బియ్యమే గాని వేరే కాదు. పొట్టు వేరు చేయగానే బియ్యం కనిపిస్తాయి. అలాగే పంచకోశాలు ఆవరించి జీవుడిగా ఉన్నప్పటికీ మనిషి ఆత్మే గాని పంచకోశాలు కాదు. జీవుడు కాదు. పంచకోశాలను వేరు చేయగానే ఆత్మ అనుభవానికి అందుతుంది. వెలుగుతున్న ట్యూబ్‌లైట్‌ను అయిదు కాగితాలతో చుట్టాం అనుకుందాం. కాంతి కనిపించదు. ఒక్కొక్క దాన్ని తొలగిస్తూంటే క్రమంగా వెలుగు వస్తుంది. అలాగే పంచకోశాలు తొలిగితే ఆత్మ ప్రకాశిస్తుంది.

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment