Sunday, July 3, 2022

ప్రారబ్దం ఎందుకు మారదు?

🪷🪷 "27" 🪷🪷
🪷🪷 "కర్మ - జన్మ" 🪷🪷🪷
🌼🪷🌼🪷🌼🪷🌼
🌼🪷🕉🪷🌼
🌼🪷🌼
🌼

"ప్రారబ్దం ఎందుకు మారదు"?

"అవశ్యం భావిభావానాం ప్రతీకారో భవేద్యది!
తదా దుఃఖై ర్న సీదేరన్ నల రామ యుధిష్ఠిరాః"!!

భావం:-

"ప్రారబ్ద కర్మఫల భోగాలను నివారించే పద్ధతి వుండి వుంటే, నల మహారాజు, రాముడు, ధర్మరాజు ముగ్గురూ అరణ్యంలో వుండి అనేక దుఖాలను అనుభవించి వుండేవారు కారు."

"కష్టాలను తొలగించుకునే పరిహార పద్ధతులు ఉండి ఉంటే, భార్యని అడవుల పాలు చేసిన నలుడు, భార్యని మరొకడు ఎత్తుకుపోగా రాముడు, భార్యా వస్త్రాపహరణాన్ని, అదీ తమ సమక్షంలో నిండు సభలో జరగగా నిస్సహాయంగా చూసిన ధర్మరాజు వంటి మహానుభావులంతా తగిన పరిహారాలు చేసి వాటి లోంచి బయటపడి ఉండేవారు కదా. పరీక్షిత్ రాబోయే మృత్యువుని దాటాలని, పాము కాటు పడకుండా ఎన్నో కట్టుదిట్టాలని చేసుకున్నాడు. కాని చివరికి పాము కాటుతోనే మరణించాడు కదా!!"

"అంతటి మహానుభావులే ప్రారబ్ద కర్మ ఫలాన్ని తోసివేయలేక పోయినప్పుడు, ఇక సామాన్యుల విషయం చెప్పగలమా? కాబట్టి పూర్వ జన్మల్లో మనం చేసిన చెడు పనులకి ఫలితంగా ఈ జన్మలో వచ్చే కష్టాలని అనుభవించి క్షయం చేసుకోవడం తప్ప పరిహారాలు అంటూ ఉండవు, అని, ధర్మసేతువు అనే గ్రంధంలోని ఈ శ్లోక భావం".

"ఏ జీవికి అయినా భూత కాలంలో చేసిన కర్మలని బట్టి ఈ రోజు నిర్మాణమై ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే, ప్రతి జీవి పూర్వ కర్మల తయారీ సరుకు. పూర్వం అతను నీచపు పనులు, అశుద్ధమైన కర్మలు చేసి ఉంటే ఇప్పుడు అతడు నీచ జన్మని పొందుతాడు. పూర్వం ఉన్నతమైన పనులు, శుద్ధ కర్మలు చేసి ఉంటే ఇప్పుడతను ఉన్నతమైన జన్మని పొందుతాడు".

"ప్రారబ్దం పూర్వకాలానికి సంబంధించినది. వెనకటి కర్మల వల్ల ఏర్పడింది. ఓ సారి చేసేసిన కర్మలని మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి మార్చుకోలేం. దాంతో వాటిని అనుసరించి వచ్చిన నేటి ప్రారబ్దాన్ని కూడా మనం మార్చలేం. ప్రారబ్ద కర్మ ఎంత శక్తివంతమైందో వివరించడానికి నిజంగా జరిగిన ఈ సంఘటనని కధగా ఉత్తర భారతదేశంలోని సత్సంగాల్లో చెప్తారు."

"ఓ నాస్తికుడు ఓ రాత్రి తన దుకాణంలోనే కూర్చుని బట్టలు కుడుతూ, పక్కనే గుళ్ళో హరిదాసు చెప్పే హరికధని విన్నాడు".

“విధిని ఎవరూ తప్పించుకోలేరు. చెడైనా, మంచైనా సరే దానికి మనం తల ఒగ్గి అనుభవించి తీరాలి.” చెప్పాడా హరిదాసు",

"ఆ నాస్తిక దర్జీ వెంటనే లేచి వెళ్ళి హరిదాసుతో గట్టిగా చెప్పాడు. “మనిషి తన స్వప్రయత్నంతో విధిని ఎదిరించ గలడు." కొంత ఆథ్యాత్మిక పరిపక్వత గల ఆ హరిదాసు బదులు చెప్పాడు."

“సరే. ఈ రాత్రికి నీకు కర కర ఆకలి వేస్తున్నా ఎవరో బలవంతంగా తినిపించడం వల్లే నువ్వు తినాలని నీకు రాసి పెట్టి వుంది. దాన్ని తప్పించుకోగలవేమో చూడు. అప్పుడు నీకే తెలుస్తుంది.”

“తినాలా తినకూడదా అన్న స్వతంత్రం నాకుంది కాబట్టి నేను దాన్ని వుపయోగించుకుని వస్తే తినను. రేపు ఉదయం మీ దగ్గరకి వచ్చి మీరు తప్పని చెప్పి తీరతాను.” హరిదాసు నవ్వి ఊరుకున్నాడు."

"ఇంతలో ఇంటినించి దర్జీవాడి భార్య తన భర్త కోసం అన్నం తీసుకువచ్చింది".

"ఆకలి లేదంటే 'నేను కలిపి పెడతాను. రెండు ముద్దలు తినండి. రాత్రంతా పని చేయాలిగా' అని బతిమాలసాగింది. దర్జీవాడు వెంటనే భార్యకి చెప్పా పెట్టకుండా దగ్గరలో వున్న అడవికి వెళ్ళాడు".

"విశాలమైన ఓ చెట్టెక్కి దాని గుబురు కొమ్మల్లో దాక్కున్నాడు. తెల్లారేదాకా అతను చెట్టు దిగదలచు కోలేదు. కొద్ది సేపటికి ముగ్గురు బాటసారులు ఆ చెట్టు కింద ఆగి, అన్నం మూటలు విప్పారు."

"రాత్రికి ఆ చెట్టు కింద విశ్రమించి మర్నాడు వుదయం తమ ప్రయాణాన్ని కొనసాగించ దలచుకున్నారు. విస్తళ్ళలో అన్నం వడ్డించుకుని తినబోతూండగా దగ్గర నించి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. భయంతో వాళ్ళు ముగ్గురూ లేచి పరుగు లంకించుకున్నారు".

"వాళ్ళు వదిలి వెళ్ళిన ఆహార పదార్ధాలు ఆకర్షణీయంగా కనిపించడమే కాక, వాటి నించి కమ్మటి వాసనలు వేయసాగాయి. అది విధి తనకి పెట్టే పరీక్షగా తలచి, పట్టుదలగా ఉన్న దర్జీవాడు చెట్టు దిగి వచ్చి ఆహారాన్ని ముట్టలేదు. నిద్రకి ఉపక్రమించాడు."

"కొద్ది సేపటికి దర్జీకి అలికిడి వినబడటంతో కిందకి చూస్తే ముగ్గురు కొత్త వ్యక్తులు కనిపించారు. గ్రామంలోంచి వాళ్ళు దొంగిలించి తెచ్చిన నగల మూటల్లోని నగలని పంచుకున్నారు. "ఆహా! దేవుడు ఎంత దయామయుడో కదా! మన ఆకలిని గుర్తించి మనకోసం అన్నం సిద్ధం చేసాడు.” ఆహారాన్ని చూసి చెప్పాడు ఒక దొంగ".

"వెంటనే రెండో దొంగ దాన్ని ఖండిస్తూ చెప్పాడు. “మూర్ఖుడా! ఇది దేవుడి పని కాదు. ఎవడో మనం దొంగిలించాక ఇక్కడికే వస్తామని కనిపెట్టి, ఈ భోజనాన్ని అమర్చాడు".

"దీంట్లో ఏ విషమో కలిపి మనం తిని చావగానే ఈ నగలని కాజేయాలని వాడు ఎత్తు వేసి వుంటాడు.” “అవును. ఈ భోజనం ఏర్పాటు చేసినవాడు ఈ చుట్టుపక్కలే ఎక్కడో దాక్కుని ఉంటాడు. వాడ్ని వెదుకుదాం పదండి.” మూడో దొంగ చెప్పాడు. దొంగలు ముగ్గురూ తమ దగ్గరున్న కాగడాలతో ఆట్టే సేపు వెదక్కుండానే చెట్టు కొమ్మల్లో దాక్కుని వున్న దర్జీ వాడ్ని చూసి కిందకి దింపారు".

“దీంట్లో ఏం కలిపావు? అసలు మేం ఇక్కడికి వస్తామని నీకెలా తెలుసు?” గద్దించారు దొంగలు".

"ఆ ఆహారం అక్కడికి ఎలా వచ్చిందో చెప్పాడు. వాళ్ళు అతని దర్జీవాడు మాటలు విశ్వసించలేదు".

“సరే. నువ్వు చెప్పింది నిజమైతే ఈ అన్నం తిను.” ఆజ్ఞాపించారు. “ఇప్పుడు కాదు. సూర్యోదయం అయాక తింటాను.”

"దర్జీవాడు వెంటనే అన్నం తినడానికి అంగీకరించక పోవడంతో దొంగలు ముగ్గురికీ అన్నంలో విషం కలిపాడన్న అనుమానం బలపడింది. దాంతో వెంటనే ఆ అన్నం తినకపోతే చంపుతామని బెదిరించారు."

“చంపండి. అప్పుడు నేను విధిని జయించినవాడ్ని అవుతాను. కాని తినను.” మొండిగా చెప్పాడు వాడు".

"ఆ “వీడి చేత ఈ విషం కలిపిన అన్నం తినిపించి చంపుదాం.” ఓ దొంగ, వాడ్ని కదలకుండా పట్టుకున్నాడు".

"రెండో దొంగ దర్జీవాడి నోరు పెగలదీస్తే మూడోవాడు బలవంతంగా వాడి నోట్లో అన్నం కుక్కి నీళ్ళు తాగించి ఆ అన్నం మొత్తం వాడి కడుపులోకి దిగేలా చేసాడు. ఎంత సేపటికీ వాడు చావకపోవడంతో ఆ దొంగలకి అతను నిజమే చెప్పాడనుకున్నారు".

“అందులో విషం కలపకపోతే మరి చావడానికి కూడా సిద్ధ పడ్డావు కాని ఎందకు తిననన్నావు?”ఆశ్చర్యంగా అడిగారు దొంగలు".

"తను ఆ చెట్టు మీద ఎందుకు దాక్కున్నాడో దొంగలకి వివరించాడు దర్జీవాడు. మర్నాడు వాడు హరిదాసు దగ్గరకి వెళ్ళి జరిగింది చెప్పాడు. “ప్రతీది మన ప్రారబ్ద కర్మ ప్రకారమే జరుగుతుంది అని నీకు ఇప్పుడు అర్ధమైందా?"

"నా మాటలకి నీకు రోషం వచ్చి ఆ అడవికి వెళ్ళి అక్కడ దాక్కోవడం, ముగ్గురు బాటసారులు అన్నం తేవడం, పులి అరవడం, వాళ్ళు పారిపోయాక దొంగలు రావడం, వాళ్ళల్లో ఒకరికి అది విషం కలిపిన అన్నం అని అనుమానం కలగడం మొదలైనవన్నీ నీ ప్రారబ్ద కర్మని తీర్చడానికి సహకరించడానికి ఆ విధాత రాసిన సహాయ కర్మలే తప్ప వేరు కావు."

"ప్రతీ ప్రారబ్ద కర్మ తీరడానికి ఇలా మనతో ప్రమేయం వున్న లేదా లేని అనేక సంఘటనలు, వస్తువులు, మనుషులు అందుకు సహాయకారులుగా వుంటారు. ” వివరించాడు హరిదాసు."

"ఆ దర్జీవాడి పేరు మాలుకా దాస్. ఇప్పటి అలహాబాద్ దగ్గర్లో వున్న 'కడే కి మాయి' అనే గుడి దగ్గర ఆ తర్వాత అతను తపస్సు చేసుకుని ఆధ్యాత్మికంగా వున్నత స్థితికి చేరుకున్నాడు."
🌼🪷🌼🪷🌼


సేకరణ

No comments:

Post a Comment