Thursday, July 28, 2022

నిత్యజీవితంలో భగవద్గీత

 నిత్యజీవితంలో భగవద్గీత

🔹🔸🔹🔸🔹🔸🔸

భగవద్గీత మానవ జీవితానికి జీవనవేదం. మనిషి జీవితం ఎన్నో ఎత్తుపల్లాలు మయం. మాయామోహితం. రాగద్వేష మాయం. ఇట్టి త్రిగుణాత్మ భూయిష్ఠమైన జీవితం సాఫీగా సాగాలి అంటే ప్రతీవానికి జీవితంలో బలమైన ఊత అవసరం. ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే ఆ ఊతే భగవద్గీత.

 ఆ గీతాచార్యుని త్రికరణ శుద్ధిగా నమ్మి ఎందరో ఈ భాగవద్గీత పారాయణ చేసుకుని తరించిపోయారు. 

శ్రీకృష్ణ పరమాత్మ అర్జనుని మిషగా పెట్టి లోకానికి ఉపదేశించిన జీవితసారం భగవద్గీత. దీనిని గనుక జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోగలిగితే మానవజీవితం తామరాకుపై నీటి బొట్టు వలే సాగిపోతుంది. 

చాలా మందిలో భగవద్గీత జీవిత చరమాంకం లో ఉన్నవారికే అనే అపప్రధ ఉంది. కానీ వాస్తవానికి జీవించడం ప్రారంభించిన మొదలు అవగాహన చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని నేపధ్యం చాలా విశిష్టం గా ఉంటుంది. అర్జున విషాదయోగం తో ప్రారంభించి కర్మ జ్ఞ్యాన వైరాగ్యాలను ఉపదేశిస్తాడు. పరంధాముడు. 

జీవితం అనిత్యం అశాశ్వతం అట్టిదానిగురించి దుఃఖించుట భీరువుల లక్షణమంటాడు. 

మానవునికి కర్మ చేయుటయందే అధికారముంటుంది గానీ దాని ఫలితం మీద ఉండదు. అట్లని కర్మ చేయడం మానరాదు.. ఈ శ్లోకాన్ని విశ్లేషించుకుంటే కర్తవ్యానికి బాధ్యతకు తేడా చెప్పబడింది. మనిషి కర్తవ్యాన్ని నిర్వహిస్తే తృప్తి కలుగుతుంది అదే బాధ్యత అనుకుంటే బరువుగా అనిపిస్తుంది. మనం చేసే పనిమీద కన్నా దాని ఫలితం మీద దృష్టి సారించడం ఎలాంటిదంటే కుక్కర్ లో బియ్యం పెట్టి మాటిమాటికి మూతతీసి చూడడం వంటిది. 

మరొక శ్లోకం లో స్వామి ఎప్పుడెప్పుడైతే ధర్మం గతితప్పుతుందో అప్పుడప్పుడు నేను ధర్మసంస్థాపనకు అవతరిస్తాను అంటాడు. పరమాత్మ ధర్మపక్షపాతి. ఆయన అవతార స్వీకరించింది మొదలు ధర్మ రక్షణ తన ప్రధమ కర్తవ్యం గా పెట్టుకొన్నాడు. అదే ధర్మ సంస్థాపన కొరకు కురుక్షేత్ర సంగ్రామం నిర్వహించి పాండవులకు రావలసిన రాజ్యాన్ని ధర్మబధ్ధంగా ఇప్పించాడు. 

అరిషడ్వార్గాలు గురించి వివరిస్తూ, మానవుడు ఒకవిషయం గురించి కామించితే అది క్రోధం గా మారి దాని వలన బుద్ధి నశించి తుదకు అధోగతి పాలవుతారని విశ్వమానవాళికి సందేశమిచ్చారు పరంధాముడు. ఇది నిత్య సత్యం. అందుకే ఎవరికీ అధర్మ బద్ధమైన కామనలు ఉండకూడదు. కోరికలను ధర్మం తో ముడివేస్తే అట్టి ధర్మ సమ్మతమైన కోరికని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు. 

గంగాజల పానమెటులో భగవద్గీత పారాయణ రెండు కూడా ముక్తిహేతువులే. బాల్యప్రాయం నుంచి గనక భగవద్గీత శ్లోకాలను పిల్లలుచేత సాధనచేయించి ఆచరణలో పెట్టించ గలిగితే వారు జీవితంలో కర్త్రుత్వ భావనకలిగి నిరపేక్ష బుద్ధితో జీవించగలరు.

 ఎప్పుడైతే పిల్లలు, యువత యొక్క ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుందో, అప్పుడు నిరాశావాదం తొలగి జీవితంలో ప్రతీక్షణం ఉత్సాహం గా ఉల్లాసంగా ఉండి జీవితంలో అన్నీ రంగాలలో పురోభివృద్ధి సాధిస్తారు. అప్పుడు ఈ ఆత్మహత్యలు నివారింపబడి ముఖ్యంగా యువత విశ్వశాంతి నెలకొల్పుతారు.

 స్వామీ వివేకానంద, మహాత్మా గాంధీ వంటి వారు నిత్యం భగవద్గీత పారాయణ చేసుకొని, వారికి నిత్య జీవితం లో ఎదురయ్యే ఎన్నో సవాళ్లకు సమాధానం పొందారు. ఈ గీతాసారం ఆధునిక యాజమాన్య నిర్వాహణకు కావలసిన ఎన్నో సూత్రాలను తెలియజేస్తుంది 

గీతాపారాయణం నిత్యకృత్యం అనుసరణీయం

ఇటీవల ఒక ముఖ పుస్తక మిత్రుడు తాను ఇంతకాలం ఎవరికీ పెట్టకుండానే భుజించేవాడినని కానీ భగవద్గీత లోని ఒక వాక్యం తన జీవనాగమనాన్ని మార్చిందని తెలియచేసారు.. మనలో చాలా మంది భగవద్గీత వింటారు చదువుతారు, కానీ ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకోరు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారిని ఆచార్యులుగా పేర్కొంది. 

అందుకే శ్రీకృష్ణుడు గీతాచార్యుడు అయినాడు. నిత్యజీవితంలో భగవద్గీత ప్రయోజనం ఇదే.

🔹🔸🔹🔸🔹🔸🔹🔸

No comments:

Post a Comment