🌷మహావాక్యం🌷
మొత్తం నాలుగు వేదాల్లో నాలుగు మహావాక్యాలు మాత్రమే ఉన్నాయి.....
కానీ సద్గురువు బోధనల్లో అటువంటి మహావాక్యాలు కోకొల్లలు.
అందులో ఏ ఒక్క వాక్యాన్ని తీసుకొని ఉపాసన చేసినా
ఆత్మానుభవం కలగడం తథ్యం.
అటువంటి మహావాక్యాలలో ఒకటి -
"నాతో సహా సర్వమూ నాలో ఉన్నట్లున్నది"
* * *
"ఉన్నట్లున్నది" అనగా ఉన్నట్టు కనిపించే లేనిది.
అనగా ఎడారిలో యెండమావి వలె.
త్రాడులో పాము వలె.
ఉన్నది, ఉన్నట్లున్నది రెండూ ఒకే బిందువులో ఉన్నాయి.
నీ దృష్టిని ఏ వైపు మళ్లిస్తే
నీవు అదిగా మారుకునే వెసులుబాటుతనం మన మనసుకు ఉంది.
"ఉన్నది"కి, "ఉన్నట్లున్నది"కి మధ్య గీత మనసు.
అనగా చైతన్యానికి, ప్రపంచానికి మధ్య గీత మనసు.
రెంటి స్పర్శా ఉంటుంది మనసుకు.
అందువలన ఎన్నిక తన ఇచ్ఛ ప్రకారమే ఉంటుంది కాబట్టి
ప్రపంచదృష్టి కలిగి, వ్యవహారంలో మునిగి ఉంటే
కర్మబంధం ఉంటుంది.
ప్రపంచదృష్టి మాని చైతన్యం వైపుకు దృష్టి మరలిస్తే
కర్మబంధం తొలగుతుంది.
* * *
"నాతో సహా సర్వమూ ఉన్నట్లున్నది".
ఈ మహావాక్యాన్ని గురువుగారు తరచూ వాడుతుంటారు.
శిష్యులు యధార్థస్థితి నుండి జారిపోతున్నప్పుడల్లా
ఈ మహావాక్యాన్ని గుర్తుచేసి, తిరిగి స్వస్థితిలో స్థాపిస్తుంటారు.
శిష్యులు ఇతరుల గురించి, ఇతరాన్ని గురించి వాపోతున్నప్పుడల్లా.....
అంతమంది యెక్కణ్ణుంచి వచ్చారు?
ఉండేది నీవొక్కడివే....మిగతా అంతా....నీతో సహా నీవు కనే కలే...
నిన్ను విడిచి దేనికీ ఉనికి లేదు...
అని బోధిస్తూ మొత్తం వ్యవహారాన్ని "నేను" వైపుకు మళ్లిస్తారు....
"నేనే కేంద్రం" అనిపిస్తారు....
* * *
నేను - ఉన్నది.
నాలో ఉన్నదంతా - ఉన్నట్లున్నది.
బంగారం - ఉన్నది.
ఆభరణం - ఉన్నట్లున్నది.
ఆధారవస్త్రము - ఉన్నది.
నామరూపచిత్రములు - ఉన్నట్లున్నది.
* * *
యెడారిలో యెండమావి కనబడుతుంది.
దగ్గరకు వెళ్లి చూస్తే జల కనబడదు.
అలా స్వానుభవంగా తెలుసుకొని
యెండమావి వైపుకు పరుగులు మానడం ఎంతో
అనుభవజ్ఞుడు(గురువు) చెప్పే-
"అక్కడ జల లేదు" అనే మాటపై నమ్మకంతో పరుగులు మానడం కూడా అంతే.
అలా కాదు మేం స్వయంగా పరుగులు పెట్టి జల లేదనే విషయాన్ని తెలుసుకుంటాం... అంటే, గురువు కాదనరు.
ప్రయత్నం - కర్మయోగం.
నమ్మకం - భక్తియోగం.
అనుభవం - జ్ఞానయోగం.
* * *
దేవుడు - ఉన్నది.
జీవుడు - ఉన్నట్లున్నది.
అనగా దేవుడే జీవుడుగా ఉన్నట్లున్నాడు.
గురువు - ఉన్నది.
శిష్యుడు - ఉన్నట్లున్నది.
అనగా గురువే శిష్యుడుగా ఉన్నట్లున్నాడు.
"నేను" - ఉన్నది.
"నాది" - ఉన్నట్లున్నది.
అనగా నేనే సకలంగా ఉన్నట్లున్నది.
* * *
చిదాకాశమనే స్వచ్ఛమైన బ్లాక్ బోర్డు మీద వ్రాయబడిన(వ్యక్తం కాబడిన) వ్రాతలే ఈ ప్రపంచం.
"ఉన్నట్లున్నది" అనే డస్టర్ ను చేతబూని మొత్తాన్ని తుడిచేయి....
తర్వాత మిగిలి ఉన్నదేదో అదే సద్వస్తువు.
నేతి-నేతి ఇదికాదు-ఇదికాదు అంటూ త్రోసివేయమని ఋషులు చెప్పడం ఉద్దేశం కూడా ఇదే.
చెత్తను పారవేసి చెత్తబుట్టను తెచ్చుకుంటాం....
కానీ చెత్తబుట్టను కూడా పారవేయాలి.
ఆ చెత్తబుట్ట తానే(వ్యక్తే)
తననే మొదటి చెత్తగా గుర్తిసే చాలు...
శుద్ధాత్మ అనుభవంలోకి వస్తుంది.
"నేనిది కాదు" అని తెలిస్తే చాలు....
ఉన్నది ఏదో అది స్వరూపంగా శేషిస్తుంది.
No comments:
Post a Comment