పరమపద సోపాన పథము గురించి చాలామందికి తెలియని అద్భుత రహస్యాలు...
వైకుంఠపాళి లేదా పరమపద సోపానము ప్రాచీన భారతీయ ఆట. సుమారు 2వ శతాబ్దములో నుండి ఈ ఆట భారతదేశములో ఉన్నదని చారిత్రీక ఆధారాలు ఉన్నాయి. మన తెలుగువారికి సుపరిచితమైన ఆట.. గవ్వలతో ఆడతారు.. ఈ ఆట యొక్క రూపకర్తలకు నిజంగా జోహార్లు...
ఎన్నో విశేషాలు వున్నాయిందులో..! ఆట పేరు పరమపద సోపాన పటము, "పరమ పదం" అంటే వైకుంఠం లేదా సద్గతి అని అర్ధం.. తద్విష్ణోః పరమం పదం అనేది వేదోక్తి. దీని ప్రకారం విష్ణుమూర్తి ఉండే ప్రదేశమే పరమపదం." అంటే వైకుంఠం. పరమ పదం మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించే వేద ప్రమాణ వచనం. మోక్షప్రాప్తి తరువాత సద్గతి పొందిన మనిషికి మరుజన్మ ఉండదు. ఆ లక్ష్యాన్ని అందుకొనడానికి ప్రయత్నించడమే ఈ ఆటలోని ముఖ్యోద్దేశం.
మనం జీవితంలో ఏ పనులు చేస్తే మనమా లక్ష్యానికి దగ్గరగా వెళ్తామో ఆ ఉన్నతిని సూచించే నిచ్చెనల గళ్ళలో వ్రాసి వున్నాయి. అవి వరుసగాఇలా వున్నాయి. సుగుణం సాలోక్యానికి, సత్ప్రవర్తనము గోలోకానికి, నిష్ఠ తపోలోకానికీ, యాగము స్వర్గలోకానికీ, భక్తి బ్రహ్మ లోకానికీ, చిత్తశుద్ధి మహా లోకానికీ, జ్ఞానము కైలాసానికీ సోపానాలుగా ఉన్నట్లు చూడగలం..
అక్కడకు చేరిన తరువాత ఇక జన్మరాహిత్యం, ఈశ్వరత్వం తో కూడిన పరమపదాన్ని చేరటానికి మన వంతు వచ్చేవరకూ(అంటే సరైన పందెం పడేవరకూ..) ఎదురు చూడడమే. అలాగే అంతవరకూ పోయిన పిదప మత్సర్యమూ, అహంకారం దరి చేరామా మ్రింగడానికి పాము సిద్దంగా వుంటుంది. అది మనల్ని పుణ్య హీనులుగా చేసి రాక్షసులను, హీన జన్ములుగానూ చేస్తుంది. ఈ మొత్తం త్రోవలో మనం మనలోని పాముల లాంటి అవలక్షణాలను ఎన్నో దాటుకొని రావలసి వుంటుంది.
అవి మనలోనే వుండక్కరలేదు. ఆ లక్షణాలు కలిగిన రాక్షసుల దరిచేరినా అధోగతి ( పాము మింగి క్రిందకు పడిపోతాం) పట్టక తప్పదు. ఈ రకంగా సత్య పథంలో ప్రయాణించి, పరమపదాన్ని చేరే మార్గానికి ఈ పటం ఒక'సూచిక' గా మనం అన్వయించుకోవచ్చు.
ఆట తీరు...
వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటంలో 132 గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్ళకు దిగువన పాములు, ఏనుగులు ఉంటాయి. అది పాతాళమనీ, ఆ ఏనుగులు అష్టదిగ్గజాలనీ పైనున్న భూమి (అంకెలు ఉన్న గళ్ళ) ని ఆ ఎనిమిది ఏనుగులూ మోస్తున్నాయనీ హిందువుల విశ్వాసం.
ఆట ప్రారంభించే ముందు ఆటగాళ్ళు తమ తమ ఆటకాయలను పాతాళంలో ఉంచి పందెం వేస్తూ పందాన్ని బట్టి ఆటకాయలను నడుపుతూ ఉంటారు. ఆరు గవ్వలుగాని లేదా పాచికలుగాని పందెం వేస్తూ ఆడుతారు. ఈ ఆటను ఎందరైనా ఆడవచ్చు. అయితే ఆడే వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కరకం ఆటకాయలను ముందుగా ముందే నిర్ణయించుకోవాలి.
వైకుంఠపాళీ పటంలో 16, 19, 30, 41, 52, 63, 74, 79, 87 సంఖ్యలు గల గళ్ళల్లో నిచ్చెనలు ఉన్నాయి. ఏ పందానికైనా ఆటకాయ ఆయా గళ్ళలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న నిచ్చెన సాయంతో పై గడికి చేరుకోవచ్చు. ఉదాహరణకు 16 (సుగుణం) గడిలో ఉన్న నిచ్చెన దగ్గరకు ఆటకాయ వచ్చినప్పుడు ఆ నిచ్చెన సాయంతో28 (సాలోక్యం) గడిని చేరుకుంటుంది. అలా చేరుకోవడాన్ని 'నిచ్చెన ఎక్కడం' అంటారు.
పుణ్యం చేసిన వారికి పుణ్యం దక్కి నిచ్చెనెక్కడ మవుతుందని చెబుతారు. అప్పుడు పై పందెం వేసుకునే అవకాశం ఇస్తారు. పై పందెంవల్ల మళ్ళీ నిచ్చెన ఎక్కినత్లయితే మళ్ళీ మరో పై పందెం- ఇలా ఆట కొనసాగుతూ ఉంటుంది. ఈ పటంలో నిచ్చెనలు ఉన్నట్లుగానే అక్కడక్కడ పాములు కూడా ఉన్నాయి.
ఆటకాయ నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్ళినట్లే పాము తల దగ్గరికి ఆటకాయ వచ్చినప్పుడు పాము కరిచి/మింగి ఆటకాయ పాము తోక చివరివరకూ కిందికి దిగిపోతుంది. కాగా 26 (ద్వేషం) గడిలో ఉన్నది పాము కరచినప్పుడు దాని తోక ఉన్న 3వ గడికి వచ్చి అక్కడ ఉన్న చిన్న పాము మూలంగా ఆటకాయ పాతాళం చేరుకుంటుంది. ఇట్లు పాముతోక దగ్గరకు రావ్డాన్ని 'పాము మింగడం' అంటారు.
ఇక106వ గదిలో ఉన్న పెద్ద పాము మింగిందంటే ఆటకాయ ఒకేసారి 1వ గడిని చేరుకుంటుంది. చివరకు 121 గడిలో ఉన్న పామును తప్పించుకుని 122వ గడికి ఆటకాయ చేరుకున్నట్లయితే పుణ్యపథంలో పడ్డట్టే. అలా, ఆ తరువాతనున్న 132వ గడిని దాటి పైనున్న స్వర్గధామన్ని ఆటకాయ చేరుకుంటుంది.
అక్కడినుండి చివరివరకూ వెళ్ళి తిరుగుముఖం పట్టి మధ్యనున్న విరాట్ స్వరూపాన్ని చేరుకోవాలి. తిరుగు ముఖం పట్టి, వచ్చేటప్పుడు ఏ పందెంలో సరిగ్గా విరాట్ స్వరూపాన్ని చేరుతుందో ఆ పందెం పడినప్పుడే ఆటకాయ పండినట్లు చెప్పవచ్చును. అంతవరకూ ఆ వరుసలో ముందరికీ వెనుకకూ ఆటకాయను నడుపుతూ ఉండాలి.
విరాట్ రూపానికి ఆ వైపూ ఈ వైపూ ఉన్న బొమ్మల్ని ద్వారపాలకులనీ, వారు విరాట్ దర్శనం కాకుండా అడ్డగిస్తూ ఉంటారనీ, అందువల్ల వాళ్ళ చుట్టూ తిరిగిన తర్వాతనే ఆఖరికి విరాట్ దర్శనం అవుతుందని అర్థం చేసుకోవచ్చు...
.
.
No comments:
Post a Comment