Tuesday, September 6, 2022

ఈ మూడు లక్షణములు కలిగి ఉంటే మోక్షము మీ వెంటే ఉంటుంది. మూడూ కష్టం ఏమీ కావు. మొదటి దానిని ఆచరిస్తే తరువాతది దానికదే కలుగుతుంది.

 ఎవరైతే కామాన్ని, శోదాన్ని విడిచిపెడాతారో, ఎవరైతే తమ ఇంద్రియాలను, మనసును అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే ఆత్మను గురించిన జ్ఞానాన్ని కలిగి ఉంటారో అటువంటి యతులు అంటే సాధకులు, బ్రహ్మనిర్వాణం పొందడానికి ఎల్లప్పుడూ అర్హులు.

బ్రహ్మనిర్వాణం పొందడానికి ఇంకా మార్గాలు సూచిస్తున్నాడు పరమాత్మ.

1. కామమును అంటే కోరికలను విడిచిపెట్టాలి, అవి తీరకపోతే వచ్చే కోపమును విడిచిపెట్టాలి.
2. మనస్సు ఇంద్రియములు మన స్వాధీనంలో ఉండాలి. 
3. ఆత్మ తత్వము గురించి తెలుసుకోవాలి.

ఈ మూడు లక్షణములు కలిగి ఉంటే మోక్షము మీ వెంటే ఉంటుంది. మూడూ కష్టం ఏమీ కావు. మొదటి దానిని ఆచరిస్తే తరువాతది దానికదే కలుగుతుంది. కోరికలను, అవి తీరకపోతే కోపాన్ని విడిచిపెడితే, చిత్తము మన స్వాధీనంలో ఉంటుంది. చిత్తము స్వాధీనంలో ఉంటే ఆత్మ తత్వం దానంతట అదే తెలుస్తుంది. కాబట్టి మనం ముందు ప్రాథమిక విద్య అయిన కోరికలు, కోపము విడిచిపెట్టాలి. తరువాత సెకండరీ విద్య అయిన చిత్తము స్వాధీనంలో ఉంచుకోవాలి తరువాత ఉన్నత విద్య అయిన ఆత్మజ్ఞానము పొందాలి. ఇవి అన్నీ కష్టపడి చదివితేనే పాస్ అవుతాము. ఊరికే గుళ్లు గోపురాలు, పుణ్యతీర్థములు తిరిగితేరావు. అలా అని దేవాలయాలకు, పుణ్యతీర్థములకు వెళ్లకూడదని కాదు. కాకపోతే ఇవి పరమాత్మ గురించి తెలుసుకోడానికి మార్గాలు

జ్ఞానులకు కామ క్రోధాలు ఉండవా! అంటే ఉంటాయి. కాని జ్ఞానులు తమలో ఉన్న కామ క్రోధములను తమ అదుపులో పెట్టుకోగలరు. వాటిని అవసరం వచ్చినపుడే ప్రదర్శించగలరు. కాని సామాన్య మానవుడికి కోరికలు, అవితీరకపోతే వచ్చే కోపము అతని అదుపులో ఉండవు. విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. పైగా అజ్ఞాని ఎప్పుడూ తన యోగక్షేమాల గురించే ఆలోచిస్తుంటాడు. యోగము అంటే తాను పొందినది. క్షేమము అంటే పొందిన దానిని జాగ్రత్తపెట్టుకొనేది. అజ్ఞాని ఎల్లప్పుడూ ధనం, ఆస్తులు, పదవులు, సంపాదించడం ఎలాగా అని ఆలోచిస్తుంటాడు. అవి తనకు లభించడం ఒక యోగంగా భావిస్తాడు. లభించిన ధనాన్ని, ఆస్తిని, పదవిని కాపాడుకోవడానికి, తాను ఎల్లప్పుడూ క్షేమంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. సామాన్య మానవుడు ఈరెండింటితో సతమతమౌతూ ఉంటాడు. కాని జ్ఞాని తన యోగక్షేమాల గురించి పట్టించుకోడు. సమాజము యొక్క సాటి వారి యొక్క యోగక్షేమాల గురించి ఆలోచిస్తుంటాడు. అదే జ్ఞానికి అనికీ, సామాన్యుడికీ, సాధకుడికీ ఉన్న తేడా.

🙏కృష్ణం వందే జగద్గురూమ్🚩

No comments:

Post a Comment