Wednesday, September 28, 2022

చిదానంద రూపః శివోహమ్!! - 2వ భాగము.

 చిదానంద రూపః శివోహమ్!! - 2వ భాగము. 
- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎవరైతే ఊరికే పనులు చేసుకుంటూ పోతారో వారు బాధలకు గురి అవుతారు. అలాగే లోకం దృష్టిలో పడటంకోసం, లోకులు తనను పొగడడం కోసం ఎవరైతే ధ్యానము, భక్తి మొదలగు వాటిని ప్రదర్శిస్తారో వారు ఇంకా ఎక్కువ బాధలు పడతారు.

జ్ఞానం ద్వారా ఒక ఫలితం, కర్మల ద్వారా మరొకరకమైన ఫలితం లభిస్తాయి. అయితే జ్ఞానం, కర్మలు రెండింటినీ కలిపి తెలుసుకొన్నవాడు కర్మల ద్వారా మరణాన్ని దాటి, జ్ఞానం ద్వారా అమర్త్వాన్ని పొందుతాడు.

జీవుడు బ్రతకాలంటే పనులు చేయక తప్పదు. పనులు మాత్రమే చేసుకుంటూ పొతే భగవంతుని గురించి తెలుసుకోలేము. కాబట్టి పనులు భగవదర్పితం అయ్యుండాలి, మనస్పూర్థిగా ఉండాలి. జ్ఞానం, పని రెండింటినీ సమన్వయంతో సాధించినవాడికే ఆత్మానుభూతి అని చెప్పబడింది. అయితే ఇక్కడ పేర్కొన్న సత్యాన్ని పరిశీలిస్తే, అంతా భగవంతుని సంపదే అనుకున్నప్పుడు, అన్ని కర్మలు భగవంతునికి అర్పిస్తూ చెయ్యాలి. ఇలా నిష్కామబుద్ధితో కర్మలు ఆచరిస్తే ఆత్మానుభూతి తప్పక లభిస్తుంది.

ఆత్మ స్థిరమైనదని, మనస్సు కంటే వేగవంతమైనది! ఇంద్రియాలు దాన్ని పొందలేవు! అంటే విశ్వమంతా వ్యాపించియున్న ‘ఆత్మ’ సత్యం! ఈ మనసు, శరీరం కూడా ఆత్మవిభూతే కదా! మనస్సు ఒక చోటుకి చేరకముందే, ఆత్మ అక్కడ వుంటుంది! 

జ్ఞానేంద్రియాలైన చెవి, చర్మము, నాలుక, కన్ను, ముక్కు ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికే సృష్టింపబడ్డాయి! ఇవి పనిచేయాలి అంటే కదలని వస్తువు ఒకటి ఆధారంగా వుండాలి కదా! ఒక వాహనం కదలాలంటే కదలని రోడ్డు, అలానే ఒక చలనచిత్రం చూడాలంటే ఒక కదలని తెర వుండాలికదా! అంటే ప్రాణం అనేది ఆత్మను ఆధారముగా చేసుకొని ఇంద్రియాలు పనిచేసేటట్టు చేస్తుంది.

ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టీ, అది అందరికీ చాలా దగ్గరగా ఉందన్నమాట, కాని ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించనప్పుడు అది మనకు దూరంగా వుంటుందని అర్థం! ఆత్మగా అది మనలో వుండి, పరమాత్మగా విశ్వమంతా వుంటుందన్న విషయాన్ని మనమందరం స్పష్టంగా అర్థంచేసుకోవాలి! 

*తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము.

🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺

No comments:

Post a Comment