🧘♂️24-కర్మ - జన్మ🧘♀️
అధర్మం అంటే ఏమిటి?
ధర్మానికి విరుద్ధమైనదంతా అధర్మమే. మనం చేసే అనేక దుష్కర్మలన్నీ అధర్మాలే.
ఏవి దుష్కర్మలు?
మన సమాజంలోని దుష్కర్మలని మహాత్మా గాంధి - యంగ్ ఇండియా పత్రికలో 1924లో ఇలా ఏడుగా విభజించాడు.
1. ఆదర్శాలు లేని రాజకీయాలు.
2. ఇతరులకి ఉపకరించని ఆస్థి పాస్తులు.
3. నీతి లేని వ్యాపారం.
4. శీలం లేని విద్య.
5. ఆత్మ ప్రబోధం లేని సుఖం.
6. మానవత్వం లేని శాస్త్రం.
7. త్యాగం లేని పూజ.
మనమంతా దుష్కర్మలు చేస్తున్నాం!!!!
మనం నిత్యం పాపాలైన అనేక దుష్కర్మలు చేసి వాటి బంధంలో చిక్కుకుంటున్నాం, అంటే మనలో చాలామంది అందుకు ఒప్పుకోరు. 'నేను ఒక్క పాపం కూడా చేయకుండానే జీవిస్తున్నాను' అంటారు. పాపం అంటే వారి ఉద్దేశ్యంలో సాధారణంగా బ్యాంకు దొంగతనం, హత్య , బలాత్కారం లాంటివే అని భావన. నిజానికి మనం చేసేది ఏదైనా అది చేయాల్సిన విధంగా, సరిగ్గా చేయకపోతే పాపంలో చిక్కుబడతాం.
మనం నిత్యం వ్యాపారంలో, వృత్తిలో, ఆఫీసుల్లో లేదా ఇంట్లో చేసే వివిధ పనుల్లో అనేక దుష్కర్మలు మనకి తెలీకుండానే చేస్తూంటాం. మనం శ్రద్ధగా, సమయానికి చేయని, మనకి అప్పగించిన పని వల్ల మనం దుష్కర్మలో చిక్కుకుంటాం.
నిత్య జీవితంలో మనమంతా సాధారణంగా చేసే ఎనిమిది దుష్కర్మలివి.
1. నివారించని ఇతరుల దుష్కర్మ బంధమే
దుష్కర్మ అంటే మనం చేసే చెడు కర్మలే కావు. మనం నివారించని దుష్టుల చర్యలు కూడా మనకి బంధమై చుట్టుకుంటాయి. అప్పుడు ఆ దుష్టులతో పాటు మనమూ ఆ కర్మ ఫలాన్ని పొందాల్సి వస్తుంది.
1964లో కిట్టీ జెనొవెసె అనే మహిళ న్యూయార్క్ లోని క్వీన్స్ అనే చోట తన అపార్ట్మెంట్ బయట దుండగుల చేత దాడి చేయబడింది.
గంట సేపు ఆమె సహాయం కోసం అరుస్తూనే ఉంది. చుట్టుపక్కల గల ముప్పై ఎనిమిది మంది ఇరుగు-పొరుగు వారు ఆ అరుపులని విన్నారు. కాని, ఆమె సహాయానికి ఎవరూ ముందుకు రాలేదు. కనీసం పోలీసులకి ఫోన్ కూడా చేయలేదు.
కొందరు సహాయానికి వెళ్తే తమకి ఏదైనా అవచ్చన్న భయంతో మిన్నకుంటే, మరి కొందరు అందులో జోక్యం చేసుకోవడం మంచిది కాదని ఊరుకున్నారు. ఇంకొందరు ఎవరో ఒకరు సహాయానికి వెళ్తారని పట్టించుకోలేదు. మొత్తానికి వారంతా ఇలా వివిధ కారణాల వల్ల కిట్టీ జెనొవెసె సహాయానికి వెళ్ళనే లేదు.
ఈ సంఘటన దుర్మార్గులని ఎదుర్కోక పోవడానికి సింబల్ గా ఈనాటికీ అమెరికన్స్ భావిస్తూంటారు. రౌడీలు, గూండాలు, దుర్మార్గులు, దుష్టుల దుశ్చర్యని అడ్డుకుంటే. తనకి ఏదైనా అవచ్చన్న స్వార్ధం అడ్డుపడుతుంది.
'ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టం కాదో అలాంటి పనిని ఇతరుల విషయంలో నువ్వు చేయద్దు' అన్న ధర్మాన్ని అనుసరించి దుర్మార్గులు చేసే మోసాలని, దౌష్ట్యాన్ని ప్రజలు పట్టించుకోకుండా ఉదాశీనంగా ఉంటే అది దుష్కృతం అయి మెడకి చుట్టుకుంటుంది.
తమ ఉద్యోగాన్ని కాపాడుకోడానికో, పై అధికారితో పేచీ రాకూడదనో లేదా తన బాధ్యతని విస్మరించినా మంచివాళ్ళకి కూడా ఆ దుష్కర్మల్లో భాగం ఉంటుంది. దానికి ఫలం లభించినప్పుడు వీరు కూడా ఆ దుష్కృతాన్ని చేసినవారితో పాటు తమ భాగాన్ని అనుభవించాల్సి ఉంటుంది.
ఏకం పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః!
భోక్తారో విప్రముచ్చన్తే కర్తా దోషేణ లిప్యతే!!
భావం:-
ఒకరు చేసే పాపాల ఫలాన్ని ఆ వ్యక్తితో పాటుగా అనేకమంది అనుభవించాల్సి ఉంటుంది. వారి సమీప బంధువులు, మిత్రులు, అవకాశం ఉండీ నిరోధించని పెద్దలకి ఆ పాప ఫలం సోకుతుంది. అందువల్ల పాపాన్ని చేసేవారిని అడ్డుకోవడం కర్తవ్య కర్మగా భావించి తదనుగుణంగా మసలుకోవాలి.
No comments:
Post a Comment