🙏🌷దుఃఖ పరిహారం🌷🙏
ఒకనికి వ్యాధివస్తే ఆయుర్వేద చికిత్సకుడు ధాతువైషమ్యమని చెబుతాడు. ఇంగ్లీషు వైద్యుడు మరొక్క కారణం చెబుతాడు. ఇంకో కారణం మానసిక విజ్ఞానానికి చెందినవారు పేర్కొంటారు. మంత్రశాస్త్రజ్ఞులు దైవం ప్రతికూలంగా వుందని అంటారు. జ్యోతిష్కులు గోచారవశంగా గ్రహములు అనుకూలంగా లేవని అంటారు. ధర్మ శాస్త్రజ్ఞులు వ్యాధి, పూర్వకర్మ వలన ఏర్పడినదని చెబుతారు. వ్యాధి ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా చెబుతుంటారు. ఇందులో ఏది నిజం? అంతా కర్మ ఫలం అంటే మనకు కలిగిన సమస్యకు పరిహారమేమిటి? మనం ఏమి చేయాలి?
దీనికంతా కారణం కర్మమే. కర్మ, కర్మ ఫలం. వైజ్ఞానికుల కార్యకారణ సంబంధం Cause and Effect ఇదే. ప్రపంచమంతా Action, Reaction అనే ద్వంద్వాలలో చిక్కుకొని వున్నది. భౌతిక శాస్త్రము (Physics) ఈ సత్యమునే వెల్లడిస్తున్నది. జడప్రపంచమూ, జీవ ప్రపంచమూ, రెండూ ఒకే మూలకారణము నుంచి వచ్చినందు వలన జగత్తుకు వున్న విధి మానవ జీవితమునకూ ఉన్నది. మన చేతలకన్నిటికీ నిశ్చయముగా ప్రతిఫలమున్నది. మనము అ జీవితములో అనుభవిస్తున్న సుఖదుఃఖములకు కారణం పూర్వ జన్మలలో చేసుకొన్న కర్మమే. మనం చేసిన పాప పుణ్యాలే కాక, ఇతరుల పాపపుణ్యాలు, పరేచ్ఛా ప్రారబ్ధములూ మనలను వెన్నాడటం కద్దు. ఒక శిశువుకు కలిగే సుఖదుఃఖాలను తలితండ్రుల కర్మ అని అంటారు. వారు శారీరకంగానూ, మానసికంగానూ పడే కష్టాన్ని చూస్తుంటే ఇది నిజమే అని అనిపిస్తుంది.
ప్రపంచములో జరుగుతున్న అ జగన్నాటకానికి సూత్రధారిణి ఆ పరాశక్తియే అంతా ఈశ్వర శాసనాన్ని అనుసరించే వర్తిస్తున్నది. ఒకదాని కొకటి సంబంధములేనట్లు కనిపించినా, అంతా ఆ సర్వేశ్వరుని మాయా తంత్రవే.
అందుచేత మనకు జరుగుతున్నవన్నీ ప్రారబ్ధ కర్మవలననే జరుగుచున్నవి. ఆ కర్మఫలమునకు ఏ కారణమైనా చెప్పవచ్చును. దానికి తగిన పరిహారమో, చికిత్సయో, గ్రహశాంతియో, దైవతుష్టియో, ఏదైనా చేయవచ్చును. ఇట్టి పరిహారములు చేస్తున్నపుడు కూడ అన్నీ ఈశ్వరార్పితమన్న భావనతో చేయాలి. ఆ ఈశ్వరుడు విధించినట్లు జరగనీ అని తూష్ణీం భావముతో వుండటం అతి శ్లాఘ్యమైనది. దానిని మించిన పరిహారమేదీ లేదు.
ప్రారబ్ధకర్మకు నిర్ణీతమైన పరిహారములు చేయుటతోబాటు, క్రొత్తకర్మలు చేయకుండా వుండేటట్లు జాగ్రత్తపడాలి. ఈశ్వర ధ్యానమునకు మించిన పరిహారమేమున్నది? అద్వైత నిష్ఠలో సుఖదుఃఖములు రెండూ లేవు. ఈ రెంటికీ ఆధారమైన సత్యము స్వయం ప్రకాశముగా సర్వకాలములలోనూ భాసిస్తూ వుంటుంది.
సేకరణ
No comments:
Post a Comment