Wednesday, October 5, 2022

స్వామి వివేకానంద జీవిత గాథ, నిర్వికల్ప సమాధి

 041022d2157.    051022-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀100.
ఓం నమో భగవతే రామకృష్ణాయ

స్వామి వివేకానంద జీవిత గాథ:-100
                   ➖➖➖✍️

                 నిర్వికల్ప సమాధి
                        ▪️〰️▪️

ఒక రోజు సాయంత్రం ధ్యానం చేస్తున్నప్పుడు హఠాత్తుగా నరేంద్రునికి అద్వైత పరాకాష్టయైన నిర్వికల్పసమాధి స్థితి సిద్ధించింది. ముందు అతడి తల వెనుక విభాగంలో ఒక దివ్యజ్యోతి కానవచ్చింది. పిదప అతడు మెల్లమెల్లగా బాహ్య, శరీర స్మృతులను కోల్పోయి సమాధిలో మగ్నుడయ్యాడు. ఇంద్రియాలకూ, మనస్సుకూ, లోకాలకూ, సమస్తానికీ అతీతమైన చైతన్యమయమైన నిర్వికల్పసమాధిలో లయించిపోయాడు. అలా చాలాసేపు గడచిపోయింది.

 సమాధిస్థితి నుండి దిగి వచ్చిన తరువాత కూడా అతడికి శరీర స్మృతి పూర్తిగా రాలేదు. తల మాత్రమే ఉండడం అతడి కెరుక, తక్కిన దేహం ఉన్నట్లు అసలు తెలియలేదు. కాబట్టి, "నా శరీరం ఎక్కడ? నా శరీరం ఎక్కడ?” అంటూ కేకలుపెట్టాడు. అతడి కేకలు విని పరుగున వచ్చిన పెద్దగోపాల్, అతడి శరీరాన్ని తాకి చూపి, "ఇదుగో ఉంది. నరేన్, ఇదుగో ఉంది" అన్నాడు. గోపాల్ మాటలు నరేంద్రునికి వినిపించినట్లు లేదు. ముందు మాదిరిగానే కేకపెట్టాడు. దాంతో భయపడిపోయిన గోపాల్
పరుగెత్తుకొని మేడ మీదికి వెళ్ళి శ్రీరామకృష్ణులకు ఈ విషయం వివరించి చెప్పాడు. 

అంతా ప్రశాంతంగా విన్న శ్రీరామకృష్ణులు నవ్వుతూ, "అతణ్ణి ఆస్థితి లోనే ఇంకా కొంతసేపు ఉండనివ్వు. ఈ స్థితి కావాలని పలుమార్లు అతడు నన్ను వేధించాడు" అన్నారు.

చాలాసేపు గడచిన తరువాతే నరేంద్రునికి బాహ్యస్కృతి వచ్చింది. కళ్ళు తెరచి చూసిన అతడికి తన చుట్టూ సోదర శిష్యులు విచారవదనంతో కూర్చుని ఉండడం కనిపించింది. ఇన్ని రోజులుగా అతడి మనస్సులో చెలరేగుతున్న తుపాను ఉపశమించింది: అమిత ప్రశాంతత నెలకొంది.

 ఆ తరువాత అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లాడు. అతణ్ణి ఆనందంగా చూస్తూ ఆయన, "కాళీమాత ఇప్పుడు నీకు సమస్తాన్నీ చూపించింది. కాని ఈ అనుభవం తాత్కాలికంగా తాళం వేయబడి ఉంటుంది. దాని తాళం చెవి నా వద్ద ఉంటుంది. నువ్వు ఆమె కార్యాన్ని పూర్తిచేయగానే ఈ పెన్నిధి మళ్లీ నీకు దక్కుతుంది; మళ్లీ నీకు సమస్తమూ "అవగతమవుతుంది" అన్నారు.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment