Sunday, October 16, 2022

దైవ చింతన

 *దైవ చింతన* 
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

💐 దైవం గురించి ఆలోచించడం అవసరమా¡! అని మనలో ప్రశ్నించుకుంటే, కొన్నివిషయాలు అర్ధమవ్వడం మొదలవుతాయి.  

💐 కాని,  ఈ ప్రశ్న ఎపుడు మొదలవుతుంది? 
జీవితంలో మనం అనుకునేవన్నీ జరుగవు కదా !¡
ఏ కొద్దిమందికో జరుగుతున్నట్లు అనిపిస్తుందే గాని, వారూ జీవితంలో ఎదురీదవలసినదే. 

💐 అయితే, మనం అనుకున్నవన్నీ ఎందుకు జరగటంలేదు? 
ఎంత ప్రయత్నంచేసినా అనుకున్నట్లుగా గాక మరోలా ఎందుకు జరుగుతోంది - ఇలా ఆలోచనాసరళి సాగుతుంటుంది. 

🌈 ఇలాంటి అంతర్మధనంవల్ల, మనం కొన్ని భిన్నమైన నిర్ణయాలకు వస్తాం. కొందరు ఇలా జరగటానికి, మన సంకల్పమే గాకుండా, ఎన్నో ఇతర విషయాలు కూడా, జరిగే సంఘటనలను ప్రభావితం చేస్తాయని, నమ్మి సరిపెట్టుకుంటారు. కొందరు తమకనుగుణంగా ఏదీ జరగడంలేదని దుఃఖపడుతుంటారు. ఇంకా కొందరు ఆలోచనాపరులు , తన విషయంలోనే గాకుండా అందరి విషయంలోనూ అలాగే జరుగుతుండటాన్ని గ్రహించి, దానికి కారణాలను ఊహించే ప్రయత్నం చేస్తారు. 

🌈 ఈ ప్రక్రియలో కొన్ని సంఘటనలను తరచి చూసినపుడు, అవి తమ ప్రమేయమేమీ లేకుండానే జరిగిపోతున్నట్లు గ్రహిస్తారు.
మన జీవనగమనంలో కష్టసుఖాలను అనుభవించి; బాధ్యతలు తీరిన తర్వాత, ఏ కొద్దిమందో గతాన్ని తిరిగి చూసుకుంటారు. అనేక సందర్భాలలో ఏదో అదృశ్యశక్తి తమను జీవితంలో నడిపించినట్లుగా తెలుస్తుంది.   

🌈 మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ, జరిగే సంఘటనలనూ జాగ్రత్తగా పరిశీలిస్తే, అన్ని సంఘటనలూ నిర్ణీతంగా ఏవిధమైన లోపమూ లేకుండా లోకవ్యవహారం జరుగుతున్నట్లు చూస్తాం. ఇలా జరగడానికి కారణమైన ఒక సూత్రధారి ఉన్నట్లుగా భావిస్తాం. ఆసూత్రధారినే దైవమని, పరమాత్మ అనీ, బ్రహ్మమని చెబుతాం. 

🌈 గడచిన జీవితం వైపు చూసుకున్నపుడే గాకుండా, ఇతర కారణాలవల్లా మనదృష్టి  భగవంతునివేపు మళ్లడం గమనిస్తాం. అలాంటి వారిని గురించి చూద్దాం. 

🌈 ఒక క్లిష్టమైన సమస్య వచ్చినపుడు  తమవంతు ప్రయత్నమంతా చేసి, ఇక నావల్లకాదని , ఏది జరిగినా దాన్ని స్వీకరిస్తానని ఉదాసీనులై  భగవదనుగ్రహం కోసం వేచి ఉండేవాళ్ళు ఉంటారు. వాస్తవానికి ప్రపంచంలో ఎన్నో దుఃఖకారణాలు ఉన్నాయి. కొందరికి ఈదుఃఖానుభవం సూక్షంగా ఉంటే, మరికొందరికి తీవ్రంగా ఉండటం మనం చూస్తాం.

🌈 తీవ్రదుఖానికి దారితీసే సంఘటనలకు ఉదాహరణగా - తను అమితంగా ప్రేమించే కుటుంబసభ్యులను పోగొట్టు కోవడం వల్లనో, లేదా అకస్మాత్తుగా ఉద్యోగవ్యాపారాల నుంచి తొలగిపోవటమో చెప్పవచ్చు. 

🌈 ఇవే గాకుండా అనారోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు మొదలైనవాటికి , ఎంత ప్రయత్నించినా నివారణోపాయం లేపోవడం   వంటి సంఘటనలూ, తీవ్ర దుఃఖానికి దారితీస్తుంటాయి. 

🌈 మరికొన్ని సందర్భాల్లో తమజీవితంలో అన్నీ పుష్కలంగా లభించి, వాటిని అనుభవిస్తున్నా, ఏదో తెలియని వెలితిని అనుభవిస్తుంటారు. ఇది వారిలో అంతర్గతంగా సూక్ష్మరూపంలో ఉన్న దుఃఖంగా భావించవచ్చు. ఇది ఆధ్యాత్మిక దుఃఖంగా పరిగణిస్తారు. ఇంకా కొందరిలో పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడిని తెలిసికోవాలనే వాంఛ ఉంటుంది.

🌈 మన స్వానుభవాన్ని నిశింతంగా పరిశీలిస్తే , సుఖాలలో ఉండేటపుడు అసలు ఆ సుఖానుభవాన్ని దాటి ఆలోచనే రాదు. సుఖానుభవం త్వరగా మరచిపోయేది. ఎందుకంటే ఒక  సుఖానుభవం తర్వాత మరొకదాని కోసం తపిస్తాం. కాని దుఃఖానుభవం  మనలో చెరగని ముద్రను వేస్తుంది. అంచేత దాన్ని మరచిపోలేక ఎన్నోసార్లు గుర్తుచేసుకొని బాధపడుతుంటాం. 

🌈 సరిగ్గా ఇలాంటి సమయంలోనే అసలు ఏమి జరుగుతుందో తెలియనిస్థితిలో ఉంటాం. అసలు నేను ఏమంత పెద్దతప్పు చేశానని  భగవంతుడు, నాకు ఇంతకష్టాన్ని ఇచ్చాడని వాపోతుంటాం కూడా. అట్టి సమయంలోనే కొందరు విచక్షణాజ్ఞానంతో ఆలోచిస్తారు. అపుడు వాళ్లకి భగవంతుడనేవాడు ఒకడున్నాడనీ , సర్వాన్నీ నడిపించే అతడిని తెలుసుకుంటే  దుఃఖోపశమనం కల్గుతుందనీ , మనమంతా నిమిత్తమాత్రులమని తెలుసుకుంటాడు.


🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 🙏

🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:*
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫

No comments:

Post a Comment