Friday, August 19, 2022

🕉️ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి ఛానెలింగ్ మెసేజ్ 🕉️

 🕉️ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణుడి ఛానెలింగ్ మెసేజ్ 🕉️

◆ నేను “ కృష్ణుడి ” ని కావడానికి ముందు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాను . కానీ ఫ్రెండ్స్ ! కృష్ణుడిగా మీరు నన్ను తెలుసుకున్న జన్మకి సంబంధించిన వాస్తవాలను మీకు చెప్పడానికి ఈ జన్మకు క్రితం జన్మ తాలూకు కొన్ని వివరాలు మీకు చెప్పాలనుకుంటున్నాను .

◆ కృష్ణుడిగా జన్మనెత్తడానికి దాదాపు 1000 సంవత్సరాలకు ముందు నాకు ధ్యానంతో పూర్తి పరిచయం ఏర్పడింది . ఆ జన్మకు చాలా ముందుగానే నేను ధ్యానిని , ఆధ్యాత్మికపరమైన మనిషిని . అయితే కృష్ణజన్మ ” కు వెయ్యేళ్ళ క్రితం నేను మాస్టర్ నీ , ధ్యానయోగినీ కావాలన్న సంకల్పమే లేదు నాలో “ .

◆ అందుకని ఆ జన్మలో ధనవంతుల ఇంట్లో ఏకైక పుత్రుడిగా పుట్టాను . నా తల్లిదండ్రులు ధ్యానులు . పసిప్రాయంలో ఉన్నా సరే పిల్లలు స్వతంత్రంగా ఉండాలనే నమ్మకం ఉన్న వాళ్ళు నా తల్లిదండ్రులు. దాదాపు ప్రతిరోజూ నా తల్లిదండ్రులు ధ్యానం చేయటం నేను చూస్తూ ఉన్నా కూడా వాళ్ళేం చేస్తున్నారో అడగాలని నేను ఎన్నడూ అనుకోలేదు . ఏవో చిన్న చిన్న పనులు పెట్టుకుని నా పాటికి నేను బిజీగా ఉండేవాడిని . అంతే కాకుండా చదువుల్లో కూడా అంతంత మాత్రంగా ఉండేవాడిని . నా తల్లిదండ్రులెన్నడూ నేను సాధించిన వాటికి నన్ను పొగడటం , చేయలేకపోయిన వాటికి నన్ను తిట్టడం లాంటివి చేసేవాళ్ళు కాదు . వాళ్ళు నాకు జీవితంలో ఒకే ఒక విషయాన్ని నేర్పారు - “ నీ మనస్సాక్షి పట్ల నువ్వు నిజాయితీగా ఉండు . ” దీనిని నెరవేర్చడం కోసం వాళ్ళు ఎలాంటి మార్గదర్శక సూత్రాలూ చెప్పలేదు . 

◆ కానీ ఏడేళ్ళవాడిగా నా పట్ల నేను నిజాయితీగా ఉండటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను . నా స్నేహితుడు ఒకడు తన ఇంట్లో కొన్ని బంగారు నాణాలు దొంగతనం చేశాడు . వాళ్ళమ్మా నాన్నా అడిగితే ఆ డబ్బు గురించి తనకేమీ తెలీదని బొంకాడు . ఆ తల్లిదండ్రులు చాలా పిరికివాళ్ళు . ఈ వ్యవహారంలో కొడుకు హస్తం ఎంతవరకు ఉన్నదో వాళ్ళకు బాగా తెలుసు . అయినా ఏమీ అనలేక ఊరుకున్నారు . కానీ కొన్ని రోజుల తర్వాత ఆ తల్లి నా దగ్గర చాలా ఏడ్చింది . అలా ఇంట్లో డబ్బు దొంగతనం చేయటం ఎంత తప్పో వాడికి అర్ధమయ్యేలా నేను చెప్పగలిగితే నాకు చాలా ఋణపడి ఉంటానని అన్నది .

◆ కొడుకు ప్రవర్తన పట్ల ఆ తల్లి ఆవేదనను చూసి ఆమె చెప్పినట్లు చేయాలని నిశ్చయించుకున్నాను . ఇంటికొచ్చి మా అమ్మా నాన్నలను ఈ సంగతంతా చెప్పాను . వాళ్ళిద్దరూ ముఖా ముఖాలు చూసుకున్నారే గానీ పైకేమీ మాట్లాడలేదు . కానీ వాళ్ళ చూపుల్ని బట్టి వాళ్ళు నాతో ఏదో చెప్పాలని నిశ్చయించుకున్నారని నాకు అర్ధమయింది . నా తండ్రి నాతో అన్నారు : “ నాయనా ! నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించాల్సి సమయం వచ్చేసింది . నీ అంతఃశ్చేతన ( subconscious ) లో జ్ఞానం వుంది . దాన్ని మేల్కొలుపు . నువ్వు దానికి విశ్లేషణ చేసుకుని అవగాహన చేసుకుని ఉపయోగించాల్సి ఉంది .

◆ ఇకపోతే నీ స్నేహితుని తల్లి నీ ముందుంచిన విషయం దగ్గరికొస్తే దానికి నువ్వు కేవలం నీ విశ్లేషణనూ , అవగాహననూ ఉపయోగించాలి . అంతేగానీ నేరుగా నీ స్నేహితుని దగ్గరికెళ్ళి ' సరే మిత్రమా ! ఇలా వచ్చి కూర్చో , నీకు నేను ఫలానా విషయం చెప్పాలనుకుంటున్నాను ' ఇలాంటి మాటలు కాదు నువ్వు మాట్లాడవలసింది . ఒక్క పని మాత్రం నువ్వు సరిగ్గా చేశావు . నేరుగా వెళ్ళి నీ స్నేహితునితో మాట్లాడకుండా ఆ విషయం నువ్వు మాతో మాట్లాడుతున్నావు . ఈ విషయం ఎంత ముఖ్యమైనదో , దానిలో నీ పాత్ర ఏమిటో నీ అంతఃశ్చేతనకు తెలుసు . "

◆ అని చెప్పి ఇప్పుడు నేను వెంటనే “ ధ్యానం ” చేయాలని చెప్పారాయన . ఎందుకంటే ఈ సమస్యను కేవలం ధ్యానం ద్వారా మాత్రమే నేను పరిష్కరించగలుగుతాను . వెంటనే ధ్యానం ఎలా చేయాలో నా తండ్రి నాకు నేర్పాడు . అరగంట తర్వాత లేపాడు మళ్ళీ ధ్యానంలో కూర్చో బెట్టాడు . అయితే ఈసారి ఈ " సమస్యను గురించి " ధ్యానం చేయమన్నాడు .

◆ఒక గంటసేపు ధ్యానం చేసి గదిలో నుంచి బయటికి వచ్చేసరికి నేను మాట్లాడాల్సిన నా స్నేహితుడు మా అమ్మతో మాట్లాడుతూ కనిపించాడు . అయితే ఈ సమస్య గురించి వాడితో మాట్లాడడానికి మా అమ్మ తెలివి తక్కువదేం కాదు . నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చి ఆప్యాయంగా నవ్వి చెప్పాడు . " ఒరేయ్ ! నీకు నేను చాలా ఋణపడి ఉన్నాను . అరగంట క్రితం నువ్వు మా ఇంటికి వచ్చి నాకు చెప్పావు కదా . ఇంటి అవసరాల కోసం అమ్మా నాన్నలు దాచిన డబ్బును దొంగతనం చేయటం తప్పనీ , అలాంటి డబ్బును దొంగతనం చేసినట్లయితే ముఖ్యమైన అవసరాలు తీరకుండా చేసి ఖర్చుల భారాన్ని పెంచినట్లవు తుందనీ చెప్పావుగా ? కుటుంబ ఖర్చుల కోసం పెట్టిన డబ్బు అందరికీ చెందుతుంది కాబట్టి దానిలో నుంచి మనకేదైనా అవసరమైతే అమ్మా నాన్నలకు చెప్పి తీసుకోవటం ముఖ్యం . 

◆ మంచి తల్లిదండ్రులు మనకున్నట్లయితే మన అవసరాలన్నీ వాళ్ళ దృష్టికి తేవటం చాలా ముఖ్యం . అలా మన అవసరాలు వాళ్ళకు చెప్పటం ద్వారానే వాళ్ళకు మన గురించి అర్ధమవుతుంది . దాంతో మన అవసరాలను వాళ్ళు ఏ కారణంగానూ తీర్చకుండా ఆగదు . బిడ్డల కోరికలూ , సరదాలూ తీర్చటానికి ఏ తల్లిదండ్రులైనా ఆతురతగానే ఉంటారు కదా !

◆ నీ కోరికలు ఏ కారణంగానైనా వాళ్ళు తీర్చలేకపోతే తాము ఎందుకు తీర్చలేకపోతున్నారో వాళ్ళు తప్పకుండా నీకు చెబుతారు . డబ్బులేని కారణంగా అనో , ఆ ఫలాని కోరిక తీర్చటంవల్ల ఇంటి అవసరాలకు డబ్బు చాలదనో చెబుతారు . దాంతో మనకు మన తల్లిదండ్రులు ఏం చేయగలరు , సంబంధించిన వ్యవహారం ఇలా ఉన్నట్లయితే , ఏ తల్లి తండ్రి తాము ప్రేమించే తమ పిల్లల నుంచి ముఖ్యమైన గట్టి పునాదిని దూరం చేయరు . ఆ పునాది పేరే ' ప్రేమ ' . 

◆ అందరు తమ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారంటే నీకు వ్యతిరేకంగా వాళ్ళేదన్నా చేస్తే ' ఎందుకు ' , ' ఏమిటి ' , ' ఎలా ' అని నువ్వు వాళ్ళను అడుగు . బిడ్డగా వాళ్ళ నుంచి సమాధానం రాబట్టే హక్కు నీకుంది . నీ తల్లిదండ్రులు నీకు ఇన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ పట్ల నువ్వు నిజాయితీగా ఉండలేవా ? ” 

◆ ఇదంతా నేను అతనితో ఆ అరగంటసేపు “ మాట్లాడింది ” నాకు ఆశ్చర్యమేసింది . నిజానికి నేను “ ముందు మా అమ్మతో ఇదంతా మాట్లాడి ఆ తర్వాత అతని దగ్గరికెళ్ళి ఇవే మాటలు మాట్లాడతామిప్పుడు ” అనుకుంటున్నాను .

◆ నేను అలా ఆశ్చర్యపోతూ ఉండగా చాలా మామూలుగా మా అమ్మ చెప్పింది . నేను సూక్ష్మ శరీరంతో అతని దగ్గరికి వెళ్ళానట . అతనా సమయంలో మౌనంగా కూర్చుని వుడటం వల్ల నేను చెప్పదల్చుకున్న దంతా అందుకోగలిగాడట . అలా అతని తప్పు అతనికి తెలియజెప్పానట . నా పని ఇంక పూర్తయిందని మా అమ్మ చెప్పింది . అతను నిర్మల మనస్కుడు కావటం వల్ల వెంటనే తన తల్లిదండ్రుల దగ్గరకి వెళ్ళి వారిని క్షమాపణ కోరాడు .

◆ ధ్యానంలో నా తొలి అనుభవం ఇది . అప్పటి నుంచి నేను ప్రతి రోజూ ధ్యానం చేయసాగాను . త్వరలోనే అనేక ధ్యానానుభవాలు రాసాగాయి . ఆ జ్ఞానాన్ని నేను నిత్యజీవితంలో ఆచరణలో ' పెట్టసాగాను . నేర్చుకున్న ప్రతిదాన్నీ ఆచరణలో పెట్టసాగాను . దానికితోడు నా తల్లిదండ్రులే నాకు గొప్ప గురువులు . నాకు కావలసినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వారంలో నేనేం నేర్చుకోవాలో చెప్పమని అడగగలిగేవాడిని . 

◆ మొదట్లో నన్ను నా గత జన్మలు చూసుకోమనీ , ఒక్కొక్క జన్మలో నేనేం నేర్చుకున్నానో కష్టపడి అర్థం చేసుకోమని చెప్పారు వాళ్ళు . ఈ పని నేను చాలా క్షుణ్ణంగా చేయాలని చెప్పారు . దానివల్ల లాభం ఏమిటంటే . ఈ జన్మకు నేను జీవితం యొక్క కొత్త కోణాల గురించి నేర్చుకోవడానికి జ్ఞానాన్ని వాడుకోవచ్చు . గతంలో మనం ఎలా వుండి వున్నామో చూడనంతవరకూ , తెలుసుకోనంత వరకూ " ప్రస్తుతం ఏం నేర్చుకోవాలి " అనేది మనకు క్షుణ్ణంగా అర్థం కాదు . అందువల్ల ఒక ఏడాది మొత్తం కేవలం గత జన్మల గురించి తెలుసుకుంటూ గడిపాను . నా ఆలోచనా లోపాలలోకి కొద్ది కొద్దిగా పోతూ ఉండేవాడిని . 

◆ పదేళ్ళ వయసొచ్చేసరికి ఒక విషయం బాగా తెలుసుకున్నాను . అదేమిటంటే ఈ జన్మలో నేను ధ్యానం యొక్క బహుముఖ పరిధులు గురించి నేర్చుకోవాలి . అంతేగానీ ఏ ఒక్క దానిలోనూ నిష్ణాతుణ్ణి కాకూడదు . ఎందుకంటే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి ఒక్క జన్మ చాలా చిన్నది . సరిపోదూ . అందువల్ల నేను నాకు ఎదురైన ప్రతి పరిస్థితినీ కూలంకషంగా గమనించాలని నిశ్చయించుకున్నాను . కొన్ని క్షణాలపాటు కూడా అజాగ్రత్తగా ఉండకూడదనుకున్నాను . అలా నేను నేర్చుకోగలిగిన ప్రతిదీ నేర్చుకున్నాను . దాదాపు 150 సంవత్సరాల వయస్సులో చనిపోయాను . 

◆ అప్పటి నుంచి సరిగ్గా 7 జన్మలెత్తాను . పరిపూర్ణత చెంది మాస్టర్స్ కు మాస్టర్ ని అయ్యాను . " కృష్ణుడి ” నయ్యాను ' ఈ 7 జన్మలతోనూ రెండు ముఖ్య విషయాలకు నేను పూర్తిగా అంకితమై పోయాను .

● 1) ధ్యానం 

● 2) నన్ను నేను విమర్శనాత్మకంగా విశ్లేషించుకుని అర్థం చేసుకోవటం.

◆ 1) ధ్యానం:--

● ఇతర లోకాల గురించి తెలుసుకున్నాను . ఇతరుల జీవితాల్నీ , కార్యాలనూ , సవాళ్ళనూ , ఆలోచనలనూ ఎలా చూడాలో నేర్చుకున్నాను . రకరకాల మాస్టర్స్ గురించి , వారి పరిపూర్ణతల గురించీ , వారు సాధించిన వాటి గురించి తెలుసుకున్నాను . 

◆ నేను అన్నీ క్షుణ్ణంగా నేర్చుకోవటం మొదలు పెట్టాను . ఒక్కో మాస్టర్ నన్ను ఎలా తీర్చిదిద్దగలరో అన్నింటినీ సాధించాను . 

◆ వివిధ భూమికలలోనికి వెళ్ళటం నేర్చుకున్నాను . ఒక్కొ భూమిక గురించి వివరంగా నేర్చుకున్నాను . ఎందుకంటే ప్రతి భూమిక మనుష్యుల గురించి , మన గురించి కూడా తెలుసుకోవడానికి కొత్త ద్వారాన్ని తెరుస్తుంది . 

◆ 2) నన్ను నేను విమర్శనాత్మకంగా విశ్లేశించి అర్ధం చేసుకోవటం:--

● ప్రతిరోజు ప్రతి సంఘటనా నాకో పాఠమే ! ప్రతి వ్యక్తీ నాకో పాఠమే ! మనుష్యుల ప్రతి జన్మ కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది . వాళ్ళను వాళ్ళు వీలైనంత అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది . 

◆ నా చుట్టూ ఉండే చెట్ల నుంచీ , జంతువుల నుంచీ , గాలి , నీరు , రాయి , మట్టి ఒకటేమిటి ప్రతి దాని నుంచీ చాలా నేర్చుకున్నాను. వాటన్నిటితోటి మాట్లాడగలిగేవాడిని, మీతో మాట్లాడినట్లే ! వాటితో ఎంత బాగా మాట్లాడేవాడినంటే నాకు వర్షం కురిపించగలదేమోనని అడిగే వాడిని . కొన్ని నిమిషాలలోనే వానలో తడిసి ముద్దయిపోయే వాడిని .

◆ ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే . “ కృష్ణుడి " గా పుట్టడానికి ముందు 7 జన్మలలో నేను క్షుణ్ణంగా నేర్చుకున్న రకరకాల కోణాలివి . ఇందుకు 900 సంవత్సరాలు పట్టినప్పటికీ క్లుప్తంగా కొన్ని పంక్తులలోనే చెప్పాను మీకు . ఎందుకంటే అవి ఆత్మయొక్క వివిధ కోణాలు . ధ్యానం ద్వారా వీటిల్లోని ప్రతి ఒక్క దానిని మీరు ఆచరించాలని నేను కోరుకుంటున్నాను . అప్పుడే మీరు జ్ఞానానికి పరాకాష్ట అవుతారు . 

◆ కృష్ణుడిని ప్రతి ఒక్కరూ ప్రేమించింది ఒక మనిషిగా కాదు ఒక మాస్టర్ గా ! కృష్ణుడిని మనుష్యులు సమర్థుడు , శక్తిమంతుడు అయిన మాస్టర్ గా చూశారు . ఆయన శక్తి చూసి ఆయన్ని గౌరవించారు . జ్ఞానానికి పరాకాష్ఠ అయిన కృష్ణుడికి వాళ్ళు తమను తాను అర్పించుకున్నారు . తమకు కృష్ణుడిలో ఏది కనబడిందో దానితో తాము కనీసం “ ఒక కణిక " గా అయినా చాలునని కోరుకున్నారు . కృష్ణుడిని పూజించారు . ఎందుకో తెలుసా ? కృష్ణుడు వాళ్ళ కష్టాలను బాపగలడు కనుక . కృష్ణుడు ఒక జ్ఞానయోగి , అందుకే పాండవులు అతన్ని ఆరాధించారు . ద్రోణ , భీష్మ , నకుల , సహదేవ , కుంతి , అశ్వత్థామ లాంటి మాస్టర్స్ కే మాస్టర్ కృష్ణుడు.

◆ గోపికలు కృష్ణుణ్ణి ఇష్టపడింది అతని మురళి కోసం ! తన సంగీత సామర్థ్యం అతను వారిని 7 లోకాలలో తిప్పేవాడు . బలరామునికి ప్రియమైన తమ్ముడు కృష్ణుడు . ఆత్మ గురించి విమర్శనాత్మక విశ్లేషణ చేసి బోధించేవాడు కృష్ణుడు . కృష్ణుడు చాలా అద్భుతమైన భర్త . ఎందుకంటే అతనికి ఎరుక , తెలివి , శక్తి , జ్ఞానం అన్నిటికన్నా మిన్నగా ప్రేమ వీటన్నిటినీ అతను తన భార్యలలో ఎవరు తన దగ్గర ఉంటే వారిపై అనుక్షణం కురిపిస్తూండేవాడు . 

◆ ఒకే చైతన్యంలో ప్రతిచోటా కనిపించేవాడు కృష్ణుడు . మనందరం ఆయనంతటి పరాకాష్ఠ పొందిన మాస్టర్స్ కావాలి . 

◆ కృష్ణుడిగా నా జన్మలో మీరంతా గమనించిన వాటిలో ఇవి కొన్ని కానీ మీకు నేను మనస్ఫూర్తిగా చెప్పదల్చుకున్నదేమిటంటే అది చాలా సుదీర్ఘమైన , శ్రమతో కూడుకున్న ప్రయాణం . ఈ 900 సంవత్సరాలుగా ధ్యానం పట్ల నాకుండే అంకితభావన , ఆత్మ విశ్లేషణ అనే వాటి తుది ఫలితంగా నేను జ్ఞానానికి పరాకాష్ఠనయ్యాను .

◆ చూడండి ఫ్రెండ్స్ ! ఉదాహరణకి లెక్కల్లో ఒక సూత్రం తయారు చేసిన శాస్త్రవేత్త దాని కోసం తన జీవితంలో 60 , 70 సంవత్సరాలు కష్టపడి ఉంటాడు . ఆ సూత్రం మీ వరకు వచ్చేసరికి ఆ లెక్క చేయడానికి 70 , 80 సం,,లు పట్టదు . కేవలం ఒకటి , రెండు నిమిషాలు చాలు. లెక్కను బట్టి ఆ సమయంలో తేడా ఉండవచ్చు .

◆ మా మాస్టర్స్ అందరం మానవులు సంతోషంగా జీవించడానికి సరిపోయే సరియైన సూత్రాలపై పనిచేశాము . కనుక ఆ సూత్రాలు మీ అందరికోసం ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి . ఫ్రెండ్స్ ! మీరు చేయవలసిన దల్లా ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి ఒక్కొక్క సూత్రాన్ని తీసుకుని మీ సమస్యలను పరిష్కరించుకోండి . అప్పుడు మరో మాస్టర్ దగ్గరికి వెళ్ళండి . 

◆ చూడండీ ! ఇప్పుడు మొదలు పెట్టడం మంచిది . " రేపు చేద్దాం లే అనుకుంటే ఆ రేపటికి మీలోని ఆధ్యాత్మిక చచ్చుబడి పోవచ్చు . అప్పుడు నేర్చుకోవటం అనేది కష్టతరం అవుతుంది . మీ మనోవికారాలు మిమ్మల్ని ఎంతగా జావ కార్చేస్తాయంటే మీకు ఏది ముందు చేయాలో కూడా తెలీకుండా పోతుంది . ఇవాళ మీకేమీ తెలీదు కనుక ధ్యానానికీ , ఆత్మ విశ్లేషణకి సంబంధించిన ఏ సూత్రమైనా ఒక్కలాగే అనిపిస్తుంది . అందు వల్ల ఎలాంటి అనుమానం లేకుండా మొదట మీరు విన్న దానితో మొదలు పెట్టేసుకోండి . 

◆నేను " కృష్ణుణ్ణి కావడానికి నాకు 10 శతాబ్దాలు పట్టింది . కనుక మీరేం చేయాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. ఏ లక్ష్యమూ లేకుండా జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ వచ్చిన అవకాశాన్ని , సమయాన్ని వ్యర్థ పరుస్తారా ? లేక కాలాన్నీ , వనరులనూ , అవకాశాల్నీ పూర్తిగా వినియోగించుకుని ఏదో ఒకటి అవుతారా ? ' మిత్రులారా ! ఇదే నేను మీ పుస్తకం కోసం ఇచ్చే సందేశం .

◆ మీ పాఠకులలో చాలామంది ధ్యానులలో కొందరు ఆశ్చర్యపోవచ్చు - కృష్ణుడిగా నేను తీసుకున్న జన్మలో సర్వశక్తి మంతుడిని ఎలా కాగలిగానా అని. దానికి కారణాలు:---

● 1) పూర్తి స్పృహతో ఆ జన్మలోకి వచ్చాను . 

● 2) నా జ్ఞానాన్ని అంతా నా నాలుక చివర్లో పెట్టుకున్నాను . అందుకే నా దగ్గరికి జ్ఞానతృష్ణతో వచ్చిన వారికి వెంటనే సమాధానం దొరికి తృప్తి కలిగేది . నారదుడికి కూడా తృప్తి కలిగేది . 

● 3) ప్రకృతి సూత్రాలను సమర్థించాలనుకునే వాడిని . ఈ ప్రకృతి సూత్రాలనే “ ధర్మం " అంటారు . కృష్ణుడిగా నేను పాండవులకు కావలసిన జ్ఞానాన్నీ , అవగాహననూ పుష్కలంగా అందించాను . 

★ పాండవుల గురించి:--- ★

◆ ధర్మం పేరిట చాలామందిని కాపాడాను . అప్పటి పరిస్థితుల నుంచి లాభం పొందేవాళ్ళు వీళ్ళే చూడండీ . మొదట్లో పాండవులు పరిపక్వత చెందలేదు . ధర్మం దరిదాపుల్లో కూడా లేరు వాళ్ళు . ఏకలవ్యుడికి జ్ఞాన బోధ చెయ్యకుండా అన్యాయంగా ఆపేశారు వాళ్ళు . అరణ్యవాస కాలంలో వారికి అవగాహనను కలిగించాను . తమ తప్పు తాము తెలుసుకున్నారు . 

★ శకుని గురించి:--- ★

◆ మానవుడి సృజనాత్మకతకూ , మానవుడి పరిమితికీ సవాలుగా ఎదురయ్యే ఏ దెబ్బనైనా నేను చాలా ఇష్టపడతాను . శకునిలో సృజనాత్మకత ఉంది . ఉపాయాలు వున్నాయి . అందుకే అతనంటే నాకు ఇష్టం . అయితే తన సృజనాత్మకతను అతను కౌరవుల మీద తన వ్యక్తిగత కక్ష తీర్చుకోమన్న తన పెద్దల ప్రతిజ్ఞ కోసమే అతను బ్రతికాడు . అతనిలోని ఆ గుణమే వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చింది . ధర్మానికి కట్టుబడే మనిషిగా అతను బ్రతికుండగా అతన్ని నేను మెచ్చుకోలేకపోయాను . కానీ మనస్సుల్లో ఎల్లప్పుడూ అతనంటే మంచి అభిప్రాయమే ఉండేది . దానివల్లనే శకునిగా జన్మ చాలించాక అతను నాకు దగ్గరకు రాగలిగాడు . ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళ దగ్గరికి నేను వచ్చినప్పుడల్లా అతన్ని నా పక్కనే ఉంచుకుంటాను . ఎందుకంటే మానవ సంబంధాలను అర్థం చేసుకోవటం లోనూ , పోషించడం లోనూ రాణించాలి అంటే అతని ఉపాయాలు కావాలి నాకు . ప్రస్తుతం ప్రేమ , క్షమ గుణాలు ఎంత ముఖ్యమో మనుష్యులకు అర్థం అయ్యేలా చేయడానికి శకుని సహాయపడుతున్నాడు . ఆ బంధాలను పోషించడానికి తోడ్పడుతున్నాడు . అతను పెట్టుకున్న మరో పెద్ద పని ఏమిటంటే తనదైన ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు . 

★ ద్రౌపది గురించి:--- ★

◆ ద్రౌపది నాకు ప్రియమైన శిష్యురాలు . ఆమె ఎంత పటిమగల అద్భుతమైన మనిషి అంటే " స్త్రీ స్వాతంత్ర్య పోరాటం ” జరిగే ఈ రోజుల్లో స్త్రీ పురుషుల సమానత్వాన్ని గురించి కేకలు వేసి ఈ రోజుల్లో ద్రౌపదే గనుక ఉంటే నిజంగా ఆడది అంటే ఎలా ఉండాలో ఈ బుద్ధిలేని ఆడవాళ్ళ కందరికీ చెప్పి వాళ్ళ మొహాలు పగలగొట్టి ఉండేది . స్త్రీ అంటే ఏమిటో , ఆమె ఉనికి ఎందుకు ఏర్పడిందో ద్రౌపది బాగా అర్థం చేసుకుంది . ఆ అవగాహనతో ఆమె మొత్తం విశ్వాన్నే నడపగలదు . 

◆ ఆమె తెలివితేటలకీ , సామర్థ్యానికీ , కపటంలేనితనానికీ ఓర్పుకీ , అందానికీ ఆమెను ఆరాధించాను , మెచ్చుకున్నాను. ఆమె భర్తల్లో , ఏ ఒక్కరి నుంచీ ఏనాడూ ఆమె మీద ఎలాంటి ఫిర్యాదు రాలేదు . ఆమె అత్తగారికి ఆమె అంటే చాలా ఇష్టం . నిజానికి “ ఐదుగురూ సమానంగా పంచుకోండి " అని తానన్న ఆ ఒక్కమాటకు కట్టుబడి సంప్రదాయబద్ధంగా అర్జునుడితో వివాహమైనా పాండవులు ఐదుగురినీ సమానమైన ప్రేమతో నెగ్గుకు రాగలిగిన ఆమె సామర్థ్యానికి అబ్బురపడుతూండేది . 
" పాంచాలి " గా భర్తల పట్ల ఆమె చూపిన ప్రేమ గురించి మాట్లాడటానికి , వ్రాయడానికూ బోలెడంత ఉంటూనే ఉంటుంది . 

★ రాధ, రుక్మిణి మరియు భార్యల గురించి:--- ★

◆ " రాధ " , " రుక్మిణి " ఇద్దరూ , ద్రౌపది తమకన్నా వయస్సులో చిన్నదైనా కూడా ఆమెనే ఆదర్శంగా భావించారు.

◆ తర్వాత నేను అభిమానించే వాళ్ళు నా భార్యలు . వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ తమ తమ పంథాలో బహు ముఖ ప్రజ్ఞావంతులు. నిరుపమానులు. " మేము ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాము . అంతమందిలో ప్రతి ఒక్కరితోనూ ఈయన ఎలా నెగ్గుకు రాగలిగాడబ్బా ?! " అని ఆశ్చర్య పోతూంటారు అందరూ . నేను అనుక్షణమూ వాళ్ళపట్ల చాలా చాలా అంకిత భావంతో ఉండేవాడిని . " స్త్రీ ఎలా ఉండాలి ? " అనే విషయం గురించి నేను వాళ్ళ నుంచి తెలుసుకోవాలనుకున్నాను . అందుకే వాళ్ళతో ఉండేవాడిని . వాళ్ళీ విషయంలో నాకు చాలా సహాయపడ్డారు . 

★ భీష్మ, ద్రోణుల గురించి:--- ★

◆ భీష్మద్రోణులు నాకన్నా పెద్దవారు , వాళ్ళతో నాకు ఎక్కువ చనువు లేదు . 

★ దుర్యోధనుడు గురించి:--- ★

◆ కౌరవుల అందరిలోనూ దుర్యోధనుడిని చూస్తే విపరీతంగా ఆశ్చర్యంగా , అబ్బురంగా ఉండేది . అతన్ని కలిసిన ప్రతిసారీ “ ఓరి నాయనో ! ఓరి దేవుడో ! " అనిపించేది నాకు . ఒకసారి అతనితో కొంచెం ఎక్కువ సేపు ఉండిపోయాను . నెమ్మదిగా అతనితో మాట్లాడటం మొదలుపెట్టాను . అతను చాలా ఆశపరుడని నాకు తెలుసు . " చూడు ... ఆశపరుడిగానే ఉండు . అందులో తప్పేమీ లేదు . కానీ స్వార్థపరుడివి కావద్దు . ఇతరుల వస్తువులు లాక్కోవద్దు . అది ప్రకృతికే విరుద్ధం . 

◆ చూడు దుర్యోధనా... నీకు త్రాగుడంటే ఇష్టమనుకో త్రాగు . కానీ కేవలం ' త్రాగుడులోనే మునిగి తేలుతూంటే ఏమవుతుందో చెప్పు . నీ ప్రయత్న ఏమైపోతుంది ? మీ వనరులు ఏమైపోతాయి ? " అన్నాను . దానికతను “ సరే ! నేను చచ్చిపోవచ్చు ! కానీ కృష్ణా ! ' అధికారం అనేది ఒక మనోవికారం అని నన్ను ఎందుకు నేర్చుకోనివ్వవు . ' ఎంతగా అధికారం నీ చేతిలోని వస్తూ వుంటే అంతగా నువ్వు దానివైపే వెళ్ళిపోవాలనుకుంటావు ' అని నన్ను తెలుసుకోనివ్వవు ఎందుకు ? ' చూడు కృష్ణా ప్లీజ్ ! నాకు ఇలా బ్రతకాలని ఉంది . ఇలాగే బ్రతకాలని ఉంది .

◆ సరే . నువ్వు అనవచ్చు ' చేసిన తప్పిదాలను దుర్భర మైన చావు చస్తావురా నాయనా ! అని కానీ చిన్న చిన్న పనికిమాలిన పాఠాలు నేర్చుకుంటూ రుచీ పచీ లేని జీవితాన్ని ఎంతకాలం బ్రతుకుతాం ? రేపు అధికార కాంక్ష ఉన్న ప్రతివాడూ ఈ దుర్యోధనుడి జీవితం చూసి నేర్చుకుంటాడు . వాస్తవంగా ఆలోచిస్తూ మామూలు జీవితాన్ని నువ్వు ఎందుకు బ్రతకకూడదు ? ” అన్నాడే గానీ చెప్పిన మాట వింటేనా ? ఎన్నడూ విన్నవాడు కాదు . దుర్యోధనుడికి అధికార దాహం ఉంటే వాళ్ళ నాన్న బుర్ర తక్కువ వాడు . కొడుకు చేస్తున్న పనులకూ , ఆలోచనలకూ వాడిని ఒక్కసారైనా కోప్పడినవాడు కాడు . నేను మాత్రం ఎంత అని చేసేది ? 

★ కర్ణుడు గురించి:--- ★

◆ ఇకపోతే చివరగా విపరీతంగా జాలి పుట్టించేవాడు , ఘోరంగా నాశనమైపోయిన వాడు కర్ణుడు . కురుపాండవులందరిలోకి నేను ఎక్కువగా ఇష్టపడింది అతనినే . అతను గొప్ప ధ్యాని ' మాత్రమే కాదు . చాలా గొప్ప జ్ఞాని కూడా . అతని శక్తులు అతన్ని వంచించాయి అంటే దుర్యోధనుడికి సాయం చేయాలనుకున్నందువల్ల కాదు . కర్ణుడికి వున్న శక్తుల్లో ప్రతి దాని పట్ల దుర్యోధనుడికి ఉన్న చెడు ఉద్దేశ్యాలే కారణం . 

◆ కర్ణుడికి తన శక్తులు ఏమిటో , తన బలహీనతలు ఏమిటో బాగా తెలుసు . కన్నతల్లి కళ్ళెదుట ఉండి కూడా అతను అనాథ ' అయిపోయాడు . జ్ఞాన వంతులున్న గొప్ప కుటుంబానికి చెంది ఉండి కూడా "సూతుడు" అని అవమానింపబడ్డాడు . ఈ అన్ని కారణాల వల్లా కౌరవులూ , పాండవులూ , నా భార్యలూ , నా గోపికలూ , నా గురువు . ప్రతి ఒక్కరి కన్నా కర్ణుడు అంటేనే నాకు ఎక్కువ ప్రీతి . అతని కపటం లేని తనం , భక్తి , తత్పరత వీటన్నిటి వల్ల అతనంటే నాకు ఎంతో ఇష్టం.

★ ప్రస్తుతం కృష్ణ మాస్టర్ పని:--- ★

◆ ఇదే అయ్యాలారా మీకు నేను చెప్పదలచ్చుకున్నది . ప్రస్తుతం నేను “ మహాకారణ లోకాల ( supra - casual worlds ) " కన్నా పై లెవెల్లో పరిశోధనా పద్ధతి గురించి పని చేస్తున్నాను . “ జ్ఞానుల గుంపు ” కనపడితే చాలు నేను అటువైపు ఆకర్షింపబడతాను . అలాగే మీ వైపుకు కూడా ఆకర్షితుడిని అయ్యాను . వీలైనంత మంది జ్ఞానాన్ని పంచాలని మీ పత్రి గ్రూపు వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఉత్సాహంగా పాల్గొనాలని నాకుంది . కానీ నా పనితో నా కస్సలు తీరికే దొరకదు . దొరికిన కాస్త సమయాన్నీ ప్రస్తుతం మీ కోసం ఉపయోగిస్తున్నాను .

◆ ” గుడ్ లక్ ప్రస్తుతానికి సెలవు . 

No comments:

Post a Comment