Sunday, September 18, 2022

సత్యదర్శనం

 సత్యదర్శనం


నాచుకింద నిర్మలమైన నీరు ఉందని తెలుసు. రెండు చేతులతో నాచును పక్కకు పెట్టి నీటిని చూసాము.

ఆ జలం అలా కనుమరుగై పోకుండా ఉండాలంటే అడ్డం పెట్టిన చేతులు అలాగే ఉంచాలి. లేదంటే నాచు తిరిగి కమ్ముకుంటుంది. నీరు అదృశ్యమై పోతుంది. సత్యదర్శనం కాగానే అంతా అయిపోయింది అనుకుంటే సరికాదు. మాయ విజృంభణను అరికట్టాలి. లేకపోతే మళ్ళీ మాయలోనే పడిపోతాం.

అజ్ఞానుల కంటే జ్ఞానులకే మాయతో పోరాటం ఎక్కువ. సత్యం తెలిసినవాడు విశ్వంలో తన స్థానం ఏమిటో తెలుసుకుంటాడు. చాలా విషయాల్లో తన అసమర్థత, నిస్సహాయతలను నిజాయతీగా ఒప్పుకొంటాడు. దైవం తాలూకు అపరిమిత, అనంత, సర్వవ్యాప్తి తత్వానికి తలవంచుతాడు. సర్వ సమర్పణ చేసుకుంటాడు.

సత్యదర్శనం కాయను పండు చేస్తుంది. రాయిని శిల్పం చేస్తుంది. మూగవాడి చేత మాటలు పలికించి, పాటలు పాడిస్తుంది. సత్యదర్శనం భక్తిని ఇచ్చి, భక్తుని చేసి వినయ విధేయతలు నేర్పించి, నిరాడంబర జీవనం నేర్పుతుంది. పంక్తిలో భోజనానికి చిట్టచివరివాడిగా రమ్మంటుంది.

సత్యదర్శనం అంటే పూజలు, హారతులు కాదు. సత్యదర్శనం అంటే ఊరేగింపులు, పల్లకీలు కాదు. సత్యదర్శనం అంటే మంత్రాలు, తంత్రాలు కాదు.

సత్యదర్శనం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు, విలాసవంతమైన జీవితం, అందరి కంటే నేనే గొప్ప వ్యక్తిని అనే అహంకారం అసలే కాదు. సత్యదర్శనం అంటే, సాహసవంతమైన ఆధ్యాత్మిక జీవితం. కష్టాలను, కడగండ్లను తిరస్కరించకుండా ఎదురుగా వెళ్లటం. సత్యదర్శనం అంటే అత్యంత హేయమైన పరిస్థితుల్లో కూడా పూర్ణ విశ్వాసంతో జీవించటం. మరణంలోనూ ఇతరులకు సహాయం చేసే అవకాశాల కోసం తపనపడటం. సత్యదర్శనం అంటే.... నది లాంటి జీవితం సముద్రంగా మారిపోవటం.

సత్యదర్శనం అంటే కాలంతో సర్దుకుపోవటం, ప్రకృతితో మమేకం కావటం.

వసుధైక కుటుంబంలో తన పాత్రను అత్యంత సమర్థంగా నిర్వహించటం. దారి తప్పిపోయిన వాళ్లను దారిలో పెట్టి- అంధులకు దీపమైన ఒక హెలెన్‌ కెల్లర్‌లాగ, బ్రెయిలీలాగ జీవితాన్ని మార్చుకోవటం. జీవనయాత్ర సాగించటం.

లోక మర్యాద కోసం పాకులాడకుండా, ఆశ, వ్యామోహం బారిన పడకుండా పొందిన అనుభూతి కలకాలం నిలుపుకొంటూ కల్లాకపటం లేని భోళాశంకరుడిలా పిలిస్తే పలకటం. జ్ఞానం కలిగితే కొమ్ములు మొలవవు. సత్యం తెలిస్తే నాలుగు శిరస్సులు అదనంగా చేరవు.

అదే శరీరం, అవే బాధలు. భౌతికంగా ఎంత బాధపడినా సామాన్యులను పీడించే మానసిక ఒత్తిళ్లు ఉండవు. ప్రశాంతత చెక్కు చెదరదు. అదే తేడా. దీనికి ఉదాహరణగా రమణ మహర్షి రాచపుండును, రామకృష్ణ పరమహంస రక్తగ్రహణిని చెప్పుకోవచ్చు.

సత్యం అంటే జ్ఞానం. జ్ఞానం అంటే విశ్వ రహస్యం. ఇది తెలిసినవారు లోకానికి ఉపయోగపడతారు.

లోకోపకారులను తయారు చెయ్యడానికి దైవం ఈ జ్ఞానాన్ని గురుపరంపరలో ఒకరి తరవాత ఒకరికి అందిస్తూ వస్తున్నాడు. అందుకే శ్రీకృష్ణుడు ఈ జ్ఞానాన్ని ముందు సూర్యుడికి ఉపదేశించానని చెప్పాడు. 

ఈ జ్ఞాన మూలం వేద వాంగ్మయంగా ప్రాచీన రుషులు తెలియజెప్పారు. 

జ్ఞానం కంటికి కనిపిస్తుందా? జ్ఞానం మనసుకు కనిపిస్తుందా? జ్ఞానం బుద్దికి తెలుస్తుంది. వివేకమై ప్రకాశిస్తుంది.
సత్యమై తనకు తానే సాక్షాత్కరిస్తుంది.

No comments:

Post a Comment