Sunday, June 26, 2022

సేవ గొప్పతనాన్ని వివరిస్తూ స్వామి వివేకానంద ఇలా అంటారు.....

వ్యక్తికి వ్యక్తికి మధ్య సంబంధం సేవతోనే ముడివడి ఉంటుంది. సేవానిరతితోనే అనుబంధాలు బలపడతాయి. హృదయ మార్దవం చిగుళ్లు తొడుగుతుంది. సేవాగుణం వల్ల ఒంటరిగా ఉన్నామన్న భావనే కలగదు.


సేవ గొప్పతనాన్ని వివరిస్తూ స్వామి వివేకానంద ఇలా అంటారు. ‘నిర్మలంగా ఉంటూ పరులకు వీలైనంత సహాయం చేయాలన్నదే పూజలన్నింటి సారాంశం. పేదల్లోను, వ్యాధిపీడితుల్లోను ఈశ్వరుణ్ని చూసి వారికి సహాయం చేసేవాడే నిజమైన సేవకుడు. అతడే ఈశ్వరుడికి ప్రీతి పాత్రుడు. ఒక వ్యక్తి సమాజంలో ఏ హోదాలో ఉన్నప్పటికీ తోటివారి కష్టాలను తొలగించి వారికి చేయూతనివ్వాలి. అప్పుడే అతడు చిరస్మరణీయుడవుతాడు. ఎవరైతే పరులకోసం జీవిస్తారో వారే నిజంగా జీవించినట్లు, మిగతావారు జీవించి ఉన్నా మృతతుల్యులే.’


సేవ అంటే మనకున్నదంతా ఇతరులకు ఇచ్చి మనం కష్టాల పాలవడం కాదు. మనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేయాలి. వారికి ఆనందం కలిగించాలి. మన విధులను నిబద్ధతతో, నిస్వార్థంతో నిర్వరిస్తూ ఆర్తులకు చేయూతనివ్వాలి.


మనకోసం చేసిన పని ఎంత గొప్పదైనా మనతోనే అంతమవుతుంది. పరుల మేలు కోసం చేసే సేవ మాత్రమే మనల్ని చిరస్మరణీయుల్ని చేస్తుంది. అందుకే తోటివారికి తోడ్పడటంలో ఉన్న ఆనందం మరి దేనిలోనూ లభించదంటారు విజ్ఞులు.


ఇతరులకు ఎలాంటి సేవ చేసినా నిష్కల్మషమైన మనసుతో చేయాలి. అదే మాధవసేవ. ఆ సేవే భగవంతుడికి ప్రీతికరమైనది. దానికి మెచ్చిన మాధవుడు మన హృదయంలోనే కొలువై ఉంటాడు...

No comments:

Post a Comment