అర్థరాత్రి మెలకువ వచ్చింది...
అర్థరాత్రి అంటారేగానీ...
అర్థపగలు అని అనరు....
అర్థరాత్రి అంటే సగం రాత్రి అని కాదు,
అర్థరాత్రి అంటే రాత్రి అనేది అర్థవంతమైనది అని అర్థం.
పగలు అనేది అర్థంపర్థం లేనిది కాబట్టి
అర్థపగలు అని అనరు.
* * *
అర్థరాత్రి...
అంతా అంధకారం...
అంతా నిశ్శబ్దం...
తనను తాను మాత్రమే చూడగలిగే అద్భుత ప్రకాశం
ఈ అంధకారం.
తనతో తాను మాత్రమే భాషించగల అద్భుత మౌనం
ఈ నిశ్శబ్దం.
ఈ అంధకారం శాశ్వతం.
అప్పుడప్పుడు కనిపించి పోతుంటుంది
సూర్యుడనే మిణుగురు పురుగు.
ఈ నిశ్శబ్దం శాశ్వతం.
అప్పుడప్పుడు వినిపించి పోతుంటుంది
లోకమనే భ్రమరకీటకం.
లోకం మేలుకొని ఉంటే "నేను" నిద్రాణమై ఉంటుంది.
లోకం నిద్రపోతుంటే "నేను" మెలకువగా ఉంటుంది.
పగలు అనేది మెలకువగా కనిపించే నిద్ర.
రాత్రి అనేది నిద్రగా అనిపించే మెలకువ.
మెలకువలో ధ్యానం ప్రయత్నంగా ఉంటుంది.
నిద్ర అనేది ధ్యానఫలంగా ఉంటుంది.
ప్రశ్న ఉంటే తాను సదా మెలకువలో ఉన్నట్టు.
ప్రశ్న లేకుంటే తాను సదా నిద్రలో ఉన్నట్టు.
మెలకువ బంధం.
నిద్ర మోక్షం.
పగలు అనేది ఇహలోకం.
రాత్రి అనేది పరలోకం.
మెలకువ అంటే జీవించి మరణించడం.
నిద్ర అంటే మరణించి జీవించడం.
తాను-
బహిర్ముఖమైతే మెలకువ.
అంతర్ముఖమైతే నిద్ర.
తాను-
బహిర్ముఖమైతే సృష్టి.
అంతర్ముఖమైతే లయం.
నిద్రలో ఏకంగా ఉన్న తాను
మెలకువలో అనేకం అవుతాడు.
ఒక అడుగు మెలకువ
ఒక అడుగు నిద్ర
ఈ బుడిబుడి అడుగులు వేసే పసి బాలుడు శివుడు.
ఒక రూపం తాండవమూర్తి.
ఒక రూపం దక్షిణామూర్తి.
ఈ రెండు బొమ్మలతో ఆడుకునే జ్ఞానశిశువు శివుడు.
శివోహం...శివోహం...శివోహం...
ఆ శివుడే "నేను".
"Iam That Iam"
* * *
జ్ఞానశిశువు
No comments:
Post a Comment