Saturday, September 24, 2022

ముక్తికి ‘వైరాగ్యం - అభ్యాసం' రెండూ అవసరమే

 *🌹 శ్రీ రమణీయం 🙏

*👌ముక్తికి 'వైరాగ్యం-అభ్యాసం' రెండూ అవసరమే👌*

                                ✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
*నమో వేంకట రమణాయ, అద్వైత నిధయే నమః*
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 *12. ముక్తికి ‘వైరాగ్యం - అభ్యాసం' రెండూ అవసరమే* 🌹

✳️ అందరిలోనూ ఆత్మ ఉనికితో పాటు ఆత్మజ్ఞానం కూడా సమానంగానే ఉంది' అని శ్రీరమణ భగవాన్ అంటున్నారు. మనం ప్రస్తుతం సత్యం అనుకుంటున్నదంతా మాయ. సత్యం కాని విషయాల యెడల జ్ఞానం మిథ్యాజ్ఞానంగా ఉండి మనకి అవిద్యగా కనిపిస్తుంది. అంతే తప్ప ఆత్మానుభవం కానివారే లేరని భగవాన్ స్పష్టం చేస్తున్నారు. అనుభవానికి వస్తూ ఉన్న ఈ ఆత్మ ఉనికిని తెలుసుకోవడమే మనం చేయాల్సిన సాధన. అందుకు అడ్డుగా ఉన్న త్రిగుణాలు, వాసనా వికారాలు తొలగించాలి. మన సంసారం అని భావించేదంతా జన్మ జన్మలలో మనం పోగుచేసుకున్న సంస్కారాలే. అవే మన స్వస్వరూప దర్శనానికి అడ్డుగా ఉన్నాయి. అంతే తప్ప భౌతిక జీవనం దైవ దర్శనానికి ఏ రకంగానూ అడ్డం కాదు. జ్ఞానులు, యోగులకు కూడా భౌతిక జీవనం తప్పలేదు కదా! సత్యాసత్యాలు ఒకేసారి అనుభవంగా ఉంటున్నా మన వాసనా బలం దేహస్మృతికే ప్రాధాన్యతను ఇవ్వడంవల్ల మనకి సత్యం అర్థం కావడం లేదు. బాహ్యంగా కనిపించే ఫలాన్ని గౌరవిస్తాం తప్ప మూలమైన విత్తనాన్ని పరిగణనలోకి తీసుకోనట్లే ఇది కూడా.

✳️ మనలో ఉన్న వాసనాబలమే పరమశాంతికి ప్రధాన అవరోధం. ఈ వాసనలు ఉన్నంత కాలం దైవధ్యానానికి అవసరమైన చిత్త ఏకాగ్రత సాధ్యం కాదు. మనలో వాసనావికారాలు ధ్యాన సాధననే కాదు, ఏ లౌకిక విషయ ఫలాన్ని కూడా అందనివ్వవు. ఈ వాసనలను రూపుమాపటానికి మనకి రెండు ఆయుధాలు కావాలి ఒకటి వైరాగ్యం, రెండవది అభ్యాసం. మనకి ఏది ముఖ్యమో తెలుసుకొని మిగిలిన వాటిని వదిలివేయడమే వైరాగ్యం. మన మనసుని కలుషితం చేసే విషయాలను వివేకంతో గుర్తించటం ద్వారా ఈ వైరాగ్యం సిద్ధిస్తుంది. ఏది మనకు శాశ్వత శాంతినిస్తుందో దాన్ని మాత్రమే ఆశ్రయించాలి. ఎందుకంటే మానవజన్మ పరమావధి ఆ ఉన్నతిని, దివ్యత్వాన్ని చేరుకోవటమే. దీనినే ఆధ్యాత్మిక సాధన అంటాం. 

✳️ భజన, మంత్రజపం, ధ్యానం, దేవతారాధన వంటి ఏదో ఒక రూపంలో మన సాధన సాగుతూ ఉండాలి. అభ్యాసం విధిగానూ, వైరాగ్యం నిషేధంగానూ భావించాలి. మన ఆధ్యాత్మిక ప్రయాణం అంతా ఈ రెండింటి సమన్వయంతోనే ఉంది. ఏ ఒక్కటి లోపించినా ఫలం అందదు. ఈ విధి, నిషేధాలు రెండూ అందరికీ ఒకేలా ఉండవు. వ్యక్తి అలవాట్లు, మానసిక స్థితిని బట్టి మారుతూ ఉంటాయి. మనస్సుకున్న వ్యసనాలను వైరాగ్యంతో వదిలి, మనకు శాంతినిచ్చే సాధనను స్వీకరించాలి. ఈ ప్రయత్నంలో మనకు అండగా నిలిచేది 'గురువు అనుగ్రహం'. ఒక బలహీనుడు యుద్ధంలో బలవంతుడికి లోబడినట్లే స్థిరమనస్కులైన సత్పురుషుల సహచర్యంతో మన బలహీనమైన మనస్సు ఓడిపోయి వారి వద్దనున్న శాంతిని పొందగలుగుతుంది. దేవాలయాల్లోనూ, పుణ్యక్షేత్రాల్లోనూ జరిగేది అదే! సద్గురువుల స్పర్శ, దర్శనాలే కాదు, స్మరణకూడా అంతటి ఫలాన్ని, శాంతిని ఇస్తాయి. గురువు అనుగ్రహం ప్రత్యేకంగా ఉండదు. వారి ఉనికే అనుగ్రహం. 

✳️ వైరాగ్యం లేని అభ్యాసం మనసుని కుదరనివ్వక భారం అవుతుంది. అలాగే అభ్యాసం కొనసాగించని వైరాగ్యం కేవలం నైరస్యంగా ఉండిపోతుంది. ఆధ్యాత్మికత నిరంతరం ఉత్సాహంగా సాగాలే కానీ నైరస్యంతో ఉండిపోవడం కాదు. విద్యార్థి టి.వి. చూసే అలవాటు మాని వేయగానే సరిపోదు. పాఠ్యపుస్తకాలు చదివితేనే పరీక్ష పాసయ్యేది. అలాగనీ టి.వి ముందు కూర్చొని పాఠ్యపుస్తకాలు చదివితే బుర్రకెక్కవు. కాబట్టి వదలాల్సింది వదలటం ఎంత ముఖ్యమో పట్టుకోవాల్సింది పట్టుకోవడం కూడా అంత ముఖ్యమే. 

✳️ ఆధ్యాత్మిక సాధనలో ప్రాథమికాంశం అయిన వైరాగ్యం సిద్ధించేందుకు విచారణ మార్గం ఎంతో సహకరిస్తుంది. నిరంతరం అదే ధ్యాసలో ఉంటే విచారణ మార్గమే సాధన కూడా అవుతుంది. చీకటి వెలుతురు నుండి వేరుగా లేనట్లే, మాయ దైవానికి వేరుకాదు. వెలుతురు స్థాయిని బట్టి చీకటి హెచ్చుతగ్గులు ఉన్నట్లే మనలో దైవచింతన స్థాయిని బట్టి మాయ మనని ఆవరిస్తుంది. దీపం పెద్దదిచేస్తే చీకటి తగ్గినట్లే దైవచింతన పెరిగే కొద్ది ఈ మాయ మాయమైపోతుంది. జగత్తు, మనదేహం ‘శాశ్వతం' అని భావించే ఈ మాయ ఈశ్వరుని యందలి విభ్రమ శక్తి మాత్రమే. కరెంటుతో పాటే షాక్ లక్షణం ఉన్నట్లే ఈశ్వరునిలోనే ఈ మాయగుణం కూడా ఇమిడి ఉంది. మాయకు సొంతంగా ఉనికి, శక్తి ఉండదు. అలా ఉండి ఉంటే అది ఈశ్వరుని పూర్ణత్వానికి భంగం అవుతుంది. ఈ మాయను మనం యుద్ధం చేసి జయించలేం. దానిని పూర్తిగా అవగాహన చేసుకోవడమే మనం దానిపై సాధించే విజయం. కడవలో నీళ్ళు ఎందుకు తగ్గిపోతున్నాయనే సంశయం దానికున్న రంధ్రాన్ని గమనించే వరకే ఉంటుంది. గారడి వాడి కిటుకులు తెలిసిన తర్వాత అవి చూస్తూ ఉన్నా మనని భ్రాంతికి లోను చేయవు. సినిమాలో సన్నివేశాలకు ఏడ్చే పిల్లాడికి, 'అవి ఉత్తుత్తి బొమ్మలే నాన్న, నిజంకాదు!' అని తల్లి చెప్పడంతో వాడిబాధ పోతుంది. అందుకే భగవంతుడి మాయను వివేకంతోనూ, దైవచింతనతోనే దూరం చేసుకోవాలి. మాయను అర్థం చేసుకోనంతకాలం అది మనని ఆడిస్తూనే ఉంటుంది. అశాశ్వతమైన దాన్ని సత్యం అనుకోవడమే 'మాయ'. ఈ దేహం దాని చుట్టు ఉన్న బంధాలు, బంధుత్వాలు అన్నింటినీ వదలనక్కరలేదు. శాశ్వతం కాదని తెలుసుకొని జీవిస్తే వైరాగ్యం సిద్ధిస్తుంది. 

✳️ జిల్లెళ్ళమూడి అమ్మవారు చెప్తునట్లు 'ఈ సృష్టిలో ఏదీ నాశనం కాదు కేవలం రూపాంతరం చెందుతుంది'. ఈ విషయం అర్ధం అయిన రోజు మనకి బాధ ఎక్కడది. 'అంతటి వివేకం కల్గిన రోజున శివుణ్ని మనంచూడటం కాదు, మనం చూసేదంతా శివుడిగా కనిపిస్తుంది.' అని శ్రీ రమణభగవాన్ అంటున్నారు. 

✳️ మనకి కనపడే ప్రతి దృశ్యం అశాశ్వతమని, ఒక శాశ్వత సత్య వస్తువు అంతర్లీనంగా ఉండటమే ఏ దృశ్యానికైనా కారణమని గ్రహించాలి. సినిమా తెరపై బొమ్మలు మారతాయి. ఆధారం అయిన తెర స్థిరంగా ఉంటుంది. మిరపకాయ పుట్టుక నుండి దానిలో కారం ఉన్నట్లే ఈశ్వరునితో పాటే ఆయన శక్తి కూడా ఆరంభం నుండే ఉంది. ‘సాంబ’ అంటే 'సహ అంబ' అని అర్ధం. శివుడు అంతర్లీనంగా ఉండి ఆయన శక్తిగా మనకి వ్యక్తం అవుతూ ఉంటారు. ప్రతిశక్తి వెనుక ఈశ్వరుడున్నాడని గుర్తించాలి. మనం చూసే ప్రతి శక్తి ఆయన అనుగ్రహమే. ఆ శక్తే ఆత్మగా ప్రాణంగా ఉండి మనని నడిపిస్తుంది. దీపం ఒకే చోట ఉన్నా దాని వెలుతురు విస్తరించినట్లే ఈశ్వరశక్తి ఎల్లెడలా విస్తరించి వ్యక్తం అవుతుంది. మూలమైన ఆ ఈశ్వరజ్యోతిని చూడడమే మన గమ్యం. మనలోనే ఉండి మన ఉనికికి కారణంగా ప్రతిబింబించే ఆ ఈశ్వరుడు లేక పోతే ఈ ప్రపంచం ఉన్నా అది మనకు లేనట్లే కదా! ఈ ప్రపంచాన్ని శివానుగ్రహమైన శక్తిగా చూసిన రోజు మాయకు ఆస్కారం ఎక్కడిది. 

✳️ అద్దం ఎదురుగా ఉన్నప్పుడు ప్రతిబింబం తప్పనట్లే ప్రతి కర్మకి ఫలం తప్పదు. దాన్నే మనం ప్రారబ్దం అంటాం. ఈ ప్రారబ్దమే మనని నడిపిస్తుంది. కర్మ ఫలదాత ఈశ్వరుడేనన్న సత్యాన్ని గుర్తించిననాడు మన ప్రారబ్దం మనని బాధించదు. మనకి ఈ ప్రారబ్దాన్ని అందించే ఈశ్వరుడు మనలోనే ఆత్మగా ఉన్నాడని తెలుసుకుంటే ఆత్మానందం మన సొంతం అవుతుంది. ఒక తలపు మరో మరపుకి కారణం. అలాగే ఈ దేహపరమైన తలపులే మన నిజ స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి. మన స్వరూపం అయిన చైతన్యాన్ని గుర్తించటం లేదు కానీ అది లేనినాడు మన దేహంగాని, ఉనికి కాని లేవు. కనుకనే మనం ఉన్నట్లు మనకి ఎప్పుడూ గుర్తుంటుంది. చివరికి ప్రేమించే భార్యా పిల్లల్ని మర్చి పోయినా మనని మనం మర్చిపోలేం కదా! అదే ఆత్మ వైభవం. 

✳️ మన 'స్వస్వరూప దర్శనానికి' అడ్డుగా ఉన్న సంస్కారాలు,వాసనలు నశించేందుకు గురువు బోధనలు ఆచరించాలి. వివేకంతో అనుసరించాలి. సముద్రం ఒడ్డున గుంటతవ్వి రాగి చెంబు దాచుకున్న ఓ సాధువుని చూసి అది ఆచారం అనుకొని అందరూ అలానే చేశారట. మనది అలాంటి మూర్ఖపు అనుకరణ కాకూడదు. ఆ దైవం సృష్టిగా, ప్రపంచంగా మారి మనలో నుండి 'నేను' గా వ్యక్తం అవుతాడు. మనం దీనికి వ్యతిరేక దిశలో ఆలోచించి ముందు నేను, తర్వాత ప్రపంచం, చివరకి ఈశ్వరుడని అనుకుంటున్నాం. అలాకాక మన ప్రతి ఆలోచన ఈశ్వరుడితో మొదలు కావాలి. వాస్తవానికి మనం చేసే సంకల్పాలన్ని మనవి కావు. ఈశ్వరుడివే. కేవలం వాటిని మనం గమనించడం చేత అవి మనవే అనుకోవడము అహంకారం. 

✳️ అన్నం ముద్ద గొంతు దిగేవరకు మనకు తెలుస్తుంది గనుక అదంతా మన ప్రతిభ అనుకుంటున్నాం. గొంతు దిగిన ముద్ద జీర్ణం అవడంలో మన ప్రమేయం ఎంత ఉంటుందో ఆలోచిస్తే ఈ అహంకారం పోతుంది. దేవాలయ గోపురం అంత ఎత్తుగా ఉండేది దైవం ముందు మనం చిన్నవారిమని చెప్పడానికే. ఒక విత్తనం నాటడం మన సంకల్పం అయితే వేల ఫలాలు రావడం మన సంకల్పం కాదుగా! అందుకే మనది సంకల్ప శక్తి కాదు. కేవలం గమనించే లక్షణం మాత్రమే. దాన్నే సంకల్పం అని భ్రమిస్తున్నాం. మన చేతిలో ఉన్నదల్లా ప్రార్ధన మాత్రమే. అదే మనకి శాంతినిస్తుంది. 

✳️ గురువు మన శక్తిని బట్టి సాధనని సూచిస్తారు. గురువు బోధను అనుసరించకుండా ఎంతో కొంత జ్ఞానాన్ని సముపార్జించకుండా సమాజానికి శాంతిని అందించకుండా భక్తి ఉన్నా అతడు నాస్తికుడేనని పెద్దలు చెప్తున్నారు. ఆధ్యాత్మిక జీవనంలో ప్రవర్తన మారి శాంతి రావాలి. కొందరికి దీర్ఘ సాధన చేస్తే లభించే ఫలితాలు కొందరికి స్వల్ప సాధనకే లభిస్తాయి. వారు గతంలో సాధనచేసిన కృతోపాసకులుగా మనం గ్రహించాలే తప్ప భగవదనుగ్రహంలో పక్షపాతం ఉండదు. వైరాగ్యంతో ఈ ప్రపంచం యెడల మనకున్న వ్యామోహం వదిలితే 'అభ్యాసం' ద్వారా దైవం వెంటనే మన అనుభవంలోకి వస్తుంది. ఆత్మ దర్శనం, దైవదర్శనం కావాలంటే మనం పరిశుద్ధంగా ఉండాల్సిందే.

🌈 *అంతటా ఉన్నది దైవమే !* 🙏

✳️ ఒక రాజు గారికి దేవుడి విషయంలో మూడు సందేహాలు కలిగాయి. అవి తీర్చమని శాస్త్రవిజ్ఞానం ఉన్న తన మంత్రిని అడిగారు. ప్రత్యక్ష దైవానుభుతి లేని ఆ మంత్రి తన సమాధానాలతో రాజును మెప్పించగలనో లేదోనని సంశయంతో కొంత గడువు కోరుకున్నాడు. సరియైన సమాధానాలు చెప్పలేక పోతే రాజు దండనకు గురికావల్సి వస్తుందేమోనన్న బెంగతో దిగులుగా ఉన్న మంత్రిని చూసి నిరంతర దైవచింతనలో ఉండే ఆ ఇంటి పాలేరు కారణం అడిగితెలుసుకున్నాడు. ఆ ప్రశ్నలకు తాను సమాధానం చెప్తానంటూ మంత్రి చేత ఒక లేఖ వ్రాయించుకొని దర్బారుకు వెళ్ళాడు. 

✳️ రాజు ప్రశ్నలు ప్రారంభించే ముందు సమాధానం చెప్పే తాను ఉన్నతాసనం పైన ఉండాలని నిబంధన పెట్టటంతో రాజు అతణ్ణి తన సింహాసనంపై కూర్చొమని చెప్పి తాను మరో ఆసనం పై కూర్చొన్నాడు. 'దైవం ఎక్కడ ఉన్నాడు'? అన్న రాజు తొలి ప్రశ్నకు సమాధానంగా పాలు తెప్పించి అందులో వెన్న ఎక్కడుందో చూపించమన్నాడు. 'దైవం ఎటుచూస్తుంటాడు'? అన్న రెండవ ప్రశ్నకు సమాధానంగా దీపం తెప్పించి దాని కాంతి ఏ దిక్కుకు ప్రసరిస్తుందని అడిగాడు. 'దైవం ఏం చేస్తుంటాడు’? అన్న ప్రశ్నకు సమాధానంగా రాజుని కింద, పాలేరును పైన కూర్చబెట్టగల సమర్ధుడని చెప్పి రాజుకి జ్ఞానోదయం చేశాడు.


        *ఓం నమోభగవతే శ్రీరమణాయ*


*సేకరణ:* 
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment