Tuesday, May 31, 2022

నేటి జనరేషన్ హృదయం, నిజజీవితం అంటే.. రెండున్నరగంటల సినిమా కాదు... అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి.

🌿 నిజజీవితం అంటే.. రెండున్నరగంటల సినిమా కాదు... అన్నీ మారిపోయి శుభం కార్డు పడడానికి. 🌿

ఒకసారి 45 ఏళ్ల వయసున్న ఒకామె కోర్టు మెట్లు ఎక్కింది. జడ్జిగారి ముందు ఆమె ఇలా విన్నవించుకుంది. "మా వారికి ఆరోగ్యం బాగాలేదు. మాకు ఒక పాప ఉంది. నేను అందరి ఇళ్లలో పనిచేసి తెచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. అందరినీ అడుక్కుని ఎలాగోలా నా కూతురికి మంచి చదువు చెప్పించాను. మా అమ్మాయిని ఎటువంటి కష్టం తెలియకుండా పెంచాను. అమ్మాయి కూడా బాగా చదివి ఉద్యోగం సంపాదించుకుంది. ఇక మా కష్టాలు తీరాయి... అనుకునే లోపు అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసంచేసి ఎత్తుకుపోయారేమో".... అని చెప్పింది.

జడ్జిగారు ఆ విషయం గురించి పూర్తిగా విచారించగా, ఆ రోజు వాళ్ళ అమ్మాయి కోర్టుకు వచ్చింది. బోనులో ఎదురెదురుగా తల్లి కూతుర్లు. ఆ అమ్మాయి కళ్ళలో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమూ లేదు.

ఆ అమ్మాయి... "నన్ను ఎవరూ మోసం చేయలేదు. నన్ను ఎవరూ ఎత్తుకుని పోలేదు. నేను మేజర్ ని నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను" అనిచెప్పింది.

ఇంట్లో వాళ్లకు ఒక్కమాటైనా చెప్పాలి కదా!.... అని అడగాలని అనుకున్నా, కోర్టులో ఇలాంటి సంభాషణలు ఉండరాదు. కనుక ఒక గంటసేపు తల్లి కూతుర్లు మాట్లాడుకోవలసిందిగా జడ్జిగారు తీర్పు ఇచ్చారు.

జడ్జిగారి ఆశ ఏంటంటే... ఒకవేళ ఆ తల్లీకూతుళ్ళు కలిసి మాట్లాడుకుంటే, ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందని, గతాన్ని తలచి ఆమె మారుతుందేమో అని. ఆయనకూ మనసు ఉంది కదా! అందుకే ఆలోచించి అలా చెప్పారు.

ఒక గంట తరువాత మళ్ళీ వచ్చిన తల్లి కూతుర్లు ఎదురుగా నిలబడ్డారు. కానీ, ఎటువంటి మేజిక్కూ జరగలేదు.

అమ్మ ఒక నిశ్చయానికి వచ్చి, "ఇక అమ్మాయి ఇష్టం అండీ... తను సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు. ఒక్కమాట... వాళ్ళ నాన్నతో వెళ్ళొస్తానని చెప్పమనండి. ఆయనకు ఆ పిల్లంటే ప్రాణం" అని తల్లి చెప్పింది.

"వాళ్ళ నాన్న ఎక్కడ?" అని అడగగా... అతను ఒక మూలన కూర్చుని ఇవన్నీ గమనించి కన్నీరు పెట్టుకుంటున్నాడు. అతను వికలాంగుడు (physically handicapped.) అతనిని ఒకరు ఆసరాగా పట్టుకుని ఉన్నారు.

అయినా ఏమాత్రం మనసు కరగని ఆ అమ్మాయి "ఇక నేను వెళ్లొచ్చా"... అని అడిగి బయట తన భర్త వేచిచూస్తున్న కార్ ఎక్కి వెళ్లిపోయింది.

ఆ అమ్మాయిని శిక్షించడానికి కోర్టుకి అధికారం లేదు. 'ఆర్డర్ వేసి ఇవి ఆచరించి తీరాలి' అని చెప్పడానికి ఇంకా చట్టాలు రాలేదు.

జడ్జిగారు ఆ అమ్మను ఉద్దేశించి... "ఇప్పుడెలా వెళతారు?" అని అడిగితే... "బస్టాండ్ లో నలుగురి దగ్గర అడుక్కుని మా ఊరువెళ్ళిపోతాం. అక్కడ మళ్ళీ ఇళ్లలో పనిచేసుకుని మా బతుకులు ఈడ్చేస్తాం." అని అంటుంటే అక్కడ అందరి కళ్ళలో కన్నీళ్లు.

కోర్టు నుండి బయటకు వచ్చిన జడ్జిగారు ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వగా, అక్కడ ఉన్నవారంతా తోచిన సాయం చేసి పంపారు.

సినిమాల్లో లాగా నిజ జీవితాల్లో మార్పులు ఉండవు.
తప్పు చేశామేమో అనే పశ్చాతాపం ఉండదు. చట్టం కూడా కొన్నిసార్లు మౌనంగా చూస్తూ ఉండాలి అంతే.

మన పిల్లలకు మన కష్టం తెలియకుండా పెంచాలి అని అనుకోవడమే పొరపాటు.
ప్రేమను పంచినట్టే కష్టాన్ని కూడా పంచండి. అప్పుడు కాసింత మానవత్వంతో మనుషులుగా మిగిలిఉంటారు. లేకపోతే మానవత్వాన్ని మరిచిపోయి, ప్రేమగా పెంచిన మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా గాలికొదిలేసి ఎటో వెళ్ళిపోతారు.


🌹 ఇదీ నేటి జనరేషన్ హృదయం 🌹

సేకరణ

No comments:

Post a Comment