Tuesday, October 25, 2022

✍️...నేటి చిట్టికథ

 ✍️...నేటి చిట్టికథ

ఒకరోజు తెల్లవారుజామున నదిలో స్నానం చేసేందుకు బయలుదేరాడు ఒక బ్రాహ్మణుడు. 

ఊరుదాటి నాలుగడుగులు వేశాడో, లేదో అతనికొక గొంతు వినిపించింది-

"అయ్యా! బ్రాహ్మణోత్తమా! దేవుడిలాగా వచ్చావు. దాహంతో నా నోరు పిడచకట్టుకు పోతున్నది. కొంచె సాయం చెయ్యి. ఒక్కసారి నన్ను బయటికి వదులు. నీకు పుణ్యం ఉంటుంది" అని.

బ్రాహ్మణుడు ఆగి నలుదిక్కులా కలయజూశాడు. గ్రామస్తులు పెట్టిన బోనులో చిక్కుకొని ఉన్నది, ఒక పెద్ద పులి!

"పులీ, నిన్ను వదలగానే నువ్వు నా మీదికి దూకి నన్నే చంపి తినేస్తావు. అందుకని నన్ను క్షమించు, నీకు నేను ఎలాంటి సాయమూ చేయలేను" అన్నాడు బ్రాహ్మణుడు దానితో, చాలా మర్యాదగా.

"అయ్యో అయ్యో! అలా అనకు! ఒట్టేసుకొని చెబుతున్నాను- 
 నువ్వు నన్ను కాసేపు విడిస్తే నేను కాసిని నీళ్ళు త్రాగి, మళ్ళీ వచ్చి ఈ‌ బోనులోనే కూర్చుంటాను.పరమ పవిత్రుడైన ఒక బ్రాహ్మణుడిని- అందునా నాకు సాయం చేసినవాడిని- చంపటానికి నేనేమైనా అంత తెలివి తక్కువ దాన్నా? నా అంతరాత్మమీద ప్రమాణం చేసి చెబుతున్నాను- నేను నీకు ఎలాంటి అపకారమూ చెయ్యను. నన్ను కాపాడు- నీది జాలిగుండె. నీ కళ్ళముందే ఒక మూగప్రాణి నిష్కారణంగా దాహంతో చచ్చిపోతే నీ‌ ఆత్మ క్షోభించదా, నన్ను ఒక్కసారి బయటికి రానియ్యి చాలు- నీ‌ మేలు మరువను" అన్నది పులి.

ఆ సరికి బ్రాహ్మణుడు బాగా మెత్తబడ్డాడు. "మళ్ళీ బోనులోకి వెళ్ళి కూర్చుంటానని మాట ఇస్తున్నదిగదా, మరి ఇంకేమి నష్టం? పాపం నోరు లేని ప్రాణి! దాహంతో‌చచ్చిపోతున్నది. కాసింత సాయం చేస్తాను. కష్టాలలో ఉన్న ప్రాణులకు సాయం చెయ్యాలని శాస్త్రంకూడా చెబుతున్నది" అనుకొని, అతను వెళ్ళి, మెల్లగా బోను తలుపుకున్న గడియ తీశాడు.

అంతే! మరుక్షణం 'ధడేల్'మని తలుపును నెట్టుకొని బయటికి దూకింది పులి! ఒక్క ఉదుటున బ్రాహ్మణుడి మీద పడి, పంజాతో అతని గొంతును పట్టుకొని- "హహ్హహ్హ! నువ్వు చాలా మంచి బ్రాహ్మణుడివే కావొచ్చు; కానీ అత్యంత మూర్ఖుడివి! అందుకనే నా చేతికి చిక్కావు. ఇప్పుడు చక్కగా దైవప్రార్థన చేసుకో, చివరిసారి- ఎందుకంటే ఇంకాసేపట్లో నేను నిన్ను తినెయ్యబోతున్నాను. నిజంగా నాకు ఇప్పుడు దాహమే కాదు, విపరీతమైన ఆకలి కూడా వేస్తున్నది!" అన్నది పళ్ళు నూరుతూ.

బ్రాహ్మణుడికి ఆక్షణంలో తను చేసినది ఎంత మూర్ఖపు పనో అర్థమైపోయింది. కానీ మొండిగా అడిగాడు దాన్ని-"ఛీ! నువ్వూ ఒక పులివేనా, అసలు?!‌ ఇంత దిగజారిన పులిని నేను ఇంతవరకూ ఎప్పుడూ చూడలేదు. ఇచ్చిన మాట మీద నిలబడలేని నువ్వు పులివి ఎట్లా అవుతావు?" అని. 

పులి కొంచెం దిగి వచ్చినట్లు "మీ మనుషులందరూ మా జంతువుల్నీ, చెట్లనీ ఎంత హింసిస్తున్నారో లెక్కలేదు. అందుకని మీలాంటి వాళ్లని ఏం చేసినా పాపం లేదు. ఇది నా ఒక్కదాని అభిప్రాయమే అనుకునేవు- కానే కాదు- అందరూ ఇదే చెబుతారు. కావలిస్తే ఇటు వచ్చేవాళ్ళు ఎవరైనా ఐదుగురిని అడిగే అవకాశం ఇస్తాను నీకు. అడిగి చూడు- వాళ్ళలో ఏ ఒక్కరు నీ తరపున మాట్లాడినా నేను నిన్ను వదిలేస్తాను. అడుగు మరి" అన్నది కాలును కొంచెం వదులు చేస్తూ.

బ్రాహ్మణుడు అందుకు ఒప్పుకొని, దగ్గరలోనే ఉన్న మామిడిచెట్టును ఒకదాన్ని న్యాయం చెప్పమన్నాడు.
 అది "మీ మనుషులు నిజంగానే ఆశపోతులూ, నిర్దయులూనూ. పచ్చి కసుర్లని కూడా చూడకుండా నా కాయలన్నీ‌ కోసుకుంటారు వాళ్ళు. నా ఆకులు పీక్కుంటారు; నా బెరడుమీద చెత్త చెత్త అక్షరాలు చెక్కుతారు; నేను ముసలిదాన్నయ్యాక వచ్చి నా వ్రేళ్ళతో‌సహా మొత్తానీ ఎత్తుకెళ్ళి తగలబెడతారు. ఈ మనుషులకు అసలు కృతజ్ఞత అన్నదే లేదు. వాళ్లని ఏం చేసినా తప్పులేదు- వాళ్ల ప్రవర్తన అంత నీచం, నిజంగా!" అన్నది.

బ్రాహ్మణుడి ముఖం‌ వాడిపోయింది. ఈసారి అతను ఆ దారివెంట కుంటుకుంటూ‌ పోతున్న ఎద్దునొకదాన్ని పిలిచి న్యాయం చెప్పమన్నాడు. "మనుషులకి అసలు జాలి అన్నదే లేదు. పూర్తిగా స్వార్ధపరులు వాళ్ళు. నా జీవితం అంతా వాళ్ళు నాచేత ఊడిగం చేయించుకున్నారు. అలసిపోయి ఏ కొంచెం ఆగినా, నన్ను తిట్టారు; కొట్టారు; ఇంకా ఇంకా పని చేయించుకుంటూనే పోయారు. ఇప్పుడు, నేను ముసలిదాన్ని అయ్యాక, నా కాళ్లలో‌ బలం తగ్గి కుంటిదాన్నయ్యాక, నన్ను తన్ని తగలేశారు. మనుషుల గురించి చెప్పేందుకు నాదగ్గర ఒక్క మంచిమాటకూడా లేదు" అన్నదది.

బ్రాహ్మణుడు అటే వస్తున్న ఓ ముసలి ఆవును అడిగాడు ఆశగా. అదికూడా మనుషుల్ని బాగా తిట్టింది- 'వాళ్లని ఏం చేసినా తప్పు లేదు' అన్నది.

అంతలో ఒక గాడిద వచ్చిందక్కడికి, గెంతుకుంటూ. ఎందుకంటే దాని ముందరి కాళ్ళు రెండింటినీ కట్టేసి పెట్టాడు, దాని యజమాని! ఇక అది మనుషుల గురించి ఏం చెబుతుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. బ్రాహ్మణుడు ఇంకా తటపటాయిస్తూ‌ ఉండగానే పులి దాన్ని పిలిచి అడిగేసింది- మనుషులకోసం దాని దగ్గర ఒక్క మెప్పుకోలు కూడా లేదు- మనుషులు ఎంత క్రూరులో ఏకరువు పెట్టింది పులి బ్రాహ్మణుడిని చూసి "ఇప్పుడేమంటావు నువ్వు? మీ మనుషులు మా పట్ల ఎంత నిర్దయతో ప్రవర్తిస్తున్నారో అర్థమైంది గదా, ఇక నేను నిన్ను తినచ్చునా?" అన్నది.

అంతలోనే తడుముకుంటూ వెళ్తున్న ముసలి నక్క ఒకటి దాని కంట పడింది. "సరే, నేను నీకు ఇంకో అవకాశం కూడా ఇచ్చేస్తాను- ఐదో సాక్షి ఇటే వస్తున్నది. దాన్ని ఒక్కదాన్నీ అడిగేస్తే నీ పని అయిపోతుంది; అడిగెయ్, దాన్ని!" అన్నదది తొందరపెడుతూ.

ఆ సరికి బ్రాహ్మణుడి ఆశలన్నీ అడుగంటి పోయాయి. అయినా ఏం చేయగలడు, పాపం ఇదే చివరి అవకాశమాయె!

నక్కని దగ్గరికి రమ్మని అరిచింది పులి. నక్క వచ్చింది, అడుగులో అడుగు వేసుకుంటూ. ముసలితనం వల్ల దానికి కళ్ళు సరిగా కనిపించటం లేదు; అయినా అది చాలా తెలివైనది- పరిస్థితినంతా క్షణంలో ఆకళింపు చేసుకున్నది: మనిషి తరపున ఏ కొంచెం మాట్లాడినా పులికి కోపం వస్తుంది- అందుకని ఎవ్వరికీ అసలు నిజం చెప్పే అవకాశం లేనే లేదు-"

అందుకని అది అన్నది "మనుషుల క్రూరత్వాన్ని గురించి నేను కూడా చాలా చెబుతాను. అయితే అసలు ఇక్కడ ఏం జరిగిందో నన్ను ఓసారి అర్థం చేసుకోనివ్వండి ముందు- ముసలితనం కదా, నా మెదడు చురుకుగా ఉండటం లేదు. పైపెచ్చు నా చూపుకూడా సరిగా ఆనటం లేదు ఇప్పుడు. అందుకని దయచేసి ఇక్కడేం జరిగిందో చెప్పండి మెల్లగా- ఆపైన నేను అడిగే ప్రశ్నలు కొన్నిటికి ఓపికగా జవాబులివ్వండి" అని.

ముందుగా బ్రాహ్మణుడు తను స్నానానికి వెళ్తున్న సంగతీ, పులి పిలిస్తే బోను దగ్గరికి వెళ్లిన సంగతీ, దానిమీద జాలితో తను పులిని విడిపించిన సంగతీ, ఇప్పుడు అది తననే తినెయ్యాలని అనుకుంటున్న సంగతీ చెప్పాడు దానికి.

పులికి ఓపిక బాగా తగ్గిపోయింది. అది మొరటుగా పళ్ళు నూరుతూ "ఇంక చెప్పెయ్ అల్లుడూ! మనుషులంటే నీకు ఎంత అసహ్యమో త్వరగా చెప్పెయ్! నాకు చాలా ఆకలిగా ఉంది!" అంటూ నక్కని తొందర పెట్టింది.

నక్క తల గోక్కున్నది; పులివైపుకు తిరిగి "మామా! నీకు కోపం కలిగించే మాటలేమీ అనను గానీ, ముందు నాకో సంగతి చెప్పాలి నువ్వు. నీ అంత పెద్ద జంతువు ఇంత చిన్న బోనులో ఎలా పడుతుంది? నిజానికి నువ్వు ఆ బోనులో ఉన్నావన్న సంగతే మింగుడు పడటం లేదు నాకు. ఓసారి చూపించు, ఒక్క క్షణం చాలు- నువ్వు అందులోకి ఎట్లా దూరావు, ఆ గడియ ఎట్లా పడింది?" అన్నది.

పులికి ఓపిక నశించి, కోపం వచ్చేసింది. "నీ అంత ముసలి తొక్కునూ, ఇంత తెలివిలేని నక్కనూ నేను ఎన్నడూ చూడనేలేదు. నేను అందులో ఎలా దూరానో నీకెందుకు ఇప్పుడు? అయినా నీతో మాట్లాడితే మరింత ఆలస్యం అవుతుంది తప్ప, వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకని చూపిస్తాను- చూడు- బోను తలుపు తెరిచి ఉన్నదిగదా, ఇట్లాగ? నేను ఇట్లా వెళ్ళాను లోపలికి!" అని చటుక్కున బోనులోకి దూరింది. ఇంకా దాని మాటలు పూర్తవ్వకుండానే బోను తలుపు మూసుకుపోయింది; గడియపడిపోయింది! మాటలన్నీ గొంతుకు అడ్డం పడటంతో పులి కాస్తా బిత్తరపోయింది!

నక్క నవ్వుతూ బ్రాహ్మణుడివైపుకు తిరిగి-"ఇప్పుడు పో స్వామీ, నువ్వు పోయి నీ స్నానం కానివ్వు!" అన్నది. బ్రాహ్మణుడు నక్కకు ధన్యవాదాలు అర్పించుకుంటూ 'బ్రతుకు జీవుడా' అని పరుగుపెట్టాడు

🔹🔸🔹🔸🔹🔸

No comments:

Post a Comment