అహింస!
➖➖➖✍️
ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టము లేని కార్యాన్ని బలవంతంగా చేయించి, తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మలచేత బాధ కలిగించడం హింస.
సర్వకల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస.
హింస మూడు రకాలు:
మానసిక హింస, వాచిక హింస, కాయిక హింస.
పరులకు హాని తలపెట్టడం, మనో నిగ్రహం లేకపోవడం, పాపభీతి లేకుండా ప్రవర్తించడం అనేవి మానసిక హింస.
అసత్యాన్ని పలకడం, అహితముగా లేదా కఠినంగా మాట్లాడడం వాచిక హింస.
ఒక జీవిని చంపడం, గాయపరచడం, దుష్క్రియలచేత పీడించడం, పరస్త్రీ సహవాసం, పరధనాపహరణం, మాంస భక్షణ కాయిక హింస అనబడతాయి.
"అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః
దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి."
… అని చెప్పబడింది.
"జీవో జీవస్య జీవనమ్"
…అనగా ఒక జీవి మరొక జీవిని చంపి తినడం జంతు ప్రవృత్తి.
అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం, తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం దైవ గుణ సంపద.
అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు మొదలైన భావాలు దైవం వల్లనే కలుగుతాయి. ధర్మాలు అన్నింటిలో అహింస శ్రేష్ఠమైన ధర్మం.
భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.
అహింస మహావిష్ణువునకు ప్రీతికరమైన ఎనిమిది పుష్పాలలో మొట్టమొదటిది.
అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, సహనం, శాంతం, తపస్సు, ధ్యానం, సత్యం అనేవి ఈ ఎనిమిది పుష్పాలు.
అలాగే …
బుద్ధదేవుడు అహింసా ప్రవచనం చేసినది మనదేశంలోనే. మహాత్మా గాంధీ ఆచరించిన సత్యాగ్రహం అహింస యొక్క ఒకానొక రూపం.
ఇక జైన మతస్తులు గాలి పీలిస్తే గాల్లోని సూక్ష్మజీవులు చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు, అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు.
మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఆత్మ ఉంటుందట.
ఇక ఇస్లాం మతంలో అహింస విషయానికి వస్తే .. ఇస్లాం అనే పదానికి అర్ధమే అహింస, శాంతి. ముస్లిం అంటే శాంతి కాముకుడు. ముహమ్మదు గారి ప్రవచనాలలో ఆత్మరక్షణ కోసం యుద్ధప్రబోధాలున్నాయి. మామూలు వాతావరణంలో ఎంతో శాంతిగా ఉంటూ పొరుగువారి హక్కులను కాపాడుతూ ఉండాలనే బోధనలున్నాయి.
క్రిస్టియానిటీ లో ఏసుక్రీస్తు శాంతికి చిహ్నం అయ్యాడు. అహింసను బోధించాడు. కత్తిపట్టినవాడు కత్తికే బలౌతాడనిచెప్పాడు. ఒక చెంపమీదకొడితే మరో చెంపచూపించమన్నాడు.
అక్టోబర్ 2 గాంధీజయంతి ప్రపంచ శాంతి దినోత్సవంగా ఖ్యాతి కెక్కింది.
గాంధీ అహింస గురించి యంగ్ ఇండియా పత్రికలో 1928 లో అన్న కొన్ని అంశాలు ఇవి :
‘‘… ప్రతి చెడు తలపు, తగని తొందరపాటు, అనృతం, విద్వేషం, ఇతరులెవరైనా చెడిపోవాలనే కోరికా – ఇవన్నీ అహింసా సూత్రానికి విరుద్ధాలు. ప్రపంచానికి కావలసింది ఒకరు తన వద్ద ఉంచుకుంటే హింసించిన వాడౌతాడు. సత్యం, అహింసలు ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి. అహింస సాధనం, సత్యం సిద్ధి…’’
“వేలాది వేల సంవత్సరాల నుండి పశుబలమే ప్రపంచాన్ని పాలిస్తోంది. దీని దుష్ఫలితాన్ని అనుభవించి, అనుభవించి మానవకోటికి రోత పుట్టింది. హింస వలన ప్రపంచానికి మేలు జరుగదు. చీకటి నుండి వెలుతురు రాగలదా?"
‘‘హింసించి’’ హక్కులను స్థిరపరచుకోవడం తేలిక మార్గంగా కనిపించవచ్చు. కానీ పోను పోనూ ఇది కంటకావృత మార్గమవుతుంది. ఈతగానికి నీటి గండం, సైనికునికి కత్తి గండం తప్పదు.”
‘‘కోపం అహింసకు శత్రువు. ఇక, గర్వం అహింస పాలిటి రాక్షసి. గర్వం అహింసను మింగిఊరుకుంటుంది…అహింస క్షత్రియుల మతం. మహావీరుడు క్షత్రియుడు. బుద్ధుడు క్షత్రియుడు. రామకృష్ణులు క్షత్రియులు. వీరందరూ అహింసా ప్రచారం చేశారు. వీరి పేరిట మనం అహింసను ప్రచారం చేయాలి.’’
ఏమయినా అహింసా విధానం పాటించాలంటే క్షమ, ఓపిక, పట్టుదల, ధైర్యం ఇంకా ఎక్కువ అవసరం. ఆ బలం మనకు చేకూరాలని ఆకాంక్షిద్దాం.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment