*జీవిత వైకుంఠపాళి*
బాల్యంలో ఆడే ఆటల్లో పరమపద సోపానం (వైకుంఠ పాళి) ఒకటి. మొదటి గడినుంచి ప్రారంభమయ్యే ఆట క్రమంగా ముందుకు సాగుతుంది. ఒక్కొక్కసారి. నిచ్చెనలు ఎక్కి పైకి ఎగబాకడం మరోసారి పాము బారిన పడి కిందికి దిగజారడం క్రీడలో భాగం. అన్ని అడ్డంకులను అధిగమించి చివరకు విజయ లక్ష్యం సాధిస్తే విజేత అవుతారు. అదేవిధంగా జీవితం ఒక క్రీడ, సుదీర్ఘ జీవితకాలం ఒక మైదానంలో క్రీడా స్ఫూర్తితో ఆడాలి... పోరాడి గెలవాలి. అదే జీవిత వైకుంఠపాళి ఆట
ఒక్క విజయం సిద్ధిస్తే ఆట ఆగిపోదు. చివరి వరకు ఆడి విజయ పతాకాన్ని ఎగురవేయాలి. జీవితంలో అనేక విజయాలు, మరెన్నో పరాజయాలు తటస్థించి.. ఆశ నిరాశలకు గురిచేస్తాయి. ఇక నేను సాధించలేను ఓడిపోయాను అనిపిస్తుంది. అప్పుడే ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆశాభావం అవసరం.
పసివయసులో ఎదుగుదల కఠోర పరిశ్రమ పొట్టను నేలకు ఆనించి ముందుకు పాకడం, మోకాళ్లమీద చేతుల సహాయంతో సాగడం, కూర్చోవడం, నిలబడటం, తడబాటు అడుగుల నడక క్రమంగా పరుగు... ఇవన్నీ మన కాళ్లమీద మనం నిలవాలనే లక్ష్యంగా సాగే సాధనా ప్రక్రియలు. జీవితంలో ప్రతి సన్నివేశం మనల్ని భయపెడుతుంది. నిలిచి గెలవగలమా అనే సందేహం కలుగుతుంది. ధైర్యాన్ని నింపుకొని సముచిత నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేస్తే విజయం తథ్యం. ఆరంభింపరు నీచ మానవులు ఆరంభించినా మధ్యలో వదిలేవారు బలహీన మానవులు వారే పరాజితులని భర్తృహరి పేర్కొన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకే లక్ష్యంతో సాగితే... విజయమాల వరిస్తుంది. వారే ధీరులు, ఉత్తములని కీర్తించాడు.
పోటీతోనే ఆట సాగాలి. గెలవాలన్న పట్టుదల, తెగింపు ఉండాలి. ఆట మైదానమైనా, జీవన విధానమైనా... విజయ పతాకాన్ని ఎగురవేయాలి. బాల్యంలో చదువుల్లో పోటీ విషయాలు అర్ధం చేసుకుని పరీక్షలో అత్యున్నత స్థాయికి చేరి ఉద్యోగంలో స్థిరపడేందుకు యువత ఆరాటం, ఆశయం. ఎంచుకున్న వృత్తిలో గా ఎదగాలనే వృత్తిధర్మం... ఇవన్నీ పోటీలే. వివాహం. కుటుంబం... అన్నీ జీవిత రణరంగ విన్యాసాలు.
మనసును బలహీనపరచే పిరికితనం చంచలత్వం వైపు మరల్చితే దిగజారడం. తప్పదు. దైర్యం, పట్టుదల, నిరంతర కృషి వైపు మనసును మళ్ళిస్తే విజయం తథ్యం. శ్రద్ధ ఓర్పు సహనం ప్రేమ- ఇవే విజయతీరాలకు చేర్చే దిక్సూచులు. పరాజయాలు జీవితంలో సహజం అనే సమస్థితి సాధించాలి. రోదనలతో వేదన చల్లారుతుంది కానీ విజయం లభించదు. పడిన చోటు నుంచే పైకి లేవాలి. ఓడిన చోట గెలుపు సాధించాలి. పురాణాలలో ఉత్థాన పతనాల కథలు ఎన్నో కనిపిస్తాయి. ఓటమి: అంచున నిలబడిన వారూ గెలుపు తీరాలకు చేరారు. సత్యమార్గంలో హరిశ్చంద్రుడు భార్యను దూరం చేసుకుని, కాటి కాపరిగా మారి కొడుకును కోల్పోయినా ఓటమిని అంగీకరించలేదు. లంకలోని చీకట్ల తెరలు చీల్చి, సీతమ్మ జాడతో వెలుగు నింపిన హనుమంతుడు విజయ వీరత్వాన్ని సాధించాడు. దక్షిణాఫ్రికా అవమానాలతో కర్తవ్యదీక్ష పూనిన బాపూజీ మాతృదేశానికి స్వతంత్రం సాధించారు. ప్రతి భారతీయుడి గుండెలో జాతిపితగా నిలిచిన గాంధీ పరాజయాలను లెక్క చేయలేదు. పరాజయం పతనం కాదు... అది విజయానికి పునాది. సూర్యోదయాన్ని తెచ్చే ఉదయ సంధ్య, ఉన్నత స్థాయికి చేర్చే తొలి మెట్టు.
No comments:
Post a Comment