Tuesday, September 13, 2022

ఈ కాలపు అమ్మలు ఎదుర్కొంటున్న కొత్త కష్టాలు.

 ఈ కాలపు అమ్మలు ఎదుర్కొంటున్న కొత్త కష్టాలు.
ఆ కాలంలో అంటే మా బామ్మ ,అమ్మమ్మ , తాతమ్మ తరంలో మనిషోకో రకం ఐటమ్ వండటం లేదు .
ఒక కూర , పప్పు , పచ్చడి , రసము లేదా పులుసు ( పెరుగు లేదా మజ్జిగ సిద్ధం చేసి ) ఒకేసారి వండేసి దేవతార్చన చేసుకుని వాళ్ళ వరకు విడిగా మడిగా తీసుకుని వంట గదిలో నుండి బయటకు వచ్చేసేవారు .
రాత్రికి ఏ ఉప్పుడు పిండో , దిబ్బరొట్టో వేసుకుని తినేసేవారు.
ఎవరైనా రాత్రి కావాలంటే వేడిగా ఏ కూర ముక్కో వేయించుకుని , పొద్దున తినగా మిగిలిన పదార్ధాలు వేసుకుని వాటితో తినేసేవారు.
ఈ కాలంలో మనిషికో రకం. భర్త తినేది పిల్లలు తినరు. అత్త గారు తినేది భర్త తినడు . పిల్లలు తినేది భర్త , అత్తగారు వేలేసి ముట్టుకోరు . వంట చేయడమంటే అంటే పెద్ద మహా యజ్ఞం చేసినట్లే.
ముఖ్యంగా పిల్లలు చాలామంది ఇళ్ళల్లో భోజనము చేయడానికి చాలా పేచీ పెడుతున్నారు .
చచ్చి చెడీ మనిషో కో రకం చేసినా , తీరా భోజన సమయానికి పిజ్జాలు , పానీ పూరీలు లాంటి జంక్ ఫుడ్స్ బయట తినేసి ఇంటికి వస్తారు .
నాకాకలిగా లేదు . అన్నం వద్దని మారాం చేస్తారు . ఈ మారానికి ఆడ మగ తేడా లేదు .
పిల్లలంటే ఏ పదేళ్ళ లోపు వారంటే మీరు పప్పులో కాలేసినట్లే.
ఇంజనీరింగ్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ , డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకునే యువతీ యువకులు కూడా ఇందులో మినహాయింపు కాదు.
వాళ్ళమ్మకు తిండి దగ్గర ఎంత వరకు నరకం చూపించాలో అంత వరకు చూపిస్తారు .
రాత్రి 11 దాటినా అన్నం తినరు .
వండిన కూరలు అన్నం చూసుకుని తల్లి దిగులుపడి తినమని బ్రతిమలాడితే అమ్మ మీద దయ తలచి "అయితే మాకు ముద్దలు కలిపి పెట్టు. అలా పెడితేనే తింటాం " అని అమ్మకు కండిషన్ పెడతారు.
అర్ధరాత్రి డస్సిపోయి నిద్ర కళ్ళతో తూగుతూ అమ్మ ముద్దలు కలిపి పెట్టాలి .
ఈ ముద్దలు కలిపే ప్రహసనం రాత్రే కాదు ఉదయం కూడా . ఒక డిష్ లో కలిపిన అన్నం తీసుకుని అమ్మ పిల్లల వెనక వాళ్ళు స్కూల్ కు , కాలేజీ కి బయల్దేరే దాకా వారి వెనకాల పరిగెత్తుతూనే ఉంటుంది .
భోజనము చేయడానికి ఎంత సేపు పడుతుంది ?
చాలా విశ్రాంతిగా తిన్నా 20 నిముషాలు మించి పట్టదు .
రోజు మొత్తములోని 24 గంటలలో 20 నిముషాలు భోజనము చేయడానికి సమయం పిల్లలకు దొరకదా ?
సమయం దొరకక పోవడానికి ప్రధాన కారణం రాత్రి పది లోపు పడుకుని ఉదయం 5 గంటలకు లేవ వలసిన వాళ్ళు, రాత్రి ఒంటి గంట దాకా T.V. లో నానా చెత్త ప్రోగ్రాం లు చూసి అప్పుడు పడుకుని ఉదయం 8 గంటలు దాటాక లేచి , ఉరుకులు పరుగులు టిఫిన్ వద్దు , భోజనము వద్దు , లంచ్ బాక్స్ వద్దు టైం లేదు అని నానా హడావుడి చేసి అమ్మను నానా హైరాన పెట్టేస్తారు .
ఈ వారసత్వం ఆడ పిల్లలకు పెళ్ళిళై , మగ వారితో పాటు ఉద్యోగాలకు పరిగెత్తుతూ, పిల్లల్ని కని అమ్మ నెత్తిన పడేసి వాళ్ళకు కూడా చాకిరీ చేసే అయాగా అమ్మను చేసేస్తారు.
మళ్ళీ అంతులేని కధ పార్ట్ - 2 , పార్ట్ - 3 ప్రారంభం .
అప్పటికే ఆ తల్లులకు 60 దాటి పోయి కాళ్ళ నెప్పులు , కీళ్ళ నెప్పులు , బి .పి . , షుగర్ , ఆయాసం , నీరసం , గుండె దడ వంటి వ్యాధులతో పీడించబడి బాధపడుతూ చాకిరీ చేయలేక, చేయడానికి ఓపిక లేదని ఎవరికీ చెప్పుకోలేక తమ లో తామే నా జీవితం ఇంతేనా ? ఈ చాకిరీకి అంతం లేదా ? దేవుడా !! ఏం పాపం చేసాను ? అని శోకించిన తల్లుల గురించి కూడా నాకు తెలుసు. అలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూసాను
ఇది కాక భర్త ఆఫీసు నుంచి లేటుగా విసుగ్గా వచ్చి అడుగుతాడు భార్యను " పిల్లలు భోంచేసారా ? " అని. " ఇంకా తినలేదండీ " అనగానే కారణం దొరికింది కనుక " పిల్లలకు అన్నాలు కూడా పెట్టకుండా ఇంతవరకు నువ్వు వెలగబెడుతున్న రాచకార్యమేమిటి ?" అని భార్య మీద ఇంతెత్తున ఎగిరి పడతాడు. ఆ సమయానికి ఆ ఇల్లాలు అప్పుడే తీరుబడై ఏ t.v. నో చూస్తూ కూచుని ఉందనుకోండి , ఇక ఆయన ఉగ్ర నరసింహావతారం దాలుస్తాడు.
అంటే వేళకి తినని పిల్లలు వల్ల మాటలు పడుతోంది మీ అమ్మ గారు. గ్రహించారా ?
దీనికి పరిష్కారం తన తల్లి పడుతున్న కష్టంలో సాయం రూపంలో ప్రతి బిడ్డా భాగం పంచుకోవాలి . కనీసం వంటలో సాయం చేసే మాట దేవునికి ఎరుక.
మీ తిండి అయినా మీరు తినక పోతే ఎలా ?
25 ఏళ్ళు వచ్చినా డిగ్రీలు పూర్తయాక కూడా అమ్మ అన్నం ముద్దలు కలిపి మీ నోట్లో పెట్టాలంటే ఆమెకు ఒంట్లో ఓపిక ఉండవద్దా ?
ఈ విషయాలు కూడా చదువుకున్న వారికి మరొకరు చెప్పాలా ? 

No comments:

Post a Comment