👵🏻
బామ్మ పంచిన విజ్ఞానం(కథ )✍️ నారంశెట్టి ఉమామహేశ్వరరావు
గుడికి వెళుతున్న బామ్మ చెయ్యి పట్టుకుని అటొకడు , ఇటొకడు నడుస్తున్నారు రవి, గోపి. వాళ్లిద్దరూ ఆమె మనవళ్లు. తొమ్మిది, ఆరో తరగతి చదువుతున్నారు. బామ్మంటే ఊళ్ళో అందరికీ ఇష్టమే. ఆవిడకి తెలియని పద్యం, రాని శ్లోకం ఉండదని అంటారు.
ఒక గుడిసె ముందు నుండి ముగ్గురూ వెళుతుంటే అయిదేళ్ల అమ్మాయికి అన్నం ముద్దలు తినిపిస్తున్న మహిళ వీళ్ళని చూసింది. అన్నం పళ్లెం పక్కన పెట్టేసి అమ్మాయిని దీవించమని బామ్మ ముందుకు తెచ్చిందామె. బామ్మ అలాగే చేసింది.
ఆ అమ్మాయి బామ్మ కాళ్ళకి చుట్టుకుని ముద్దు మాటల్తో ‘పాలబువ్వ ….తింటున్నా ….. ’ అని నోరు చూపించింది. అది పాలబువ్వ కాదని బామ్మ కనిపెట్టేసింది.
‘ పాలబువ్వేనా?’ అనడిగింది అమ్మాయి తల్లిని.
‘మీ దగ్గర అబద్ధం చెప్పలేను. ఇరుగు పొరుగు పిల్లలతో అది ఆడుతుంటే వాళ్ళు పాలబువ్వ తిన్నామని చెప్పారట. ఇది కూడా పాలబువ్వ కావాలని ఏడుస్తుంటే సమయానికి ఇంట్లో పాలు లేకపోవడంతో అన్నంలో చిక్కటి గంజి కలిపాను. తీపి కోసం బెల్లం ముక్క కలిపానమ్మా” అంది బామ్మకి మాత్రమే వినబడేటట్టు.
“అలాగా. సాయంత్రం వచ్చావంటే గ్లాసుడు పాలిస్తాను. పాపకి పాలబువ్వ తినిపించు” అనేసి బామ్మ ముందుకి నడిచింది.
వాళ్ళ మాటలు విన్న గోపి “పాలబువ్వకి గంజన్నానికి తేడా పాపకి తెలీలేదా?” అనడిగాడు.
‘చిన్న వయసు కదరా. తేడా తెలుసుకోలేనంత అమాయకత్వం ఉంటుంది. అది తెలియకే పాపం …. హాయిగా తినేస్తోందని’ బదులిచ్చింది బామ్మ.
గుడి ముందు కొబ్బరికాయల కొట్టు దగ్గరకు వెళ్లారు ముగ్గురూ. అప్పటికి కొట్టు యజమాని లేడు. పదో తరగతి చదివే అతడి కొడుకున్నాడు. అప్పటికే ఒక భక్తుడు పూజా సామగ్రి కొనేసి రద్దయిపోయిన ఐదువందల కాగితాన్ని కుర్రాడికిచ్చాడు. దాన్ని గల్లా పెట్టెలో పడేసి మిగతా డబ్బివ్వబోయాడు కుర్రాడు. జరిగిన మోసం గ్రహించిన బామ్మ ఆ కుర్రాడిని హెచ్చరించింది. అప్పుడా భక్తుడు పొరపాటయిందని క్షమాపణ చెప్పాడు. నోటు కూడా మార్చాడు.
అది చూసిన రవి “ఈ కుర్రాడిదీ అమాయకత్వమేనా? రద్దయిన నోటుకీ, చెలామణిలో ఉన్న నోటుకి తేడా తెలుసుకోలేదు’ అనడిగాడు.
వెంటనే బామ్మ “ఊహూ … వాడిది అమాయకత్వం కాదు . అజ్ఞానం” అంది.
“అదేంటి బామ్మా .. ఇందాకేమో అమ్మాయిది అమాయకత్వం అన్నావు. ఇప్పుడేమో అబ్బాయిది అజ్ఞానం అంటున్నావు. నాకేమీ బోధపడలేద’న్నాడు రవి.
“మనం దర్శనం చేసుకుని వచ్చాక ఇంటికెళుతూ మాట్లాడుకుందాం” అనేసి పూజాసామగ్రి కొనడంలో లీనమయ్యింది బామ్మ.
దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్నప్పుడు రవి “బామ్మా! అమాయకత్వానికి అజ్ఞానానికి తేడా ఉందా? ఇప్పుడు చెప్పు” అనడిగాడు.
“ఉంది. ఇందాక అన్నం తింటున్న అమ్మాయిది చిన్న వయసు. అభం శుభం తెలియని అమాయకురాలు. ఆ వయసులో పాల రుచి, గంజన్నం రుచి తెలుసుకోలేని అమాయకత్వం వాళ్లలో ఉంటుంది. కొట్లో కుర్రాడేమో పదో తరగతి చదువుతున్నాడు. ఆ వయసు వాడికి రద్దయిన నోటేదో తెలియదంటే అమాయకత్వం అనకూడదు. అజ్ఞానం అనాలి“ చెప్పింది బామ్మ.
“ఎందుకు అనకూడదో వివరంగా చెప్ప’మని మనవళ్ళిద్దరూ బ్రతిమాలేసరికి బామ్మ సరేనంది.
“ మేజిక్ షో లలో మెజీషియన్ డబ్బు నోట్లను సృష్టించడం చూసే ఉంటారు కదా. అలా సృష్టిస్తున్న అతడి కౌశల్యం చూసి ఆనందించడం అమాయకత్వం. అతడెప్పుడూ అలాగే డబ్బుని సృష్టించుకుని ఖర్చులకు వాడుకుంటాడని నమ్మడం అజ్ఞానం. ఒక విధంగా చెప్పాలంటే నష్టం లేని ఆనందం పేరే అమాయకత్వం. నష్టం కలిగించే అమాయకత్వం ఏదైనా సరే అది అజ్ఞానమే” అంది బామ్మ.
మనవళ్ల ముఖాల వైపు చూసింది . వాళ్ళ కళ్ళల్లో వెలుగు కానీ మొహాల్లో సంతోషం కానీ కనబడకపోయేసరికి వాళ్ళకి అర్ధం కాలేదని బామ్మ పోల్చుకుని ఇంకా ఇలా చెప్పింది.
“ఆకాశంలో కనబడే చందమామలో కుందేలు ఉందనుకోవడం అమాయకత్వం. అందాల చందమామ మేఘాల మీద కూర్చుని తిరుగుతున్నాడని భ్రమ పడడం అజ్ఞానం. చంద్రుడు కూడా ఒక ఉపగ్రహమేనని, దూరంగా వున్నాడని , సూర్యుడి కాంతి పడడం వలన వెలుగు ఇస్తున్నాడని తెలుసుకోవడం జ్ఞానం. ఈ మూడింట్లో సున్నితమైన తేడా ఉంది. అది గ్రహించాలి.
కొంత వయసు వచ్చేసరికి అమాయకత్వాన్ని వదిలేసి చదువు నేర్చుకుని తగిన జ్ఞానాన్ని సంపాదించాలి పిల్లలంతా. దాంతోబాటు లోకజ్ఞానం కూడా పెంచుకోవాలి. లేకపోతే చిన్న వయసు పిల్లల అమాయకత్వానికి మురిసిపోయి ముద్దు చేసినవాళ్ళే పెద్దవుతున్న కొద్దీ ప్రవర్తనలో తెలివి చూపకపోతే అవహేళన చేస్తారు. చిన్నవయసులో ఆనందించి వదిలెయ్యకపోతే వయసొచ్చాక అదే అజ్ఞానంగా మారిపోతుంది. అందుకే పాఠ్యపుస్తకాలలో బాటు లోకజ్ఞానం పెంచే పుస్తకాలూ, కథలు చదవాలి. తెలియనివి అమ్మానాన్న గురువుల్ని అడిగి తెలుసుకోవాలి” అంది బామ్మ.
“నువ్వు చెప్పినట్టే పుస్తకాలు చదువుతాం. జ్ఞానం పెంచుకుంటాం. అజ్ఞానాన్ని దూరం చేసుకుని తెలివితో ప్రవర్తిస్తాం” అన్నారు రవి, గోపి ఒకేసారి.
మనవళ్ళిద్దరినీ మనస్పూర్తిగా దీవించింది బామ్మ.
—-***—-
No comments:
Post a Comment