290822f1840. 190922-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
శివ శివా..! రామ రామా..!
➖➖➖✍️
’శివ శివా..రామ రామా..’ అనడంలో అంతరార్ధం తెలుసా మీకు ....?
ఏదైనా తప్పు జరిగినప్పుడు, చూడకూడనిది చూసినప్పుడు. ‘శివ శివా, రామ రామా,’. శ్రీరామా అని అనుకోవటంలో ఆంతర్యం ఏమిటి? అసలిది ఎప్పటి నుంచి అలవాటైంది? అనే విషయాన్ని గురించి..వివరించే కథా సందర్భం...!!
శివమహాపురాణం రుద్రసంహిత ఇరవైనాలుగో అధ్యాయంలో .. ఈ కథాసందర్భం కనిపిస్తుంది.
శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు. ఆ స్వామి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ‘రావణవధ’ అనే దైవకార్యం కోసం సీతాపహరణ జరిగింది. అప్పుడు రాముడు, ఆయనను వెన్నంటి ఉన్న తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరూ ఆ అడవుల్లో సీతకోసం అడుగడుగునా వెతుకుతూ ముందుకు వెళ్లసాగారు.
సీతను వెతికే సమయంలో రామచంద్రుడిని అమితమైన దుఃఖం ఆవరించింది. అలాంటి స్థితిలో ఉన్న రాముడిని, లక్ష్మణుడిని లోకసంచారం చేస్తూ ఆకాశమార్గాన వెళుతున్న శివుడు, పార్వతీదేవి చూశారు.
కట్టుకున్న భార్య కోసం రాముడు విలపిస్తున్న తీరు సతీదేవికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. భార్య కోసం భర్త నిజంగా ఇంత వేదనను అనుభవిస్తాడా? పురుషులు స్త్రీల విషయంలో అందులోనూ భార్య విషయంలో ఇంతగా మమకారాన్ని కలిగి ఉంటారా? అనే సందేహాలు ఆమెకు కలిగాయి.
అదే విషయాన్ని గురించి శివుడిని సతీదేవి అడిగింది.
అప్పుడు శివుడామెకు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడని, ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎలా పాటించాలో ఆయనకు బాగా తెలుసునని, ఒక భర్తగా భార్యను ప్రేమించటంలోనూ, ఆరాధించటంలోనూ రాముడిని మించినవారు మరొకరు లేరని వివరించాడు. అయినా సతీదేవికి ఆ విషయం అంతగా మనసుకు ఎక్కలేదు.
రామచంద్రుడు ఆనందానికి దూరమై దేహకాంతి తగ్గి దుఃఖభారంతో అడుగులు ముందుకేయటం ఇవన్నీ నటన అని భ్రమించింది. అందుకే మళ్లీ ఆ పరమేశ్వరి శివుడిని రాముడి గురించి అడుగుతూ రాముడి ప్రవర్తన మీద తమకు నమ్మకం కలగటం లేదని అనుమతిస్తే.. తాను స్వయంగా శ్రీరామచంద్రుడిని పరీక్షించి నిగ్గుతేల్చాలనుకొంటున్నట్లు చెప్పింది.
శివుడు చిరునవ్వు నవ్వి ఎవరు ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా ఏకపత్నీవ్రతం విషయంలో రాముడిదే గెలుపవుతుందని అన్నాడు.
సతీదేవిని వెళ్లి రాముడిని పరీక్షించమని చెప్పి ఆయనొక మర్రిచెట్టు కిందకు వెళ్లాడు.
సీత రూపంలో సతీదేవి వెంటనే సీతామాతలాగా రూపం మార్చుకొని సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్మణులకు కనిపించే మార్గంలో వారికెదురుగా నడుచుకొంటూ రాసాగింది.
శ్రీరాముడు భార్య భ్రమలో ఉండి తనను సమీపిస్తాడని, తననే భార్యగా అనుకొని సంతోషంతో పొంగిపోతాడని ఆమె అనుకొంది.
కానీ సీతగా రూపం మార్చుకొన్న సతీదేవి సమీపానికి వచ్చేసరికి శ్రీరాముడు ‘శివ శివా’ అంటూ శివనామస్మరణం చేస్తూ పక్కకు తప్పుకొని వెళ్లిపోయాడు.
లక్ష్మణుడు ఆయననే అనుసరించాడు.
రాముడి గురించి శివుడు చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని అలా సతీదేవి గ్రహించింది.
భార్య మీద ప్రేమానురాగాలు ఏ మేరకుండాలో, భ్రమలు ఆకర్షణలకు దూరంగా వాస్తవమైన ప్రేమ అనేది ఎలా ఉంటుందో, ఇలా రాముడి పాత్ర చిత్రణం ద్వారా శివమహాపురాణం వివరిస్తోంది.
అంతేకాక పరస్త్రీ తన ఎదురుగా ఆకర్షించే రూపంలో వచ్చినప్పుడు రాముడు శివశివా అనటంవల్ల శివనామం పాపహరణమని, అది రాముడికి కూడా ఎంతో ఇష్టమైనదని స్పష్టమవుతోంది. అలాగే శివుడికి రామచంద్రుడి వ్యక్తిత్వం మీద ఎంత నమ్మకమో తెలుస్తుంది.
అందుకే రామనామం శివుడికి ఇష్టమైంది. పురాణకాలం నుంచి ఇలా చూడకూడనివి చూసినప్పుడు లేదా పాపం అని అనిపించినప్పుడు ‘శివశివా’ అని అనుకోవటం ఓ అలవాటుగా వస్తోందని.. ఈ పురాణ కథవల్ల తెలుస్తోంది.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment