స్కూల్ అంతా జనం.. తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ రూం ముందర నిల్చొని ఉన్నారు. అందరి మొహాల్లో కోపం ఆవేశం ఉన్నాయి.. కొందరు మాత్రం ఏవేవో గుసగుసలాడుతున్నారు.. సమయం ఉదయం 9:30 గం.. ప్రిన్సిపాల్ రావటానికి ఇంకా అరగంట పడుతుంది.. స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా ఒక్కొక్కరూ వస్తున్నారు.. అక్కడ పోగైన వారందరూ వాళ్ళని కోపంగా చూడటం ఏం జరిగిందో అర్థంకాక వారు మౌనంగా స్టాఫ్ రూం లోకి వెళ్లిపోవడం జరుగుతోంది.. తల్లిదండ్రుల్లో ఒకరు చూడండి ఇక్కడ ఇంతమంది నిల్చొని ఉంటే ఒక్కరైనా ఏం జరిగింది అని అడగడం లేదు.. నెల పడితే జీతాలు వచ్చేస్తున్నాయ్ మాకేంటి అనే గర్వం అని అనడం స్టాఫ్ రూంలో ఉన్న అందరికీ వినబడుతోంది.. వాళ్ళందరూ ఇంకా ఎవరికోసమో ఎదురు చూస్తున్నారు..
ఇంతలో ప్రిన్సిపాల్ రావడం తన రూం లోకి వెళ్లడంతో జనమంతా ఆయన రూంలోకి చేరిపోయారు.. కొంతమంది స్థలంలేక బయటనే ఉండిపోయారు.. ప్రిన్సిపాల్ అందరివైపు చూసి ఏం జరిగిందని అడిగారు.. అంతే ఉప్పెనలా చెప్పడం మొదలుపెట్టారు అందరూ.. ఇన్ని రోజులు ఏదో గుణవంతుడు మంచివాడు విద్యావంతుడు వివేకి అని ఏదేదో అనుకున్నాం.. ఇప్పుడు తెలిసింది ఆయన భాగోతం అని అంటుంటే ఆగండాగండి ఇంతకీ ఎవరిగురించి. మీరు మాట్లాడేది అని అడిగారు ప్రిన్సిపాల్.. ఇంకెవరు మేకతోలు కప్పుకున్న ఆ కామాంధుడు విశ్వనాథం మాస్టారు గురించి.. ప్రిన్సిపాల్ కోపంగానూ ఆశ్చర్యంగానూ చూసారు అందరివైపు...
"ఇంకొక నెలలో రిటైర్డ్ అవ్వబోతున్నాడు ఈ వయసులో ఏం పోయేకాలం ఆయనకి" వెనకనుంచి వినబడిందో గొంతు..
"పైగా రాష్ట్రపతి నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపు వొకటి.. ఉత్తమ కామాంధుడిగా ఇవ్వాల్సింది" వెటకారంగా మరొక గొంతు..
"ఎంతైనా మగాడు కదా ఎక్కడ పోతాయ్ మృగజాతి బుద్ధులు" మరొకరు..
"ఆయనకీ ఆడపిల్లలు ఉన్నారు కదా.. వాళ్ళని కూడా ఇలా ఎవరైనా అడిగితే సరి" మరొక కంఠం..
ఇలా ఎవరికి వారు నోటికొచ్చినట్లు తిడుతున్నారు..
విశ్వనాథం మాస్టారు స్కూల్ లో చేరి ముప్పై ఐదు సంవత్సరాలయ్యింది.. తనకున్న విద్యతో తెలివితేటలతో మంచితనంతో ఓర్పుతో అందరికీ అతి కొద్దిరోజుల్లోనే చాలా దగ్గరయ్యారు.. ఎవరినీ నొప్పించే మనస్తత్వం కాదు.. ఇంతవరకూ ఏ విద్యార్థిని కూడా దండించగా చూసినవారు గానీ విన్నవారుగానీ లేరు.. చుట్టుపక్కల వూరివాళ్లు కూడా విశ్వనాథం మాస్టారు ఉన్నారనే ఆ స్కూల్లో చేర్పించేవారు.. ఆయనకు భార్య ఇద్దరు ఆడ పిల్లలు.. భార్య ఇద్దరు ఆడపిల్లల్ని కని చనిపోయింది.. తర్వాత మాస్టారు పెళ్లి చేసుకోలేదు.. ఇద్దరు ఆడపిల్లల్ని బాగా చదివించి పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపించేసారు.. అల్లుళ్ళు కూడా ఆయన మనస్తత్వానికి తగ్గట్లుగానే దొరికారని అందరూ అనుకునేవారు..
"ఎక్కడండీ వాడు ఇంకా రాలేదు" అని ఎవరో అరుస్తూ అడిగేసరికి ఈ లోకంలోకి వచ్చారు ప్రిన్సిపాల్.. "ముందు మీరు ప్రశాంతంగా జరిగింది ఏంటో చెప్పండి" అని ప్రిన్సిపాల్ అడిగేసరికి ఒకావిడ ముందుకొచ్చి నా కూతురిని పట్టుకొని "ముద్దులు ఎన్ని రకాలో నీకు తెలుసా" అని అడిగాడట దరిద్రుడు.. పైగా "క్లాసులో ఉన్న అమ్మాయిలకే వర్తిస్తుంది ఈ మాట" అని కూడా అన్నాడట..
గుండె ఆగినంత పనైంది ప్రిన్సిపాల్ కి.. విశ్వనాథం మాస్టారు ఇలా మాట్లాడారా.. ఎక్కడో ఏదో తప్పు జరిగింది.. స్టాఫ్ ని పిలిచి ఆయన గురించి అడిగారు.. ఎవ్వరూ ఆయన చెడ్డవారని చెప్పలేదు.. ఎవరికీ అర్థం కావడం లేదు..
ప్రిన్సిపాల్ అందరివంకా చూస్తూ "ఎవరూ ఆవేశపడకుండా నా మాట వినండి.. ఇంతవరకూ విశ్వనాథం మాస్టారి మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదు.. ఆయన ఎటువంటివారో ఇక్కడున్నవారందరికీ బాగా తెలుసు.. అందరూ కూడా స్కూల్ మీటింగ్ హాలుకు రండి.. మాస్టార్ని కూడా అక్కడికే పిలిపిస్తాను" అని అనడంతో అందరూ మీటింగ్ హాలులోకి వెళ్లి మాస్టారు కోసం ఎదురుచూడసాగారు..
సార్ ప్రిన్సిపాల్ గారు మిమ్మల్ని మీటింగు హాలుకు రమ్మన్నారు.. అటెండర్ చెప్పగా సంతకం పెట్టి హుందాగా మీటింగు హాలులోకి అడుగుపెట్టారు విశ్వనాథం గారు..
ఆయనని చూడగానే అంతవరకూ తిట్టిన నోళ్ళు కూడా తమకి తెలియకుండా మర్యాదగా లేచి నిల్చున్నాయి.. మాస్టారు వెళ్లి ప్రిన్సిపాల్ పక్కన కూర్చున్నారు..
ప్రిన్సిపాల్ మాస్టారు వంక చూసి నమస్కరించారు.. ఆయనలో ఏ కోశానా తప్పు చేయలేదన్న భావన స్పష్టంగా అందరికీ కనబడింది..
"ఏంటి సార్ ఆయనని ప్రక్కన కూర్చోబెట్టుకొని ఏమీ అడగకపోతే ఎలా.. సమాధానం చెప్పమనండి" అరిచారు ఎవరో..
విశ్వనాథం మాస్టారు ఏం జరిగిందని ప్రిన్సిపాల్ ని అడిగారు.. కానీ ఎలా అడగాలో అని తడబడుతున్నారు ప్రిన్సిపాల్.. విశ్వనాథం మాస్టారికి ఏదో జరిగిందని అనిపించింది "సరే ఏదో జరిగిందని నాకు తెలుస్తోంది.. మీలో ఎవరైనా నాకు చెప్పండి.. మీ సమస్య నేను తీర్చడానికి ప్రయత్నిస్తాను" అని అనగానే సమస్యే మీరు అని అరిచారు అందరూ.. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు మాస్టారికి.. ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఎంతో గౌరవంగా చూసిన వాళ్ళు ఈ రోజు నన్ను దోషిగా చూస్తున్నారు.. నేనేం తప్పు చెయ్యలేదు.. హాలంతా రెండుక్షణాలు మౌనంగా గడిచాయి.. మాస్టారు గొంతు సవరించుకొని ఏం జరిగిందో చెప్పమని నా తప్పేంటో చెప్పండని అడిగారు..
మా ఆమాయిల్ని ముద్దుల గురించి అడిగారట కదా..
"మీకూ అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని అడగలేకపోయారా.. పెళ్లైంది కదా చక్కగా వర్ణించి ఉండేవాళ్ళు" కోపంగా అడిగాడు ఒకతను.. "మీరెంతో మంచివాళ్లనుకున్నాం, మీలో ఇన్ని కళలున్నాయని మాకు తెలీకుండాపోయింది" మరొకరు.. "ఇంత వయసొచ్చింది మీ మనవరాళ్ళ వయసున్న వాళ్ళని ఇలా అడగటానికి సిగ్గులేదు నీకు" ఆవేశంతో మరొక గొంతు.. "మర్యాదగా మా అందరికీ క్షమాపణ చెప్పి ఈ వూరు వొదిలి వెళ్లు" మరొక కేక.. ఇలా ఒకొక్కరు అరవడం మొదలుపెట్టారు.. కొంత సేపు అరిచి అరిచి "చూడండి మనం ఇంత అడుగుతున్నా ఒక్కమాట కూడా ఆయన నోటినుంచి పెగలడంలేడు" అరిచాడు ఒకడు..
"సమాధానం చెప్పవయ్యా" అడిగేడు ఒకడు..
విశ్వనాథం గారు లేచి నిల్చున్నారు.. ఎప్పుడూ ఉన్న చిరునవ్వు ఆ మొహంలో అలాగే కనబడుతోంది.. ఇన్ని రోజులకు నా మీద మీకున్న నమ్మకం గౌరవం భక్తి నిజమే అనుకున్నా.. నేను తప్పు చెయ్యను అని మీరందరూ అనుకునే విధంగా నడుచుకున్నానని గర్వం ఉండేది, మరి కొద్ది రోజులలో నాకు ఈ విద్యాలయానికి ఉన్న సంబంధం తెగిపోతోందే అని బాధపడుతూ ఉన్నాను.. కానీ ఈ క్షణం నాకు ఇంకా ఈ చోట ఉన్నానే అనే బాధను కలిగించారు.. చాలా సంతోషం.. నిన్న ఆఖరి పీరియడ్ నాది. పిల్లలకి విలువల గురించి క్లాసు తీసుకుందామని అనుకున్నాను. చెప్పడం మొదలు పెట్టారు విశ్వనాథం గారు.. అరిచిన నోళ్లన్నీ స్తబ్దుగా వింటున్నాయి ఆయన మాటలను.. "నిజమే నేను ఆడపిల్లలను మాత్రం అడిగాను ముద్దులు ఎన్ని రకాలో తెలుసా అని.. ఈ లోపల బెల్లు కొడితే అందరం ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకొక పది నిముషాలు బెల్లు కొట్టడం లేట్ అయ్యున్నా ఈరోజు మీరు ఇలా మాట్లాడేవారు కాదు.
అందరిలో తప్పుచేసామనే భావన మొదలయ్యింది. తల వంచుకుని కూర్చున్న స్టాఫ్, ప్రిన్సిపాల్ అందరూ హుందాగా నిటారుగా కూర్చున్నారు.. వాళ్ళ కళ్ళల్లో మునుపటి భయం లేదు. ఏదో శక్తి ఆవహించినట్లు మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.. మాస్టారి మీద తమకున్న నమ్మకం వమ్ముకాలేదన్న భావన కనబడుతోంది.
చెప్పడం ప్రారంభించారు మాస్టారు..
"ఇక్కడున్న ఆడపిల్లల్ని మాత్రమే ఎందుకు అడిగానంటే అది వారికి ముందు ముందు చాలా ఉపయోగపడే విషయం కాబట్టే..
ప్రపంచంలో అతి పవిత్రమైన ముద్దులు మూడే రకాలు..
అవి:-
1 తండ్రి ముద్దు :–
"అమ్మలూ మీ నాన్న పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉద్యోగరీత్యా ఎందరినో కలుస్తుంటాడు.. వాళ్ళవాళ్ళ అనుభవాలను కుట్రలను కుతంత్రాలను కల్మషాలను అన్నీ కూడా చూస్తూ వాళ్ళ మనస్తత్వాలను బేరీజు వేసుకుంటూ ఎవరినీ నొప్పించకుండా సాయంకాలానికి ఇంటికి క్షేమంగా చేరి మీ అందరితో సుఖంగా ఉండగగుతున్నాను.. నాలాగే నువ్వు కూడా ఉండాలని నీ స్నేహితులతో నీ గురువులతో నీ సహోద్యోగులతో సత్ప్రవర్తనతో మెలిగి జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకున్న పరిజ్ఞానాన్ని అనుభవాలను నీకు అందిస్తున్నాను" అని తన కూతురుని తండ్రి ఎప్పుడూ నుదుటిపైనే ముద్దు పెడతాడు.
2 తల్లి ముద్దు :–
"చిట్టితల్లి నా చిన్నతనంలోనే నాకు పెళ్ళిచేసారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్నో అనుభవాలు నా జీవితంలో ఎదురయ్యాయి. పొద్దున్న అందరికంటే ముందుగా లేచి అన్నీ పనులూ చేసుకుని మీ నాన్న మీ నానమ్మ మీ తాతయ్యా నా మరిదీ మరియు వాళ్ళ పిల్లలూ ఇలా రోజంతా క్షణం తీరిక లేకుండా అందరికీ అన్ని పనులూ నవ్వుతూనే చేసి తిరిగి సాయంకాలానికి మళ్లీ అందరికీ ఫలహారాలు గట్రా చేసిపెట్టి రాత్రి భోజనాలకి మళ్లీ అన్ని పాత్రలూ కడుక్కొని తిరిగి అందరూ తిన్న తర్వాత వాటిని శుభ్రం చేసి వచ్చి పడుకునేసరికి రాత్రి పదకొండు దాటుతోంది. తిరిగి పొద్దున్న నాలుగు గంటలకే లేచి యథాప్రకారం ప్రతీ రోజూ లాగే అన్నీ పనులూ చేసుకోవాలి.. ఒక్కరోజు నాకు వొంట్లో బాగలేకపోయినా ఇంటిపనులు నిలిచిపోతుంది.. ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు.. "ఎందుకు నీకు ధాత్రి అని పేరు పెట్టారో మన పెళ్ళైన తర్వాత కానీ అర్థం కాలేదు. నిజంగా ఆ పేరును సార్ధకం చేశావ్. నువ్వే లేకపోతే ఈ సంసారం ఎలా ఉండేదో వూహించుకొలేకపోతున్నాను.నీకు సహాయపడటానికి కూడా నాకు సమయం దొరకడంలేదు నన్ను క్షమించు ధాత్రీ" అంటూ నా వొళ్ళో తలపెట్టి భోరున ఏడ్చేసేవారు నాన్న.. అంత కష్టంలోను ఆయన నాపై కురిపిస్తున్న ప్రేమకి ముగ్దురాలినైపోయేదాన్ని.. కష్టాలన్నీ మరచిపోయేదాన్ని. ఇలా ఎంత కష్టమొచ్చినా చిరునవ్వుతో అన్నీ భరిస్తున్నాను.. నాలా కష్టపడకుండా నువ్వు హాయిగా ఉండాలి. నాకు దేవుడిచ్చిన వరం నా నవ్వు. ఆ నవ్వుని నీకు కూడా ప్రసాదించాలని ఆ భగవంతుడిని ఎప్పుడూ ప్రార్ధిస్తుంటాను.. నీ నవ్వుకు ఎప్పుడూ దిష్టి తగలకూడదని బుగ్గమీద ముద్దులు పెడుతూ ఉంటాను" అని తల్లి ముద్దుని తెలియచేశారు మాస్టారు..
అందరి కళ్ళల్లో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి.. నేల కృంగి పాతాళానికి దిగజారిపోయామన్న బాధ.. విశ్వనాథం గారి ప్రక్కన కూర్చున్న అధ్యాపకులందరూ ప్రిన్సిపాల్ తో సహా ఒక్కొక్కరుగా స్టేజి దిగి ఆయనకు ఎదురుగా క్రింద కూర్చున్నారు.. అంతే మరొక ఐదు నిముషాలలో హాలులో వున్న అన్ని కుర్చీలు మౌనంగా బయటకి వెళ్లిపోయాయి.. అందరూ నేల పైన కూర్చుని శోకతప్త హృదయాలతో మాస్టారి వంక చూడసాగేరు..
ఇప్పుడు అందరి కళ్ళకి ఆయన ధర్మోపదేశం చేస్తున్న కృష్ణుడి లాగా కనబడుతున్నారు.
"ఇక మిగిలింది మూడవ ముద్దు" ప్రారంభించారు మాస్టారు..
3 . భర్త ముద్దు :–
ఇందులో చాలా నిగూఢమైన సందేశం ఉంది.. భర్త ఎప్పుడూ భార్య పెదవులపైనే ముద్దుపెడతాడు. పెళ్ళైన తరువాత పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చిన తరువాత ఇది కూడా నీ పుట్టిల్లుతో సమానం.. మా అమ్మా నాన్నలు నీకూ అమ్మానాన్నలు తో సమానం. పొరపాటున వాళ్ళు ఏదైనా అంటే వాటిని పెద్దమనసుతో స్వీకరించు. ఆ విషయాలను ఇంకొకరి దగ్గర కానీ మీ ఇంట్లో కానీ ప్రస్తావించకు. అదే కాకుండా నీకు చుట్టుప్రక్కల వాళ్ళు ఎవరెవరి గురించో ఏదేదో చెబుతూ ఉంటారు. వాటిని అక్కడే విని అక్కడే వొదిలేసెయ్. ఆ మాటలను ఇంకెవరితోనూ అనకు. పదిమందితో మంచిగా మాట్లాడు.. తక్కువగా మాట్లాడటం మరీ మంచిది.. నువ్వు తక్కువగా మాట్లాడతానని నలుగురికీ తెలియడం మంచిదే. ఎందుకంటే నీకు చాడీలు చెప్పిన వాళ్ళు, నువ్వు ఇంకొకరిమీద చాడీలు చెబుతున్నానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎవరికైనా సహాయం చేసి ఇంకెవరిదగ్గరా అది గొప్పగా చెప్పుకోకు.. మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం అన్న విషయాలు ఎక్కడా ప్రస్తావించకు.. నా సంపాదనతో అందరినీ పోషించాలి. ఒక్కొక్క సారి మనిద్దరికీ తినడానికి తిండి మిగలకపోవచ్చు. ఆ విషయాలను ఎవ్వరితోనూ చెప్పకు. పదిమందికి తెలిస్తే చులకనైపోతాం. ఉన్నంతలో హాయిగా బ్రతుకుదాం. నీ బాధల్ని నాతో పంచుకో. అవి తగ్గించడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడూ కన్నీళ్ళతో ఎదురురాకు.. నీలో నాకు నచ్చేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే నీ మొహం. ఎన్ని జన్మలైనా మనిద్దరం భార్యాభర్తలుగానే జన్మిద్దాం. నీ కష్టాలలో ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. మన ఇంటిగుట్టును ఈ పెదవులు దాటి బయటికి పొక్కనీయకు.. అని భర్త పెట్టే అతి పవిత్రమైన ముద్దు అది..
ఇది నిన్ననే చెప్పేవాడిని. కానీ సమయం లేక చెప్పలేకపోయాను. కానీ ఒక్క పది నిముషాలు నేను సమయాన్ని కేటాయించుకొని ఉండుంటే ఈ రోజు నా మర్యాద ఇలా వీధిపాలు అయ్యేది కాదు..
నేను రిటైర్ ఐతే నాకొచ్చే డబ్బులతో ఈ విద్యాలయానికి ఎన్నో చేయాలనుకున్నాను.. ఇప్పుడు కూడా ఆ విషయంలో వెనుకడుగు వేయను.. తప్పకుండా అనుకున్నట్లుగానే చేస్తాను. కానీ మీరు ఇచ్చిన ఈ బహుమతిని మోయడానికి నా శరీరం చాలదేమో.. పర్వాలేదు నా ఆఖరి మజిలీ ఇలా ముగుస్తుందని ఆ విధాత రాసిపెట్టుంటే ఎవరేం చెయ్యగలరు.. ఇప్పటికైనా మీ సందేహాలు తీరిపోయాయా. ఇంకా మిగిలున్నాయా.. సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నాను..
నిలబడే ఉన్నారు మాస్టారు. ప్రిన్సిపాల్ వేదిక మీదకొచ్చి ఆయన పక్కనే నిల్చున్నారు. గ్లాసులోని మంచినీరు మాస్టారుకి అందించారు. గుక్కెడు తాగి గ్లాసుని టేబుల్ మీద పెట్టి అలాగే నిల్చున్నారు మాస్టారు. ప్రిన్సిపాల్ మాస్టారు చేయిమీద తన చేయి వేసారు. ఒక కన్నీటి చుక్క ప్రిన్సిపాల్ చేతి మీద పడింది.. మాస్టారి చెయ్యి హిమాలయ పర్వతాలకన్నా చల్లగా ఉంది.. మౌనంగా కుర్చీలో కూర్చుని తల వెనక్కి వాల్చేసారు మాస్టారు.
మాస్టారూ !! మాస్టారు !! మాస్టారు !! ఎంత పిలిచినా పలకడం లేదు.. బండి కట్టండి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి ప్రిన్సిపాల్ అరిచారు..
"ఆసుపత్రికి అధ్యాపక బృందం తీసుకెళుతుంది. ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చిన వారందరూ నేను చెప్పే మాటల్ని విని వెళ్ళండి" ప్రిన్సిపాల్ మాటలకు అందరూ సిగ్గుతో తలవంచుకొని నిల్చున్నారు.. మాస్టారు అలాగే వాలిపోయి ఉన్నారు..
"నాకు మీ అందరితో మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. కానీ ఒక్క విషయం చెప్పాలి.
ఈ రోజు ఈ స్కూల్ చరిత్రలో బ్లాక్ డే గా లిఖించబడుతోంది. ఈ రోజు స్కూల్ కి సెలవు ప్రకటిస్తున్నాను. ఈ రోజే కాదు ప్రతీ సంవత్సరం ఈ తారీఖున బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాను. దీనికి సంబంధించి అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని కూడా పంపుతున్నాను. అలాగే మాస్టారు లేని ఈ ఆలయంలో ఉండటానికి నా మనసు అంగీకరించడం లేదు. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.. ఇక వెళ్ళిరండి.. సెలవ్.
పక్కన తరగతి గదుల్లో కూర్చున్న పిల్లల గొంతులు వినబడుతున్నాయి.
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్లనిజము లెరిగిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ
అక్షరాలతో భావి భారత పౌరుల జీవితాలను సుగమ్యంలోనికి తీసుకెళ్లే ప్రతీ గురువునకు ఇది అంకితం
🙏🙏🏽🙏🏼
No comments:
Post a Comment