నేటి జీవిత సత్యం.
పుట్టుక, మరణాల మధ్య జీవితం చైతన్యవంతంగా కొనసాగుతుంది. ఈ జీవితంలో మనస్సు ద్వారా అనేక అనేక ఆలోచనలతో జీవితానికి సంబంధించి కీలకమైన సమాచారం వస్తుంది. ఈ ఆలోచనలన్నీ మనిషి శారీరక మానసిక కర్మలను బట్టి వస్తుంటాయి. శరీరంలో శక్తి తక్కువగా ఉంటే భౌతికపరమైన ఆలోచనలు, శక్తిస్థాయులు పెరిగే కొద్దీ మార్పు చెంది ఆధ్యాత్మికత గురించి, ఆత్మను గురించీ ఆలోచనలు వస్తుంటాయి.
మనిషికి తమోగుణంతో శరీరానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. యవ్వనంలో ఇంద్రియాలు ఉద్రేకం ఎక్కువగా ఉండి రజోగుణంకు సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి.
వయసు మళ్లి వానప్రస్థంలో ప్రవేశించగానే ప్రేమ, దయ, జాలికి సంబంధించిన సత్వగుణ ఆలోచనలు వస్తుంటాయి. జ్ఞానపరంగా ఎదిగిన వారికి అత్యుత్తమమైన ఆలోచనలు వస్తాయి.
మనుషులని తన మనసే నడిపిస్తుంది అసలు ఈ మనసు ఎక్కడ ఉంది, దానిని గుర్తించడం ఎలా అంటే గత జన్మల కర్మల అనుభవాల ప్రతిరూపమే మనసు. దీని యొక్క ప్రభావం సూక్ష్మ శరీరం పై పడుతుంది. మనసులో వచ్చే ఆలోచనలు ప్రతిరూపమే మానవ జీవితం.
మనిషి కుటుంబం, సంఘం, సమాజంలో వివిధ రకాల వ్యక్తుల మధ్య జీవిస్తున్నప్పుడు, కొందరు పాతవారు దూరమవుతారు. వారి ఆలోచనల ప్రభావం కొంత ఉంటుంది. కొందరు కొత్తవారు దగ్గరవుతారు వీరు వీరి ఆలోచనలని జోప్పించడానికి సిద్ధంగా ఉంటారు. వీరి ద్వారా గాయాలు, ఘర్షణలు, సంఘర్షణలు, వ్యతిరేకతలు, అనుకూలతలు, మానసిక ఒత్తిడుల రూపంలో మనసులోకి ప్రవేశిస్తాయి. అప్పుడు ప్రతి వ్యక్తి ఆలోచనలు మాటలు ద్వంద్వంతో కూడి ఉంటాయి.
ద్వంద్వం అంటే రెండుగా ఉన్నది. ఒకటి బయటికి వ్యక్తమౌతుంది. మరొకటి లోపల దాగి ఉంటుంది. బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తే లోపల దాగి ఉన్న దాన్ని గుర్తించలేము. ఎప్పుడైతే బయటపడ్డ దాని గురించి ఆలోచిస్తామో అప్పుడు పక్షపాతంగా, ఏకపక్షంగా, పరిమితంగా ఆలోచిస్తున్నట్లే,
ఎప్పుడైతే మానవుడు లోపల దాగి ఉన్న దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడో... పరిమితంగా ఆలోచించడం నుండి అపరిమితంగా ఆలోచించడం మొదలవుతుందో అదే అప్పుడే అజ్ఞానం నుంచి బయట పడి జ్ఞానం పొందుతాడు.
అనవసర విషయాలపై అతిగా ఆలోచిస్తే శారీరక శ్రమ చేసిన దానికంటే రెట్టింపు శక్తిని కోల్పోతున్నాడు. కొందరు ఎలాంటి శారీరక శ్రమ లేని పనులు చేస్తున్న సాయంకాలానికి అలసిపోతారు.
కారులోనో, బస్సులోనో, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి శారీరక శ్రమలేకున్నా అలసి పోతున్నారు అనవసరంగా అతిగా మనసు ఆలోచించటమే అందుకు కారణం..
మనస్సు ఆలోచించకుండా ఉన్నప్పుడు శూన్య స్థితికి చేరుతుంది.
బాహ్య ప్రపంచంలో ఏది జరిగినా ఎలా జరిగినా అనుకూలతలకు, ప్రతికూలతలకు మనస్సు స్పందించకూడదు. ఇదే ఆధ్యాత్మిక మార్గం.
అజ్ఞాని అంతరంగాన్ని విస్మరించి ప్రాపంచిక విషయాలపై ఆరాటపడుతూ ప్రపంచం నుంచి నాకేంటి అనే భావనను అతిగా పెంచుకొని ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే భావనతో అసంతృప్తి చెంది ప్రాపంచిక విషయాల మోజులో సంబంధాలు ఏర్పరుచుకున్నాడో అప్పుడు పరిమితంగా ఆలోచిస్తాడు.
జ్ఞానికి విశ్వం గురించి దైవం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి, దైవం వైపు మళ్ళి బంధాలను విడనాడి ఏకత్వం వైపు మళ్లాలి. ఏ వ్యక్తి ఏకత్వం వైపు మళ్ళి తన మనసును సరి చేసుకుని సంపూర్ణతను పొందుతూ దైవం వైపుగా ప్రయాణం చేస్తాడో అతను జ్ఞానిగా మరి ముక్తి లేదా మోక్షం పొందే అవకాశం ఉంది.
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment