మనోనిగ్రహమే మహా సాధనం!
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎవరూ వృథాగా కాలం వెళ్లబుచ్చకూడదన్నది’ మన పూర్వీకుల సందేశం. నిరంతరాయంగా, ధర్మబద్ధంగా మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే ‘ఆత్మోద్ధరణ’ దిశగా ప్రయాణించాలి. మళ్లీ మళ్లీ పుడుతూ చనిపోయే (‘పునరపి జననం, పునరపి మరణం’) కర్మబంధాలలో చిక్కుకొని అలమటించే పరిస్థితిని తెచ్చుకోకూడదు. ఈ మేరకు, ‘విముక్తి (మోక్షం) కలిగించే తరుణోపాయాన్ని గీతాచార్యుడే మనకు సూచించాడు.
ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానమవ సాదయేత్
ఆత్మైవ హ్యాత్మనోబంధుః ఆత్మైవ రిపురాత్మనః॥
భగవద్గీత (6-5)
సంసార సాగరం నుంచి మనల్ని మనమే ఉద్ధరింపజేసుకోవాలి. లోకంలో మనకు మనమే మిత్రులం, మనకు మనమే శత్రువులం. బయటి శత్రువులను సామదాన భేదదండోపాయాలతో జయించవచ్చు. కానీ, శరీరం లోపలి అంతశ్శత్రువులను జయించడం చాలా కష్టం. ముఖ్యంగా మనసును జయిస్తే అదే మంచి మిత్రుడౌతుంది. జయించలేకపోతే అదే మన పాలిట శత్రువువలె మారి, మనల్ని కుంగదీస్తుంది. మానవులకు అతిపెద్ద శత్రువులైన ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం’ (అరిషడ్వర్గాలు) అనేవి మనలోనే ఉంటాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యమైన వాటికన్నా ఎంతో హానికరమైనవి, నిర్దాక్షిణ్యమైనవి.
ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు. ఎవరికి దాహమేస్తే వారే నీళ్లు తాగినట్లుగా ఎవరి సాధన వాళ్లే చేసుకోవాలి. ఎవరి జ్ఞానాన్ని వాళ్లే సంపాదించుకోవాలి. సద్గురువులను ఆశ్రయించి ధ్యానసాధన చేయాలి. గురు ముఖతఃగానీ, సద్గ్రంథాధ్యయనం వల్లగానీ ఆత్మజ్ఞానాన్ని పొందినవారే ఆత్మోద్ధరణ చేసుకోగలుగుతారు. ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలిచినట్లు మనం ఏ విధమైన కర్మలు చేస్తుంటామో అదేవిధమైన ఫలితాలను పొందుతాం. గురువు, శాస్త్రం, దైవం కూడా చివరికి మన ఆత్మోద్ధరణకు దారి చూపేంతవరకే పరిమితం. మన కాళ్లతో మనమే నడిచినట్లు, మన కండ్లతో మనమే చూస్తున్నట్లు, మన ఆకలిని మనమే తీర్చుకుంటున్నట్లు మనల్ని మనమే ఉద్ధరింపజేసుకోవాలి.
మనసు చంచలమైంది. ఒకవంక మంచిపనుల వైపు, మరొక వంక చెడు ఆకర్షణలవైపు అది లాగుతూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని ప్రయత్న పూర్వకంగా సాధించిన మనిషి మహోన్నతుడవుతాడు. ఇంద్రియ వ్యామోహంలో చిక్కుకున్నవాడు పతితుడవుతాడు. దశకంఠుడైన రావణుడు పది రకాలుగా ఆలోచించేవాడట. అతని నాలుగు తలలు మంచివైపు ఉంటే, ఆరు తలలు చెడువైపు లాగేవట. ఇంద్రియ చాపల్యమే మనిషి పతనానికి హేతువవుతుందన్నది నిజం. కాంచనాన్నీ (బంగారం), గాజు ముక్కనీ సమానంగా చూడగలిగిన శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. వివేకం, వైరాగ్యం కలిగినవారే మనసును జయించగలుగుతారు. అలా, మనోనిగ్రహం కలిగినవానికే మనసు మిత్రునిలాగా మారిపోతుంది. తన ఆప్తమిత్రుడు, బాల్య స్నేహితుడైన శ్రీ కృష్ణుని ఏదో అడగాలనే కోరికతో కుచేలుడు వెళ్లినా, స్వామి దివ్యత్వాన్ని కండ్లారా చూశాక, ఏమీ కోరకుండానే వచ్చేస్తాడు. అడగకుండానే ఐష్టెశ్వర్యాలనూ ప్రసాదిస్తాడు శ్రీకృష్ణ పరంధాముడు. అనన్య స్నేహభక్తి కుచేలునిదైతే, ఆశ్రిత వత్సలత పరమాత్మ తత్త్వం.
మనిషి ఎల్లవేళలా ధర్మబద్ధమైన, సకల ప్రాణి హితమైన కర్మలనే ఆచరించాలి. మనం చేస్తున్న పనులెలాంటివో ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. సాధనతో జ్ఞానాన్ని సమీకరించుకోవాలి. సృష్టిలోని ప్రతి ప్రాణినీ పరమాత్మ స్వరూపంగా చూస్తూ, ప్రేమభావంతో మెలగాలి. అమూల్యమైన కాలాన్ని వృథా చేయకుండా నిరంతరం సత్కర్మాచరణలతో మనసును అదుపులో ఉంచుకోవాలి. నకారాత్మక మనోభావాల (నెగెటివ్ థాట్స్) ప్రభావం వల్లనే ఒత్తిడి, కోపం, విపరీత ధోరణులు, దీర్ఘకాలిక అనారోగ్యం వంటివి కలుగుతాయని మనస్తత్వ శాస్త్రవేత్తలూ అంటారు. కనుక, సకారాత్మక ఆలోచనావిధానాన్ని (పాజిటివ్ థింకింగ్) సాధనతోనే అలవరచుకుందాం.
No comments:
Post a Comment