Tuesday, September 6, 2022

దీన జన దుఃఖ నివారణమే ఉత్తమ ధర్మం

 దీన జన దుఃఖ నివారణమే ఉత్తమ ధర్మం

నకామయేహం గతిమీశ్వరాత్పరం, 
అష్టర్థియుక్తాం అపునర్భవం వా
ఆర్తింప్రవద్యేఖిలదేహభాజాం, 
అంతఃస్థితోయేన భవంత్య దుఃఖాః

ప్రపంచ శ్రేయస్సే లక్ష్యంగా వ్యాసభగవానుడు మానవాళికి అందించిన శ్రీమద్భాగవతంలో రంతిదేవుని తత్త్వాన్ని చెబుతూ, లోకం నడచుకోవలసిన ధర్మాన్ని సూచించే శ్లోకమిది. రంతి దేవుడు గొప్ప దాత. ఒక సందర్భంలో ఆయన తన మనసులోని భావాలను చెబుతూ.. ‘‘నేను అష్టసిద్ధులతో కూడిన ఉత్తమ గతినిమ్మని ఆ ఈశ్వరుణ్ని కోరను, ముక్తి కావాలని కూడా కోరను. సృష్టిలోని ఏ ప్రాణీ బాధ పడరాదని, అన్ని ప్రాణులలో నేనున్నాననే భావనతో ఆ దుఃఖాన్ని స్వయంగా అనుభవించాలని కోరుతున్నాను. దానివల్ల ఆ ప్రాణులన్నీ దుఃఖరహితమై సుఖాలను అనుభవించుగాక’’ అన్నాడు. 

రంతిదేవుని హృదయంలోని సర్వ సంక్షేమ భావనకు అద్దంపట్టే శ్లోకమిది. ప్రతి ఒక్కరూ ఎదుటివారిలోని దుఃఖాన్ని పంచుకుని, వారి బాధను నివారించే మార్గం వెతికితే లోకం సుఖమయమై నిలిచిపోతుంది.

ముఖ్యంగా పాలకులైన వారు ప్రజల దుఃఖాన్ని గురించి యోచన చేసి నివారణ చర్యలు చేపట్టాలి. దీన్ని నిరూపించిన మహాత్ములలో రంతిదేవుడు ఒకడు. భారతీయ ధర్మంలో ఇటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు. శిబిచక్రవర్తి, రంతిదేవి వంటి దాతలు స్వసుఖం కన్నా దీనజనుల ఆర్తిని నివారించడానికే ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చారు. తమ రాజ్యాలు పోయినా, సిరిసంపదలు పోయినా, చివరకు ప్రాణాలు పోయినా సరే లెక్కచేయక దీనజనుల పక్షాన్నేఆలోచించిన త్యాగధనులుగా చరిత్రలో నిలిచిపోయారు. లోకహితమే వారి ప్రధాన ధర్మం. పరుల దుఃఖ నివృత్తిలోనే పరమేశ్వరుడిని దర్శించుకున్న మహానుభావులు 

వారు రాజ్యాన్ని కోరరు. 
వారికి స్వర్గం అవసరం లేదు. 
వాళ్లెప్పుడూ మోక్షాన్ని కోరరు. 
దుఃఖార్తులైన ప్రాణుల దుఃఖం నశించాలని మాత్రమే కోరుకుంటారు. 

అంటే దీనజన దుఃఖ నివారణకు మించిన ధర్మం లేదన్న సత్యం గ్రహించిన సత్పురుషులు వారు. ఇదే సత్యమని విశ్వసించి, ఆచరించి చూపిన మహానుభావులు. సకల మానవాళికీ వారు ఆదర్శం                  
.
.
.
 

No comments:

Post a Comment