Tuesday, July 12, 2022

ఇద్దరూ ఇద్దరే / దొందూ దొందే / గంతకు తగ్గ బొంత* (జాతీయం వెనుక కథ)-డా.ఎం.హరికిషన్-కర్నూలు)

 *ఇద్దరూ ఇద్దరే / దొందూ దొందే / గంతకు తగ్గ బొంత* (జాతీయం వెనుక కథ)-డా.ఎం.హరికిషన్-కర్నూలు)

*************************

        ఇద్దరూ ఇద్దరే అంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. అన్నిట్లో ఇద్దరూ సమవుజ్జీలే అని అర్థం. అది చదవడంలో కావచ్చు, సాహసాలు చేయడంలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, ఆటపాటలలో కావచ్చు... ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ వుండి ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో చెప్పలేనప్పుడు, ఎవరినీ తీసివేయడం సాధ్యం కానప్పుడు ఇద్దరూ ఇద్దరే అనే జాతీయం వాడతాం.


దీనికి పూర్తిగా వ్యతిరేకార్థంలో "దొందూ దొందే" అనే జాతీయం వచ్చింది. ఇద్దరూ తెలివి తక్కువ వాళ్ళే, ఇద్దరూ మూర్ఖులే, ఎవరూ గొప్ప వాళ్ళు కాదు. ఒకరిని మించిన మూర్ఖులు మరొకరు అని చెప్పడం కోసం దొందూ దొందే అని నవ్వుతూ అంటాం.


దీని వెనుక ఒక కథకూడా సరదాగా వాడుకలో వుంది.


ఒకూర్లో ఒక పిల్లోడు వుండేవాడంట. వానికి చిన్నప్పటినుంచీ నత్తి. పాపం చాలా మంది వాని నత్తిమాటలు విని వెక్కిరించేవాళ్ళంట. దాంతో ఆ పిల్లోడు పెరిగి పెద్దయ్యాక పెళ్ళి చేయడం చాలా కష్టమయిందట. దాంతో వాళ్ళ నాయన బాగా ఆలోచించి “రేయ్... మనూరికి ఇటుపక్క ఏడూర్లు, అటు పక్క ఏడూర్లు అన్నిట్లోనూ నీ నత్తి గురించి అందరికీ తెలిసిపోయి... చచ్చినా పిల్లనివ్వమని వచ్చినవాడు వచ్చినట్టు వెనక్కి తిరిగిపోతున్నాడు. దిగే గడప, ఎక్కే గడపే గానీ పని పూర్తి కావడం లేదు. కాబట్టి ఇక్కడికి దూరంగా నీ గురించి ఎవరికీ తెలీని వూర్లో ఏదయినా సంబంధం వెతికి తెస్తాను. అమ్మాయి తరుపు వాళ్ళు వచ్చినప్పుడుగానీ, పెళ్ళిలో గానీ పొరపాటున గూడా నువ్వు నోరిప్పకు. నీకు చాలా మొహమాటం, సిగ్గు, కొత్త వారితో అంత తొందరగా మాట్లాడడు అని చెబుతాం" అన్నాడు. దానికి వాడు సరే అలాగే అన్నాడు.


ఆ పిల్లోని నాన్న చాలా దూరప్రాంతంలో ఒక సంబంధం వెదికి కష్టపడి కొడుక్కి పెళ్ళి చేశాడు. పెళ్ళయ్యాక పెళ్ళికూతురు, పెళ్ళి కొడుకులని పల్లకిలో కూచోబెట్టుకోని వూరేగింపుగా తీసుకొని పోతున్నారు.


దారిలో వరుసగా చింతచెట్లు వచ్చాయి. అన్నిటికీ తెల్లగా పూలు పూచాయి. చూడ్డానికి చాలా మధురంగా వున్నాయి. ఆ చింతచెట్లు చూచిన సంబరంలో అంతవరకు నోరిప్పని పెళ్ళి కొడుకు తనకు నత్తన్న విషయం మరచిపోయి పెళ్ళికూతురితో...


"తింతతెట్లు పూతినాయి తూతావా" అన్నాడట. ఆ మాటలు విన్న పెళ్ళికూతురు "ఆ తూడకేం... పూతేకాలం వత్తే పూతక పోతాయా" అనిందట.


ఆ ఇద్దరి మాటలు విని చుట్టు పక్కల వాళ్ళందరూ "అరెరే.. ఏమో అనుకున్నాం కానీ... పెళ్ళి కొడుక్కే కాదు పెళ్ళి కూతురికి గూడా నత్తే, దొందూ దొందే" అనుకుంటూ పడీపడీ నవ్వినారంట. ఇదీ కథ.

***************************

 *కుంభకర్ణ నిద్ర (జాతీయం వెనుక కథ )* -డా.ఎం.హరికిషన్-కర్నూలు

*************************

         నిద్ర అనేది ఒక వరం. మానసికంగా, శారీరకంగా అలసిపోయిన మనిషి తిరిగి నూతన ఉత్తేజం పొందడానికి నిద్ర ఎంతో అవసరం. చిన్న పిల్లలు ఎక్కువగా నిద్ర పోతుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రపోయే సమయం తగ్గుతూ, పని చేసే సమయం పెరుగుతూ వుంటుంది. ఆరోగ్యవంతమైన జీవితానికి ఆరుగంటలు నిద్ర తప్పనిసరి. కానీ కొందరు బద్దకస్తులు వుంటారు. వీరు అవసరాన్ని మించి నిద్రపోతూ వుంటారు. అతినిద్ర అనేక సమస్యలకు, అనారోగ్యానికి దారితీస్తుంది.


మనచుట్టూ ఏమి జరుగుతున్నా పట్టించుకోకుండా, ఎంత పెద్ద శబ్దాలు వచ్చినా లేవకుండా, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడూ నిద్రపోయే దానిని 'కుంభకర్ణ నిద్ర' అని అంటారు.


అసలు ఈ జాతీయం ఎలా వచ్చిందంటే కుంభకర్ణుడు రావణుని సోదరుడు. మహాబలవంతుడు. చాలా పెద్ద శరీరం కలవాడు. చిన్నప్పటినుంచీ పెద్ద పెద్ద జంతువులను అవలీలగా పట్టుకొని గుటుక్కున మింగేసేవాడు. వాన్ని చూసి అందరూ భయంతో వణికిపోయేవారు.


రావణ, కుంభకర్ణులు ఇద్దరూ బ్రహ్మ గురించి తపస్సు చేయడం మొదలు పెట్టారు. You కుంభకర్ణుడు చాలా రోజులు అరివీర భయంకరంగా తపస్సు చేయసాగాడు. అది చూసి ఇంద్రుడు భయపడి బ్రహ్మ దగ్గరికి పోయాడు. "స్వామీ... మీరు గనుక కుంభకర్ణునికి ప్రత్యక్షమయి అతను కోరిన వరాలు ఇస్తే... అసలే భయంకరమైన బలం కలిగిన కుంభకర్ణుడు ఎవరిని ఏం చేస్తాడో తెలీదు. కాబట్టి నువ్వు ఎలాగయినా సరే ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడాలి" అని ప్రార్థించాడు.


దాంతో బ్రహ్మ సరస్వతిని పిలిచి వరం కోరే సమయంలో నువ్వు 'అతని నాలుకపై వుండి అతను ఆరు నెలలు నిద్ర, ఒకరోజు భోజనం కోరుకునేటట్లు చేయి” అన్నాడు.ఆమె సరేనని అలాగే చేసింది. అందుకే కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతాడు. ఒక రోజు మాత్రమే లేస్తుంటాడు.

అందుకే  ఎవరైనా సరే ఎప్పుడూ నిద్రపోతుంటే వానిది "కుంభకర్ణ నిద్ర" అనడం ఈ కథ ఆధారంగానే వచ్చింది .

**************************

No comments:

Post a Comment