Thursday, September 22, 2022

చిదానంద రూపః శివోహమ్!! - 1వ భాగము. - శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

 చిదానంద రూపః శివోహమ్!! - 1వ భాగము. 
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

నేను పంచభూతములతో కూడిన శరీరాన్ని కాను! ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమును కాను!  నాకు సుఖదుఃఖాలు, పాపపుణ్యములు, అరిషడ్వార్గాలు, ఈషణత్రయాలు, పురుషార్ధాలు లేవు! నేను తెలుసుకోవలసింది, పొందవలసింది ఏమి లేదు! నేను సచ్చిదానంద స్వరూపుడైన శివుడను! శివుడను తప్పా వేరేమీ కాను!! అని ఉపనిషత్తుల సారాంశమంత తన నిర్వాణషట్కము / ఆత్మషట్కము లో తేల్చి చెప్పేసేరు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. 

అంతేకాదు ప్రతిజీవుడు సచ్చిదానంద శివస్వరూపుడే! ఆ సత్యాన్ని గ్రహించాలంటే ఆత్మభావంతో సాధనచెయ్యాలని, అప్పుడే తన నిజస్వరూపం బోధపడుతుందని సూచించేరు జగద్గురువు. ఇక సాధన మనచేతుల్లో వుంది. 

ఎవరైతే అన్ని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తారో వారికి యెవ్వరియందు ద్వేషభావం వుండదు. ఆత్మే అన్ని జీవరాసులుగా వున్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా వుంటాయి? ఆత్మానుభూతి పొందిన వ్యక్తి, విశ్వమంతటిని ఆత్మస్వరూపంగా చూస్తాడు. అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసుపోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే వుంటుంది. అందువలన బాధగాని, మోహంగాని, ద్వేషంగాని కలగవు.

ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ఎప్పటిలానే ఉంటుంది. చూసేవాడి మనసును బట్టీ, వ్యక్తివ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలివ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ మారలేదు. మార్పంతా చూసేవాడిని బట్టే వుంటుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తియొక్క మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది.

ఆత్మానుభూతి పొందిన వ్యక్తి అన్నింటిలో అంతరార్థాన్నీ గ్రహిస్తాడు. అందున్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అతడు మాత్రమే నిజమైన మనీషి. మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు, అతడు చెప్పినట్లు మనసు ఆడుతుంది. ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అతడు కేవలం ఆత్మ / పరమాత్మనే విశ్వసిస్తాడు. వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగడు.

*తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము.

🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

No comments:

Post a Comment