మనిషి పుట్టుక ఒక వరం. ఎన్నో జన్మల పుణ్య విశేషంతో మనిషి వివేకవంతుడిగా ఈ పుడమిపై జన్మిస్తాడు.
పుట్టిన వెంటనే అతడిలో ఏ వికారాలూ ఉండవు. భగవంతుడిలా మాయకు అతీతుడిగా, ఆనందంలో మునిగి తేలతాడు. శైశవదశ తరవాత బాల్యంలోకి అడుగు పెట్టి, విద్యాబుద్ధులు నేర్చుకొం టాడు. తదనంతరం యౌవనదశకు చేరుకుంటాడు. ఆ దశలో మనిషికి ఏర్పడే శక్తియుక్తులు, లోకజ్ఞానం కారణంగా రాగద్వేషాలు, శత్రుత్వమిత్రత్వాలు, స్వార్ధ పరమార్థాలు సంక్రమిస్తాయి. అవి వృద్ధాప్యందాకా కొనసాగుతాయి. జవ సత్వాలన్నీ ఉడిగిపోయిన ముసలితనంలో మనిషి క్రమంగా నిశ్చేష్టుడిగా కాలం గడుపుతాడు. చివరికి మరణ చక్రంలోకి చేరుకుంటాడు.
మనిషి తన నూరేళ్ల జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఎన్నో మంచి మార్గాలు న్నాయి. మనిషి తన స్వశక్తితో దేన్నైనా సాధించగలుగుతాడు. అసాధ్యాలను సుసా ధ్యాలు చేసుకుంటాడు. ఎవరూ ఊహించని అద్భుత చరిత్రలను సృష్టిస్తాడు. మనిషి తలచుకుంటే సంభవం కాని పనులు లేవు. మనిషికి ఆశలు మాత్రమే ఉంటే చాలదు. ఆశలను సఫలీకృతం చేసుకోగలిగే కృషి తోడు కావాలి.నిరంతరం ప్రయత్నం చేసే మనిషికి దైవం కూడా తోడవుతుందని పెద్దల మాట. మనిషి తన జీవితావసరాలు తీర్చుకోవడానికి ఎన్నో పనులు చేస్తాడు. ఆపారధనాన్ని కూడబెడతాడు. ఆస్తులను పెంచుకుంటాడు. తాను, తన కుటుంబం ఏ లోటూ లేకుండా ఉండాలని తపిస్తాడు. మనిషి తన సొంత లాభం మాత్రమే చూసుకొంటే జీవితంలో సంతృప్తిని సంపూర్ణంగా పొంద లేదు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ మనిషి చూడాలి. తానూ బతకాలి, అందరూ బతకాలి అని. ఎప్పుడూ భావిస్తూ ఉండాలి.
మహాత్యులు పరోపకారంతో చరిత్రలో నిలిచిపోయారు. వారి చరిత్రలు స్ఫూర్తిదాయకాలు, వారు నడిచిన మార్గం అందరికీ అనుసరణీయం. 'అందరూ సుఖంగా ఉండాలి. అందరూ సంపూర్ణారోగ్యంతో ఉండాలి. అందరూ ఎల్లవేళలా మంచినే చూడాలి. ఏ ఒక్కరూ దుఃఖించరాదు' అని మహానుభావుల ఉద్దేశం. అందరి సుఖాన్ని కోరే మనిషి తాను కొన్ని కష్టాలను ఎదుర్కొన్నా సహిస్తాడు. సహనం ఒక ఆభరణం, అందరి ఆరోగ్యాన్ని ఆశించే మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని నిర్మలంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఎవ్వరికీ హాని కలగని రీతిలో పరిసరాలను కాపాడతాడు. అందరూ మంచినే చూడాలని కోరుకుంటే మనిషి తాను మొదట మంచివాడు. కావాలి. తాను మారితేనే లోకమంతా మారుతుందని గ్రహించాలి.
విశ్వక్షేమమే మనిషికి దక్ష. విశ్వమంతా అల్లకల్లోలం అయితే, తాను ఒక్కడు మాత్రమే బతికి బట్టకట్టగలడా? లోకంలో కనిపించే సృష్టి అంతా పరోపకారం కోసమే. ప్రపంచం అందరి యోగక్షేమాల కోసమే తప్ప కొందరి లాభాల కోసం | ఏర్పడలేదు. విశ్వం అంతా ప్రకృతి ప్రసాదించిన దివ్యఫలం. దాన్ని అమృత ఫలంలా భావించి, ఆస్వాదించాలే కానీ ధ్వంసరచనలతో కలుషితం చేయరాదు. విశ్వహితంలోనే వ్యక్తిహితం అంతర్భవించి ఉంటుందనేది సత్యం. వేల ఏళ్ల క్రితం ఎవరో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలై ఎందరికో మధు రఫలాలను, చల్లని నీడను అందిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మనిషి తాను చేసే మంచి పనులవల్ల భవిష్యత్తులో మానవాళికి శ్రేయస్సును అందించాలి. అదే జీవన పరమార్ధం. మనసును విశాలం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనిషి తన జీవితాన్ని సఫలం చేసుకుంటాడు.
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment