Friday, October 28, 2022

ఆత్మ - చైతన్యము

 ఆత్మ - చైతన్యము

ఆత్మ దేహమందు సూక్ష్మమునను
జూచి దేహమాత్మయందు
తేటపరచి యాత్మయందె
చూడ నతడె పో ఘనయోగి
విశ్వదాభిరామ వినుర వేమll
 
ఆత్మ :

దేహాత్మ, జీవాత్మ, సూత్రాత్మ, ప్రత్యగాత్మ, పరమాత్మ మొదలగు భ్రాంతి స్థితులలో అధిష్ఠానముగానున్నది ఒకే ఒక్క ఆత్మ. మొదట 'నేను'గా ఉండి, చివరకు అద్వయ బ్రహ్మమనే నిర్ణయముగా ఉండేది ఆత్మ.

ఆత్మ లక్షణము : 
మానవోపాధిలో అంతఃకరణ ప్రతిబింబమైన ఆత్మ ప్రకాశము అహం అహం అనే స్ఫురణ రూపముగా ఉండును. అహం స్ఫురణమే ఆత్మ లక్షణము.

ఆత్మ త్రివిధములు : 
ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అని త్రివిధములు  ముఖ్యము.

ఆత్మ స్వరూప పంచలక్షణములు : 
సత్‌, చిత్‌, ఆనందము, నిత్యత్వము, పరిపూర్ణము.

ఆత్మకు అర్థము : 
వేదితృ అనగా ఎరిగే ఎరుక. ఆత్మ అద్వయము గనుక, అది అందరి చేతను సాధనచే ఎరుగబడేదే. సాధకుని స్వానుభవములో అపరోక్షమై ఉన్నది. ఆత్మ విషయము కాదు. కనుక అహం బ్రహ్మ అనేది స్వానుభవ జ్ఞానమే. అది అపరోక్ష జ్ఞానమనబడును.

తెలుసుకొనవలసినది : 
1. స్వరూపము 2. ఉపాయము 3. పరమ పురుషార్థమైన మోక్షము.

ఆత్మ నిష్ఠ :

ఆత్మ నిష్ఠను సంపాదించి, దానికి చెరుపుగాని, తెంపుగాని  లేక, నిరతము ఆ నిష్ఠ కలిగి యుండుట.

కూటస్థాత్మ పర్యాయ నామములు : 
విశ్వాది జీవత్రయాధిష్ఠాన చైతన్యము, తురీయము, స్వయం శబ్దార్థము, సాక్షిమాత్రుడు, పారమార్థిక జీవుడు, త్వంపద లక్ష్యార్థుడు మొదలగునవి.

కూటస్థము :

సూక్ష్మతమము అయిన చేతనాయుక్త అణువు, అనగా చిదణువు. ఇది స్థావర జంగమాత్మకమై అంతటా ఉండును. ఆ చిదణువుతో ఉద్భాసితమయ్యే జ్యోతిర్మండలమే కూటస్థము. కూటస్థాత్మ అనగా తాను ఇంద్రియ ప్రాణ మనస్సులనెడి 24 తత్త్వముల కూటమితో కలసియుండి కూడా, వాటితో ప్రభావము చెందక, తానే వాటిని ప్రకాశింపజేయుచు, తాను మాత్రము అసంగముగా, ఎరుగ గలిగి స్వయం ప్రకాశ జ్ఞానమై  కదలక యుండుట.

ప్రత్యగాత్మ :

ప్రాణుల యొక్క హృదయములో చలించుచు అంతఃకరణ రూపములో వారి కర్మలన్నింటినీ అనుభవింపజేయు ప్రేరణ శక్తి కలదై, తాను మాత్రము సాక్షిభూతమై, అసంగమై యుండునది.

ఆత్మ కల్పితము : 
➣ ఆప్నోతి, ఆదత్తే, అత్తి అనే మూడు ధాతువులచేత ఆత్మ శబ్దమును సాధకులకు తాత్కాలిక లక్ష్యమును ఏర్పరచుటకుగాను అనృత జడ దుఃఖానుభవములకు వ్యతిరేకార్థముగా సత్‌ చిత్‌ ఆనందమనే లక్షణము కల్పించబడినది.
➣ ఆప్నోతి అనగా విషయములను కల్పించుకొనుట. ఆదత్తే అనగా ఆ విషయములను గ్రహించుచుండుట. అత్తి అనగా ఆ విషయములను మనస్సు ద్వారా, సాక్షీభూతముగా అనుభవించుచుండుట. విషయము లున్నను, లేకున్నను, ఎప్పుడూ ఉనికిగా ఉండి, ఆ ఉనికి అనుభూతముగా నున్న చైతన్యమై యుండునది. అట్టి కేవల ఉనికిని సదా సహజముగా అనుభవించుచుండు చైతన్యము యొక్క అనుభూతియే సాపేక్షముగా ఆనందము. ఇట్లు వివరించినను, అది సత్‌చిత్‌ ఆనందమనే ఒకే ఒక్క లక్షణము కలది. అదే ఆత్మ అనబడును.
➣ ఆప్నోతి, ఆదత్తే, అత్తి గానున్న అజ్ఞానమే ఆవరణ. ఆవరణ తొలగినంతనే సాక్షీరూప ఆత్మ స్వానుభవమగును. అయినను ఈ అనుభవము తటస్థ లక్షణమే యగును. తత్త్వమసి వాక్యార్ధ్థముచేత స్వరూప లక్షణాత్మ కావలెను.
ప్రజ్ఞ :

ఎరిగే ఎరుక, తెలుసుకునే తెలివి. దేహేంద్రియములనన్నిటిని నిండుకొని యున్నట్టి అద్భుత శక్తి. ప్రజ్ఞయే ప్రాణుడు, పరమాత్మయే ప్రాణుడై ప్రజ్ఞా స్వరూపుడై గోచరించుచున్నాడు.

ప్రాణుడు :

దేహేంద్రియములన్నిటియందు వ్యాపించియుండి, వాటిలో చైతన్యమును నింపి, అనగా వాటిని చైతన్యవంతము చేసి వాటి మూలకముగా నానా వ్యాపారములను చేయించుచున్న సూక్ష్మమమైన శక్తినే ప్రాణుడు అందురు. ఆ ప్రాణుడే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానమనెడి ఐదు ప్రాణ వ్యాపారములకు కారణమై ఉన్నాడు. ఆ అయిదు పేర్లతో పిలువబడుచున్నాడు. ప్రాణుడనగా ముఖ్య ప్రాణుడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, సూక్ష్ముడు, సర్వ వ్యాపకుడు, పిండాండమందు ప్రత్యగాత్మ. ఆ ప్రత్యగాత్మయే పరమాత్మ కూడా.

వ్యవహారమును బట్టి ఆత్మ నామములు:
1. వికారమగుటచేత నిర్వికారాత్మ శూన్యము.
2. ఉపాదానమగుట చేత ప్రకృతి
3. విక్షేప హేతువగుటచేత మాయ
4. బృహత్‌ రూపమగుట చేత బ్రహ్మ
5. విజ్ఞాన రూపమగుటచేత విజ్ఞానము
6. కళ్యాణగుణ శీలమగుట చేత శివము
7. పూర్ణ రూపమగుటచేత పురుషుడు.
8. నియామకుడగుచేత ఈశానుడు
9. శాస్త్ర ప్రకారము పండితులచే నిర్ణయమగుటచేత సత్యము.
10. సృష్టి క్రమమునుబట్టి, సాధనల దశలనుబట్టి ఈ సత్యమునకే ఆత్మ, ఋతము, పరము, బ్రహ్మము, సత్యము అని అనేక నామములను శిష్యులకు బోధించుట కొఱకు కల్పించిరి.
జీవోపాధులలో ప్రకటించబడిన చైతన్యము:
1.స్థావరములలో సంకుచిత చైతన్యము
2. ఉద్బిజములలో ముకుళిత చైతన్యము
3. అండజములలో, జరాయుజములలో వికసిత చైతన్యము
4. మానవులలో పూర్ణ వికసిత చైతన్యము
అందువలన మానవులు బుద్ధి జీవులై, బంధ మోక్షములు తెలిసి సాధనలచేత, ఉపాసనలచేత ఆత్మ జ్ఞాన సముపార్జనకు యోగ్యులుగా ఉన్నారు.

చేతన :
1. పశు పక్ష్యాదులలో నిమ్నచేతన ఉన్నది.
2. నరులలో బుద్ధి చేతన ఉన్నది.
3. దేవతలలో దివ్యచేతన ఉన్నది.
4. గురువులలో బ్రహ్మచేతన ఉన్నది.
5. సద్గురువులలో బుద్ధి చేతన, దివ్యచేతనలు ఏక కాలములో ఉండి, ఆ రెండింటి మధ్య సమన్వయమైన సహజత్వమున్నది.
  పశుపక్ష్యాదులు సుఖమును వేరుగా గుర్తించలేవు. దేవతలకు దుఃఖము తెలియదు. అందువలన పశుపక్ష్యాదులు గాని, దేవతలు గాని మోక్షమును కోరరు. బుద్ధిజీవులైన మానవులకు సుఖదుఃఖములు రెండూ తెలుసు. దుఃఖనివృత్తికిని, శాశ్వతానంద ప్రాప్తికి ప్రయత్నించవలెనని ఇచ్ఛా ప్రయత్నములు మానవులకే ఉండును. అందువలన మానవ జన్మ ఉత్కృష్టము.

చతురాత్మా :
1. వ్యష్టిలో : 1. నేను అనే అహంకారము 2. నాది అనే చిత్తము 3. అనుభవమునకు అవసరమైన జ్ఞానము. 4. అనుభవించే మనస్సు
2. సమష్టిలో : 1. ఇచ్చాశక్తి 2. దివ్యాహము లేక అనంతాహము. 3. మహత్తు అనే జ్ఞానశక్తి. 4. మాయ అనే క్రియాశక్తి
3. విశ్వములో: 1. జీవాత్మ 2. సూత్రాత్మ 3. ప్రత్యగాత్మ 4. పరమాత్మ

శ్లో దేహోదేవాలయోప్రాక్తో | జీవోదేవస్సనాతనః
త్యజేదజ్ఞాననైర్మల్యం | సో-హం భావేన పూజయేత్‌ ||

No comments:

Post a Comment