Wednesday, October 5, 2022

ప్రశ్నకు ప్రశ్నే సమాధానం

 🌷ప్రశ్నకు ప్రశ్నే సమాధానం🌷

* * *

ఈ మధ్య నన్ను ఒకరు అడిగారు-
నాకెందుకు ఈ కష్టాలు? అని.

"భరించేశక్తి ఉంది కాబట్టి..." అని బదులిచ్చాను.

ఇది నిజం.

అమృతానికి అందరూ ఎగబడ్డారు...
హాలాహలానికి అందరూ దూరం జరిగారు.
శివుడొక్కడే దానిని భరించాడు.

కష్టాల్ని, బాధల్ని భరించేవారు శివుడితో సమానం.
బలహీనులే సుఖాన్ని అభిలషిస్తారు.

నాకు తెలిసిన ఒకావిడ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది...

అది ఆవిడ 'పూర్వజన్మకర్మఫలం' అనేయడం 
ఘోరాపచారం.

అలాంటప్పుడు శివునిది కూడా కర్మఫలం అనాలి.
శివుణ్ణి పాపి అని ఎవడైనా అనగలడా?

కాబట్టి కష్టాలు, బాధలు అనుభవించేవాళ్లంతా-
ఇదంతా నా కర్మఫలం... అని భావించకుండా
నా కర్మల్ని తొలగించు...అని ప్రార్థించకుండా
నాకు ఇంకా 'భరించే శక్తి'ని ఇవ్వమని అడిగేవాడు నిజంగా మహనీయుడు.

అందుకే ఠాగూర్ ఇలా ప్రార్థిస్తారు-
నీ కరుణని విజయంలో మాత్రమే చూసే పిరికివాణ్ణి కానీకు. అపజయంలోనైనా నీ చేతిపట్టును తెలుసుకోగలిగేటట్టు వరమియ్యి నాకు.

'నా కష్టం మరొకడికి సుఖాన్ని ప్రసాదిస్తుంది'
అన్న ఎఱుకతో హాయిగా కష్టాల్ని భరిస్తారు మహనీయులు.

పసిబిడ్డడు రాత్రంతా తల్లిని నిద్రపోనీయకుండా ఏడుస్తూ ఉన్నా సరే తల్లి భరిస్తుంది.

భరించడం నా వల్ల కాదని,  ఏ తల్లీ శిశువును బావిలో పడేయదు.

మనకున్న కష్టాలన్నింటినీ 'ఇష్టమైన కష్టాలు'గా మార్చుకోవడమే ఆధ్యాత్మికత.

అంతేగానీ అన్నీ సుఖాలే ప్రాప్తించాలి...అనుకోవడం వెఱ్ఱితనం. 

'శాశ్వత సుఖం' ఉందనుకోవడం వట్టి భ్రమ.
శాశ్వత దుఃఖానికి సిద్ధం కండి....
అదే పరమసుఖం.
వాడు సాక్షాత్తు పరమశివుడే.

సాంబశివరావుగారు అడిగారు గురువుగారిని-
రాగద్వేషాల నుండి, మోహవ్యామోహాల నుండి
బయటపడడం ఎలా? అని.

ఎందుకు బయటపడాలి? ఉండండి లోపల్నే....
అన్నారు గురువుగారు.

* * *

ప్రపంచం వైవిధ్యభరితంగా ఉండాలంటే, 
అందరూ రకరకాలుగా ఉండాలి.
అందరూ ఒకే రకంగా ఉంటే, 
అంత దరిద్రంగా ఉంటుంది ప్రపంచం.

* * *

అరిషడ్వర్గాలు ఉత్త జడాలు.
స్వతఃగా వాటికి ఉనికి లేదు.
వాటికి ఊపిరి పోసేది నీవే.
నీ సంస్పర్శ వల్లనే వాటికి ఉనికి వస్తోంది...

భగవాన్! నా మసుసును జయించే ఉపాయం చెప్పండని ఒక భక్తురాలు కోరగా...
ఆ మనసుకు మీసాలు గెడ్డాలున్నాయేమో చూడమనండీ...అని అన్నారు భగవాను.
అనగా మనసుకు ఉనికి లేదని అర్థం. 

నీ నుంచి బయట పడడం ఎలా? అని పాపం అవి కూడా ప్రయత్నం చేస్తుంటాయి...

పిల్లి కాలు విరిగింది...
ఉదయం నిద్ర లేవగానే ఎవడి ముఖం చూశానో అని
అది కూడా బాధపడవచ్చు.

* * *

అరిషడ్వార్గాలను వాటి మానాన వాటిని వదిలేస్తే, 
అవి నిర్దోషులుగానే ఉంటాయి.

కానీ మనం రివర్స్ లో చెప్తాము-
కామ క్రోధాదుల వలన నేను ఇబ్బంది పడుతున్నాను...అని. 
నిజానికి మన వల్లనే వాటికి చెడ్డ పేరు వస్తోంది.

* * *

భగవాన్ కూరగాయలు తరుగుతుంటే, 
వ్రేలు తెగింది...తడిగుడ్డ చుట్టారు. 

ఒకడు ఆ కట్టు చూసి- 'అరె ఏమైంది?' అని అడిగాడు. 
'వ్రేలు మీద కత్తి పడింది' అని జవాబిచ్చాడు ఇంకొకడు.

భగవాన్ ఇలా సవరించారు-
వ్రేలు మీద కత్తి పడలేదు, కత్తి మీద వ్రేలు పడింది.
కత్తి జడం, వ్రేలు చైతన్యం. అన్నారు.
అనగా కత్తిని నిర్దోషిగా ప్రకటించారు. 

కామక్రోధాదుల విషయంలో కూడా అంతే.
అవి జడం, నీవు చైతన్యం. 

* * *

"నేను ఏదీ కాదు" అనైనా ఉండు.
"నేను కానిది ఏదీ లేదు" అనైనా ఉండు.
ఏ సమస్యా ఉండదు.
నేను ఈ సాంబశివరావును మాత్రమే అని ఉన్నప్పుడు మాత్రమే అన్ని సమస్యలూ తగులుకుంటాయి.

* * * 
ఏ సమస్యకూ ఎవరూ, ఏదీ కారణం కాదు.
తానే సమస్య; తనకు సమస్య కాదు.
అని తెలుసుకున్నప్పుడు ఏ సమస్యా ఉండదు.

* * *

స్వప్నప్రపంచానికి కేంద్రం నేనే అని తెలుసుకునేవరకు 
ఏ సమస్యా తెగదు, తెగినట్లు అనిపించినా సరే.

'స్వప్నప్రపంచానికి నేనే కేంద్రం' అని తెలుసుకున్నవాడే
నిజంగా మెలకువలో ఉన్నవాడు.
ఆ మెలకువకే జ్ఞానం, మోక్షం అని పేర్లు. 

* * *

ఇతరం తోస్తోందంటే నీవు కలలో ఉన్నట్లు.
ఇతరం తోయలేదంటే నీవు మెలకువలో ఉన్నట్లు.

నీవేంటో తెలిపే "ధర్మామీటర్" ఇదే.

* * *

'ఇదొక స్వప్నం' అని ఉన్నప్పుడు పాపం కూడా యజ్ఞమే అవుతుంది.

'ఇది నిజం' అని ఉన్నప్పుడు  యజ్ఞం కూడా పాపమే అxవుతుంది.

అద్దె ఇంట్లో ఉన్నవాడు, ఆ ఇంట్లో ఉన్నంతకాలం
'మా ఇల్లు' అనే అంటాడు.
తన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు 
ఇంటి యజమానితో కూడా అదే అంటాడు
'ఏమండీ! రేపు మా ఇంటికి రండి...' అని.

'మా ఇల్లు' అన్నాడని అతనితో యజమాని గొడవపడడు.
యెందుకంటే వ్యవహారం కోసమే అలా అంటారని
ఇరువురికీ తెలుసు.

అలాగే ఈ తనువు తనకు అద్దె ఇల్లు లాంటిది.
వ్యవహార నిమిత్తం నా శరీరం, నా సంసారం, నా ప్రపంచం, నా దైవం అంటాడు.

కానీ యజమాని భగవంతుడు.

యజమాని భగవంతుడు అనేది 
జ్ఞప్తి కలిగి ఉన్నవాడు - జ్ఞాని. 
మరచి ఉన్నవాడు - అజ్ఞాని.

అద్దె ఇల్లు పెచ్చులూడితే అద్దెకున్నవాడు ఏమీ చింతించడు.
ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఇల్లు చూసుకుంటాడు.

ఇక ఈ శరీరం నిలబడని వ్యాధి వచ్చింది...
వదిలేసి మరొక ఉపాధిని వెతుక్కుంటాడు.
అదే పునర్జన్మ.

No comments:

Post a Comment