Monday, May 9, 2022

చాగంటి కోటేశ్వరరావు గారు ఒక సభలో మాట్లాడుతూ..... పెద్ద తంతు....ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్లో నడుస్తోంది. నేటి కాలం పెళ్లిళ్లు పైన చెప్పినట్టుగా పెద్ద తంతు గా తయారు అయ్యాయి. అందరు చేస్తున్నారు. మనం చెయ్యాలి. చెయ్యక పొతే నామోషీ..! ఇది నేటి రీతి.

ఇది ఒక మిత్రులు పంచుకున్నారు ఆ మిత్రులకు ధన్యవాదాలతో

చాగంటి కోటేశ్వరరావు గారు ఒక సభలో మాట్లాడుతూ.....

పెద్ద తంతు
➖➖➖✍️

ఒక వూళ్ళో ఒక సనాతనుడు ఉండేవారు. తరచూ హోమం చేసేవారు. హోమగుండంలో పోయడానికి నేతి ని గిన్నె లో పెట్టినప్పుడు అయన ఇంట్లో ఉన్న రెండు పిల్లులు బయటకు వచ్చి తెగ గోల చేసేవి. దీనితో హోమం అయ్యేంతవరకు పిల్లుల్ని గంప కింద ఉంచే వారు.


కాలం గడిచింది. అయన వృద్ధాప్యంతో మరణించారు. కొడుకులు హోమం చెయ్యడం మానేశారు. ఏవో ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు కొంత కాలానికి వారికి హోమం చెయ్యాలి అనిపించింది.

ఏమేమి కావాలో ఆలోచించి.. పుజారిని సంప్రదింపులు జరిపారు లిస్ట్ తయారు చేసారు. ఆ తరువాత మూర్ఖత్వం తో "అరేయ్ డాడీ హోమం జరిగేంత వరకు పిల్లుల్ని గంప కింద ఉంచేవారు. మన ఇంట్లో పిల్లులు లేవు కదా గంప కూడా లేదు" అని చెప్పి బజార్ కు వెళ్లి రెండు పిల్లులు, గంప కొనుక్కొని వచ్చి హోమం చేసేంత వరకు గంప కింద పిల్లుల్ని ఉంచారు.

ఎందుకు చేస్తున్నామో తెలియకుండా గుడ్డిగా మనం పాటించేవాటినే ‘తంతు’ అంటారు.

ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్లో నడుస్తోంది. నేటి కాలం పెళ్లిళ్లు పైన చెప్పినట్టుగా పెద్ద తంతు గా తయారు అయ్యాయి. అందరు చేస్తున్నారు. మనం చెయ్యాలి. చెయ్యక పొతే నామోషీ..! ఇది నేటి రీతి. ఎవరో చెవి కోసుకున్నారని మెడ కోసుకుంటారా?

రిసెప్షన్ :-

అబ్బో ఇదో పెద్ద అంతులేని తంతు. అసలు రిసెప్షన్ అంటే ఏంటి? ఆహ్వానం. అంటే అతిథులను పెళ్ళికి ఆహ్వానించడం కదా ? కానీ నేడు జరుగుతోంది ఏంటి ? అసలు కంటే కొసరు ఎక్కువైంది. రాత్రి ఎనిమిది గంటలకు రిసెప్షన్. అర్ధరాత్రో లేదా తెల్లవారు జామున పెళ్లి . అందరూ రిసిప్షన్ కు వస్తారు. వయసులో చిన్న వారు అయిన కాబోయే దంపతులు స్టేజి పై నిల్చుంటారు. వారి ని ఆశీర్వదించడకోసం లేదా గ్రీట్ చేయడం కోసం పెద్ద వారు క్యూ లో నిలబడుతారు. అంటే మనం పెద్ద వారికి ఇచ్చే గౌరవం ఇదన్న మాట. క్యూ చేంతాడంత ఉంటుంది. ఎప్పుడెప్పుడు స్టేజి పైకి వెళ్లే ఛాన్స్ వస్తుందా అంటూ వాచ్ చూసుకొంటూ లైన్ లో ఎంతో ఇబ్బంది పడుతూ నిలబడుతారు. చివరికి ఛాన్స్ వస్తుంది . ఫోటో కోసం ఒక కృత్రిమ నవ్వు. వాళ్ళను ఆశీర్వదించడం.. పెళ్లి కాని వారిని ఆశీర్వదించడం ఏంటి? అపచారం కాదా? అసలు ఇన్ని గంటలకు శుభ ముహూర్తాన వారు దంపతులు అవుతారు అని నిర్ణయించడం ఏంటి? ఆ శుభ గడియలు రాకుండానే వారిని పక్క పక్క ను కూర్చోపెట్టి ఆశీర్వచనమ్ ఏంటి ? వేదం మంత్రాలను వెక్కిరించడం కదా? అంత అభ్యుదయ భావాలు ఉంటే సింపుల్ గా ఆదర్శ వివాహం చేసుకోవచ్చు కాదా? మనసు మంచిదైతే మనిషి కి గొప్ప ఆలోచనలు వస్తాయి కానీ, నేడు మనిషి మనసు వెర్రి పుంతులు తొక్కుతోంది.

చెప్పులు వేసుకొని మరి కొన్ని గంటల్లో వేదం మంత్రాలూ చదవ బోతున్న స్టేజి పైకి ఎక్కడం. దేవుని పూజా మంత్రాల సమయంలో షూ వేసుకుని, చెప్పులు వేసుకుని అవి జపిస్తే భగవంతుని ఆశీస్సులు పొంతదుతారా? ఆ షూస్ ఎక్కడెక్కడ తొక్కి వచ్చిందో. పోనీ ఆచారం సంగతి పక్కన పెట్టండి కనీసం ఆరోగ్య సూత్రాల రీత్యా మంచిదేనా? ఆ స్టేజి పైన కొన్ని గంటల పాటు వధూవరులు కూర్చొంటారు కదా?

రిసెప్షన్ అయ్యింది. ఇక అందరూ డిన్నర్ హాల్ లోకి దూరుతారు. అక్కడ తోపులాట. తిండికి మొఖం వాచిన వారిలా తోసుకొంటూ వెళ్లి ప్లేట్ పట్టుకొని ‘భవతి బిక్షాన్దేహి’ అని నిల్చుంటే ఇక అక్కడ వాడు చేతికి ప్లాస్టిక్ కవర్ వేసుకొని వడ్డిస్తాడు. అక్కడ ఎన్ని పదార్థాలు వున్నాయి అనేది స్టేటస్ సింబల్. కనీసం 30 అయినా లేకపొతే అవమానం. ఒక్కో సారి నూటయాభై దాకా ఉంటాయి. వాటిలో సగం పదార్థాలు పేర్లు జీవితంలో కనీ విని ఉండం. పర్ ప్లేట్ లెక్కన కేటరింగ్ వాడికి ఇచ్చివుంటారు. అవి చూడడానికే బాగుంటాయి. తింటే జీవితంపై విరక్తి పుట్టిస్తాయి. ఏదో ఐదో పదో పదార్థాలు రుచి చూసి ఇక జనాలు బయట పడుతారు. పెద్ద ఎత్తున ఆహారం వృధా. కడుపునిండా తిన్న వాడు ఉండడు. ఒక్క ఐటం అయినా రుచిగా ఉంటుంది అనే భరోసా లేదు. అదో పెద్ద తంతు!

స్టేజి పైన ఫోటో అయిపోయింది. అటెండెన్స్ వేసుకొన్నాం. డిన్నర్ అయ్యింది. ఇక ఏముంది? పరుగో పరుగు. అసలు వచ్చింది దేనికి? పెళ్ళికి! మరి పెళ్లి చూడకుండా వధూవరులను ఆశీర్వదించకుండా ఎలా వెళుతారు? ‘అబ్బా .. మరీ అర్ధ రాత్రి ముహూర్తం. ఎవరు ఉంటారండీ? అయినా ముఖం చుపించాముగా.’ ఇక చల్ .. పోదాం. రిసిప్షన్ అంటే పెళ్ళికి ఆహ్వానం .. ఆ ఆహ్వానము అందుకొని .. ఇంకా పెళ్లి కానీ వారిని దీవించి .. అది కూడా షూస్ తో సహా దీవించి .. ఇక పరుగో పరుగు!

రిసెప్షన్ కి రెండు వేల మంది వచ్చారు అని కేటరింగ్ వాడు చెబుతాడు. ఇక పెళ్లి మొదలయ్యేటప్పటికి పట్టున యాభై మంది లేరు. నిర్మానుష్యంగా పెళ్లి హాల్. పోనీ ఆ కూర్చున్న వారికైనా పెళ్లి జరిపే దృశ్యం కనిపిస్తుందా అంటే జస్ట్ నో ఛాన్స్. ముగ్గురు కెమెరా వాళ్లు.. ఇద్దరు వీడియోగ్రాఫర్స్ .. లైట్ మోసేవాడు. సీట్స్ లో కూర్చొని వారి వెనుక భాగాన్ని దివ్యదర్శనం చేసుకోవలసిందే పెళ్లి జరిగినంత వరకు.

ఎవరికోసమండీ ఈ తంతు? ఎంత వృధా? బంధువులు కలుసుకున్నారు కదా .. నాలుగు మాటలు మాట్లాడుకొందాం అంటే రిసెప్షన్ టైం లో ఆర్కెస్ట్రా. చెవులు చిల్లు పడే సౌండ్. పోనీ వారు పాడే పాటల్ని అయినా వింటున్నారా అంటే ఒక్క నరమానవుడు కూడా ఆ పాటల్ని ఎంజాయ్ చెయ్యడు. వాళ్ళ పాటలు పాటలే .. వినిపించక పోయినా జనాల మాటలు మాటలే. పెళ్లి సందర్భంగా నలుగురు అనాధ పిల్లలకు భోజనం పెట్టొచ్చుగా? వారికి మేము మీ బంధువులు అని చెప్పొచ్చుగా? అసలు ఆ ఫుడ్ ఏంటి ? ఆ wastage ఏంటి? వేదమంత్రాల పేరుతో ఆ అపచారపు పనులు ఏంటి? ఒక్కరైనా ఆలోచించారా? లేదా గంప కింద పిల్లిని కప్పి హోమం చేసే తంతేనా?....

మార్పు అనేది ఎంతో మంది కి ఉపయోగపడే విధంగా ఉండాలి.. బాధ్యతగా ఉండాలి. మనిషి మనసు మంచి వైపు పయనిస్తూ ఉండాలి.... భగవంతుడు మెచ్చేలా నడుచుకుంటామంటూ ఉండాలి ఇక్కడ మానవులు మెప్పించి ఉపయోగం లేదు.

✍️

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏*

🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

No comments:

Post a Comment