Monday, August 29, 2022

మనకు మనమే అన్నీ!

 🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏
             పెద్దలమాట చద్ది మూట
🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏
ది.29-8-2022

                   మనకు మనమే అన్నీ!
                                🕉️
మనకు అత్యంత ప్రీతిపాత్రులు ఎవరు?
'మనకు మనమే' అంటుంది శాస్త్రం. గీతాచార్యులు చేసిన ఈ ప్రతిపాదన అమృతపు గుళిక. మోక్షానందంతో పాటు ఇహలోక జీవనానికి కూడా ఇదే మహామంత్రం. మన జీవితం ఎలాసాగాలో మనమే నిర్ణయించుకొని అందుకు అనుగుణంగా జీవన విధానాన్ని మలచుకోవాలని హితవుపలికే శ్లోకం. ఇటీవల వ్యక్తిత్వ వికాస పాఠాల్లో, గీతలోని ఆరవ అధ్యాయంలోని ఈ శ్లోకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
శ్లో||
ఉద్ధరేదాత్మనా2..త్మానం
నా2..త్మానమవసాదయేత్!
ఆత్మైవ హ్యాత్మనో బంధుః
ఆత్మైవ రిపురాత్మనః!!
                           -భగవద్గీత.
ప్రతి వ్యక్తి తనను తానే ఉద్ధరించుకోవాలి. అధోగతిలో పడరాదు. తనకు తానే బంధువు - తనకు తానే శత్రువు..!

మనకు ఆరోగ్యం కావాలంటే ఆహార వ్యవహారాలలో నియమాలను, నిషేధాలను పాటించవలసి ఉంటుంది. ఎవరు? మనమే!
వృత్తి ఉద్యోగాల్లో రాణించాలన్నా, సమాజంలో గౌరవాదులు సంపాదించాలన్నా ఎవరు పనిచేయాలి? మనమే!
ఈ విధంగా లౌకిక జీవనయాత్రలో, మరుజన్మలో సౌఖ్యం కోసం కూడా మనకై మనం శ్రమించాలనే దివ్య సందేశం ఇచ్చేది ఈ గీతామృతం.  ఇతరులు దారిచూపిస్తారేమోగానీ, ప్రయాణకష్టం మనదే!
అలాగే గమ్యస్థానం చేరవలసిందీ, చేరేదీ మనమే!
ప్రతి జీవికి తన మనస్సే శత్రువు - తన మనస్సే తనకు బంధువు కూడా!
మనసును ఎప్పుడూ మనవశంలో ఉంచుకోగల్గితే బంధువుగా, మిత్రుడిగా సహాయపడుతుంది. మనస్సును శత్రువులా చూస్తే అది మన అధోగతికి కారణం ఔతుందని దీని అంతరార్థం.
మన అనుభవాన్ని గురువుగా చేసుకుంటే మనం ఉద్ధరింపబడతాం. అలా కాకపోతే కష్టపడతాం అనే అర్థంలో కూడా భగవంతుడు ఈ విషయాన్ని చెప్పాడు. ఎవరిమటుకు వారు తమను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ, ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురు చూడకూడదు.
                             🕉️
తన్మే మనః శివ సంకల్పమస్తు
శివాయ గురవే నమః
సేకరణ:-
జంధ్యాల మోహన సత్యసాయి
🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏

No comments:

Post a Comment