Saturday, August 13, 2022

నేటి జీవిత సత్యం. మూడు రకాల శ్రోతలు(లోపలి దారి)

 నేటి జీవిత సత్యం. మూడు రకాల శ్రోతలు(లోపలి దారి)

ఏదైనా తెలుసుకోవాలన్నా, అవగాహన చేసుకోవాలన్నా, వ్యక్తి పసివాడుగా మారాలి. సమాజం మనమీద మోపిన భావాలను, భారాలను తొలగించుకోవాలి.

ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. అతడు పండితుడు, జ్ఞాని. ఎన్నో గ్రంథాలను చదువుకున్న వాడు, తార్కికుడు. ఇట్లా అతని దగ్గర ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. అతను బుద్ధుడిని ఒక ప్రశ్న వేశాడు. బుద్ధుడు ఏమీ మాట్లాడలేదు నిశ్శబ్దంగా వున్నాడు.

'నేను అడిగిన దానికి మీరు సమాధానం ఇవ్వండి', అని అతను అడిగాడు.

బుద్ధుడు, 'దయచేసి ఇప్పుడు నేను సమాధానం చెప్పను, చెప్పలేను' అన్నాడు.

అతను,'ఎందుకని మీరు సమాధానం చెప్పరు?' అన్నాడు. అతను దేశంలో ప్రముఖమైన వ్యక్తి, ప్రసిద్ధుడు. ఎన్నో వందల మైళ్ళ నుంచి నడిచి బుద్ధుని దగ్గరకు వచ్చాడు. తన సందేహాన్ని నివృత్తి చేసుకుందాం అనుకున్నాడు.

అతను 'మీరు ఇతర వ్యాపకాలతో బిజీగా వున్నారేమో, అందుకని నాకు సమాధానం చెప్పడం లేదేమో' అన్నాడు.

బుద్ధుడు 'లేదు, నేను ఖాళీగానే ఉన్నాను. వేరే పనుల హడావుడి లేదు. అయినా నేను నీ ప్రశ్నకు సమాధానం చెప్పను' అన్నాడు.

అతను 'ఎందుకని చెప్పరు?కారణం ఏమిటి?' అన్నాడు.

అప్పుడు బుద్ధుడు "శ్రోతలు అంటే వినే వాళ్ళు మూడు రకాలుగా ఉంటారు. మొదటిరకం బోర్లించిన కుండల్లా ఉంటారు. మనం ఏది చెప్పినా లోపలికి వెళ్ళలేదు, అటువంటి వ్యక్తులు దేన్నీ స్వీకరించరు, గ్రహించలేరు.

రెండో రకం వ్యక్తులు రంధ్రాలు పడ్డ కుండలాంటి వాళ్ళు. ఆ కుండ క్రింద రంధ్రాలు వుంటాయి. మనం ఏమి చెప్పినా ఆ రంధ్రాల గుండా బయటకు వెళ్ళిపోతాయి. నీళ్ళు పోస్తే ఆ రంధ్రాల గుండా వెళ్ళిపోయినట్లు మనం చెప్పిన వన్నీ కొట్టుకొని పోతాయి.

ఇక మూడో రకం మనుషులు మామూలు కుండ లాంటివాళ్ళు. ఆ కుండకు రంధ్రాలు వుండవు, కానీ దాంట్లో మురికి వుంటుంది. మురికి వున్న కుండలో నీళ్ళు పోస్తే మంచి నీళ్ళు కూడా మురికిగా మారిపోతాయి. అట్లాగే మురికి మనుషులకు మనం చెప్పే మాటలు కూడా మురికిలో భాగంగానే స్వీకరిస్తారు.

నువ్వు ఈ మూడు రకాల మనుషులకు ప్రాతినిధ్యం వహిస్తావు. కారణం నీ అనుభవాలతో జ్ఞానంతో నీ మనస్సు మకిలి పట్టింది, మురికిగా మారింది. ఏమి చెప్పినా నువు స్వీకరించే స్థితిలో లేవు" అన్నాడు బుద్ధుడు!

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment