Friday, July 15, 2022

సార్థక జీవి...!!* సార్థక జీవులు అంటే...!!! జీవితంలో లభించే అపురూప వరాలు ఏమిటి...? *ముముక్షుత్వం...!!

 *సార్థక జీవి...!!*

సార్థక జీవులు అంటే...!!!

జీవితంలో లభించే అపురూప వరాలు ఏమిటి...?


*ముముక్షుత్వం...!!*


మానవ జన్మను సార్థకం చేసుకోవటం అంటే ఈ ప్రపంచమూ, ఈ విషయాలు, భోగాలు అన్నీ అనిత్యమని, వాటిని చూచే, అనుభవించే, భోగించే దేహమనోబుద్ధులు కూడా అనిత్యమని తెలుసుకొని వాటి యొక్క తాదాత్మ్యం నుండి విడివడి నిత్యమైన, సత్యమైన ఆత్మతో తాదాత్మ్యం చెందాలని, తద్వారా ఆత్మగా బ్రహ్మముగా జీవిస్తూ శాశ్వతానందాన్ని మోక్షాన్ని పొందాలనే తపనతో ఎవరు ప్రయత్నిస్తుంటారో, ప్రయత్నించాలనుకుంటారో వారే సార్థక జీవులు...


అట్టి తీవ్ర ముముక్షుత్వం మోక్షాపేక్ష ఎవరికుంటుందో వారి జన్మయే ఉత్తమ జన్మ. వారి జన్మయే సార్థకజన్మ...


*మహాపురుష సంశ్రయః...!!*


కేవలం మోక్షాపేక్ష ఉన్నంత మాత్రాన ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు. 

అది తెలియాలంటే శాస్త్రాల ద్వారానే తెలియాలి. 

ఐతే ఆ శాస్త్రాలను ఎవరికి వారు అధ్యయనం చేయలేరు... అవకాశం రాదు, వచ్చినా అధ్యయనం చేసినా తెలుసుకోలేరు...

ఎందుకంటే నిగూఢ పదాలతో గంభీర భావాలతో ఉపనిషత్తులు, వేదాంత శాస్త్రాలు కీకారణ్యంలా ఉంటాయి...

వాటిని విశ్లేషించి, అనుభవ పూర్వకంగా గ్రహించి శిష్యుల యొక్క బుద్ధి స్థాయికి తగినట్లు దిగివచ్చి చెప్పే గురువులు కావాలి...

      అట్టి గురువులు శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, కరుణాసముద్రులు అయి ఉండాలి...

అట్టివారి సాంగత్యం లభించటం అన్ని అదృష్టాల కన్నా మహా అదృష్టం, అసలు కొందరిలో మోక్షాపేక్ష కూడా మహాత్ములైన గురువుల సాంగత్యంలోనే కలుగుతుంది... 

మహాత్ముల సాన్నిధ్యం వల్లనే మనలో జ్ఞానబీజం నాటుకుంటుంది. 

మోక్షాసక్తి కలుగుతుంది, మోక్షమార్గంలో ప్రయాణించటానికి మార్గం దొరుకుతుంది, సందేహాలు తొలగించుకొని ముందుకు వెళ్ళే వీలు కలుగుతుంది...


ఇది అతి అరుదుగా లభిస్తుంది, ఎన్నో జన్మల సుకృతం ఉండాలి, ఎన్నో జన్మలలో గురువుకోసం మార్గదర్శనం కోసం తపించి ఉండాలి. 

అట్టి సుకృతం ఉంటే గురువే నీ దగ్గరకు వస్తాడు, లేకపోతే ఎదురుగా గురువు ఉన్నా గుర్తించలేని గ్రుడ్డివాడివవుతావు. 

జ్ఞాన స్వరూపుడైన గురువు లభించటం అతి అరుదుగా లభించే మహావరం. 

ఇలా కేవలం మానవజన్మ లభించటమే గాక సద్గురువు లభించటం మోక్షాసక్తి కలగటం, అపురూప వరాలు, ఇవన్నీ భగవదానుగ్రహం వల్లనే లభిస్తాయని శంకరులు అంటున్నారు...


ఎక్కడో ఆకాశంలో ఎవరికీ కనపడకుండా కూర్చున్న భగవంతుడు ఈ వరాలు కొందరికి ప్రసాదిస్తాడని భావించరాదు. 

వారి వారి కృషిని బట్టే భగవంతునిచే అనుగ్రహించబడినవని అర్థం చేసుకోవాలి, అనేక జన్మలలో కృషి చేసి, సాధనలు చేసి, తపన పడి, సరియైన గురువు లభించక పోయెనే అని ఆరాటపడితే ధర్మమార్గంలో అనేక జన్మలలో ప్రయాణిస్తే, సత్కార్యాలు, ధర్మకార్యాలు చేస్తే, చేసి ఉంటే వాటి ఫలితంగా కలిగేదే ఈ వరం...


అనేక జన్మల పుణ్యఫలంగా నీవు సాధించిన జన్మమే ప్రస్తుతపు ఈ జన్మ , అదే దైవానుగ్రహం అని చెప్పబడుతున్నది. 

ఈ జన్మలో భగవద్గీతను, వేదాంత శాస్త్రాలను, ఉపనిషత్తులను వినగలుగుతున్నారంటే అనేక జన్మల సుకృతఫలం వల్లనే, అలాగే ఆధ్యాత్మిక సాధనలను సాగించ గలుగుతున్నారంటే లక్షల జన్మల సుకృత ఫలం ఉండబట్టే...

కనుక ఇవే మానవుడుకి జీవితంలో లభించే అపురూప వరాలు... 

No comments:

Post a Comment