Saturday, June 18, 2022

సమదృష్టి, సమదర్శనం, స్వసుఖం, స్వాతిశయం

 మానవ జన్మను ఎత్తిన ప్రతి వాడూ సమదృష్టిని అలవరచుకోవాలని మన సనాతన ధర్మం చెబుతోంది. దీనినే సమదర్శనం అని కూడా అంటూ ఉంటాం. సమాజంలో ఎవ్వరికీ ఇబ్బంది కల్గించకుండా, ఎవ్వరినీ  హీనంగా చూడకుండా అందరం ఒక్కటేనని, అందరిలోనూ ఆ భగవంతుడు అంతర్యామిగా ఉంటాడనే నిజాన్ని తెలుసుకోగలిగితే మనం సమదృష్టిని అలవరచుకోగలం.

అయితే స్వార్ధం మనిషిని సమదృష్టిలో ఉంచకుండా చేస్తోంది. సాధారణంగా స్వసుఖం, స్వాతిశయం అనేవి మనిషిలో స్వార్ధాన్ని ప్రోది  చేస్తూ ఉంటాయి. తానొక్కడే సుఖంగా ఉండాలనుకోవడం స్వసుఖం. అలాగే తానొక్కడే అందరికన్నా ఆధిక్యంలో ఉండాలనుకోవడం స్వాతిశయం. నిజానికి స్వార్ధంతో వచ్చే ఈ రెండు గుణాల వల్లనే మనిషి ఎన్నో అనర్ధాలకు, అక్రమాలకు పాల్పడుతుంటాడు. మంచీ, చెడు విచక్షణ మరచి అకృత్యాలు చేసుకుంటూ పోతాడు.

  సాధారణంగా సుఖంగా ఉండాలనుకోవడం, ఉన్నతస్థితికి  చేరుకోవాలనుకోవడం తప్పేమి కాదు. కానీ తన సుఖం కోసం, తన ఉన్నతికోసం స్వార్ధంతో ఇతరులకు ఇబ్బంది కల్గించడం అధర్మమవుతుంది.

తనకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు తాను ఇతరులకు ఇబ్బందులు కల్గించినట్లుగానే, తన పరిస్థితులు అనుకూలంగా లేనపుడు ఇతరులు కూడా తనకు ఇబ్బందులు కల్గించే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఆ భావన కల్గినపుడు సహజంగానే మనం ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండగలం.

అదేవిధంగా సంకుచిత స్వభావం కూడా సమదృష్టి లేకుండా చేస్తుంది. సంకుచిత భావనల వలన ఇతడు మనవాడు, అతడు పరాయి వాడు అనే భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అలాంటి భేదాభిప్రాయాలు ఎన్నో అనర్ధాలకు కారణభూతమౌతాయి. కనుక సంకుచిత భావం లేకుండా ఉదారంగా ఉండగలిగే మానసిక పరిపక్వతను ప్రతి మనిషీ అలవరచుకోవాలి.

     తనకు అన్నీ ఉన్నా ఎదుటివారికి లేకపోతే ఎద్దేవా చేయడం కానీ, ఎగతాళి చేయడం కానీ కూడదు. ఈరోజున ఏమీ లేకపోవచ్చు. కానీ రేప్పొద్దున వారిని భగవంతుడు కరుణించవచ్చు. వారి కుబేరులు కావచ్చు. లేదా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. ఇలా ఏదైనా జరగవచ్చు. జరగడం అనేది మనచేతుల్లో ఏదీలేదు. కనుక ఎవరినీ ఎందుకూ నొప్పించకూడదు.

  మనుషుల్లో స్వభావరీత్యా ఒక మనిషికీ, మరో మనిషికి మధ్య తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ప్రధాన కారణం మనిషి తనను తాను అర్థం చేసుకోలేకపోవడమే. ఆలోచనల్లో సరళీకృతం లేకపోవడం, ఆలోచనల్లో తానే అధికుడినని భావించడం, అన్నీ తనకే తెలుసనుకోవడం, ఎదుటివారి మాట తానెందుకు వినాలనుకోవడం లాంటి వన్నీ మనిషి స్వభావాన్ని మార్చివేస్తాయి. అనుకొన్నది జరగకపోతే వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం మనిషి స్వభావాన్ని మార్చివేస్తుంది. దానితో అనుకొన్నది కాక మరొకటి ఎదురవుతుంది.

అందుకే చుట్టూ సమస్యలు చుట్టుముట్టినా, ఎందరు కావాలని కష్టనష్టాలు కలిగిస్తున్నా, పనిగట్టుకొని హేళన చేస్తున్నా, పుట్టెడు దుఃఖం ఉబికి వస్తున్నా బాధపడడం మానేసి వాటికి దూరంగా వెళ్లిపోయి తమ పని తాము చేసుకోవడం ఉత్తమం.

 ఎదుటివారు ఏం చేసినా సరే తాను మాత్రం ఎవరికీ అపకారం చేయకుండా ఉండడమే సమదృష్టి. ఒకరికి మేలు చేయగలిగే స్థితిలో, ఒకరికి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా జీవితాన్ని మలుచుకోగలిగిన నాడే సమదృష్టి ప్రస్ఫుటమవుతుంది.  

అందుకే మన స్వార్థాన్ని అదుపులో పెట్టడానికి, మన మాటలను, చేతలను క్రమబద్ధీకరించడానికి, మన వలన తోటివారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మన సనాతన ధర్మం ఎన్నో నియమాలను ఏర్పరచింది.

మహాభారతంలోని అరణ్యపర్వంలో యక్షుడు మానవ ధర్మాల్లోకెల్లా ఉత్తమమైన ధర్మం ఏదని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. దానికి ధర్మరాజు సమాధానం చెబుతూ, ఇతరులు ఏం చేస్తే మనకు కష్టం కలుగుతుందో, దానిని మనం చేయకుండా ఉండడమే ఉత్తమ ధర్మమని చెబుతాడు.

సమస్త ప్రాణుల యందు సమ భావం కలిగినవారు, ఇష్టాయిష్టాలకు, సుఖ–దుఃఖాలకు, సంతోష–బాధలకు అతీతంగా ఉండేవారు నిరంతరం జనన మరణ సంసారాన్ని దాటుతారని, వారే  భగవంతుని రూపాలని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పాడు.

మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకు, సమదృష్టిని సాధించడం దుర్లభం అవుతుంది. శారీరక ఆహ్లాదం, కోరికలు, ద్వేషాలు నిత్యం అనుభవంలోకి  వచ్చినంత కాలం సమదృష్టిని ప్రదర్శించడం దుస్సాధ్యం.  

ఎవరైతే మనస్సును ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంచుకుంటారో, శారీరక సుఖ–దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతులై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటారో, స్వార్థాన్ని, క్రోధాన్ని, ఐహిక సుఖాలను, ఆర్భాటాలను త్యజించి తమ మనస్సును భగవంతుని యందే లగ్నం చేస్తారో అలాంటి వారు ఈశ్వరునితో సమానంగా మన వేదాలు చెబుతున్నాయి.


ఎవరైనా మనకు ఇబ్బంది కలిగించినా, మనపట్ల అమర్యాదగా ప్రవర్తించినా, మనతో పరుషంగా మాట్లాడినా, మనలను కించపరిచినా సహజంగానే మనకు బాధ కలుగుతుంది. అందుకే అలాంటి పనులను మనం ఇతరుల పట్ల చేయకుండా ఉండాలి. అదే సమదృష్టి.


సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment