Saturday, July 30, 2022

రమణోపదేశం... అదే ధ్యాన ఫలం....

రమణోపదేశం

రమణుల ఉపదేశం సరళ గంభీరం. కర్తతో ప్రారంభమై కర్మ విచారణ సాగి ఆత్మవిచారంతో ముగిసే వారి ఉపదేశాలసారం అమృతతుల్యం. మనిషి ఏ కర్మ చేసినా దాన్ని భగవదర్పితం చేయాలి. సమర్పణవల్ల బంధం దూరమ్తైపోతుంది. బంధం లేనప్పుడు వియోగం ఉండదు. కర్మలు నిస్వార్థంగా ఉండాలి. స్వార్ధరహిత కర్మలే ఆనందాన్ని పంచుతాయి. ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు రమణులు ఇలా చెప్పారు- శరీరం, వాక్కు మనసు... ఈ మూడింటినీ సాధకుడు తన సాధనలో జాగ్రత్తగా వాడుకోవాలి. శరీరం ద్వారా పూజ చేయాలి. వాక్కుతో జపం చేయాలి. మనసుతో చింతన చేయాలి. దేహంకన్నా వాక్కు, దానికన్నా మనసు, తద్వారా జరిగే పూజ, జపం, చింతనల్లో ఒకదానికంటే మరొకటి ఉత్తమమైనవి. పూజ అంటే దేవుడి ముందు కూర్చుని పత్రి, పువ్వు వెయ్యడమే కాదు. సమస్త జగత్తును పరమేశ్వర రూపంగా భావించాలి. రమణుల బోధ ప్రకారం- మొదట ఏదైనా మంత్రాన్ని బిగ్గరగా పలుకుతూ అటుపై దానికన్నా మంద్రస్థాయిలో అనుకొంటూ ఆ తరవాత మౌనాన్ని ఆశ్రయించి సాగించే ధ్యానం సర్వోత్కృష్టమైనది. ఉత్తమమైన ధ్యానం వల్ల కోరికల తీవ్రత క్రమేపీ నశించి ఆలోచనా ప్రవాహపు ఒరవడి తగ్గి నిశ్చల స్థితి కలుగుతుంది. ధ్యానం వల్ల మనసు మన అధీనంలోనే ఉంటుంది. ఒకసారి అంతర్ముఖ స్థితి కలిగితే బాహ్య వస్తువులపై ఆశ నశిస్తుంది. అదే ధ్యాన ఫలం.



No comments:

Post a Comment