Xx9. i. 2-4. 031022-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
అక్కడే ఆగిపోవద్దు!
➖➖➖✍️
రామకృష్ణ పరమహంస చెప్పిన కథల్లో ‘ఇంకొంచెం ముందుకు వెళ్ళు’ అనేది ఒకటి.
ఒక పేదవాడు కట్టెలు కొట్టి అమ్మి జీవిస్తూండేవాడు.
కొన్నాళ్లకు ఆ ప్రాంతంలో కట్టెలు దొరకని పరిస్థితి నెలకొంది.
ఏం చేయాలో తెలియక దీనంగా కూర్చున్నాడు. ఆ దారంట వెళుతున్న ఓ బాటసారి అతడితో ‘ఇంకొంచెం ముందుకు వెళ్ళు’ అని ఒక్క మాట చెప్పి తనదారిన తాను వెళ్ళిపోయాడు.
ఆ మాటల్ని స్ఫూర్తిగా చేసుకున్న పేదవాడు ముందుకెళ్ళాడు.
అక్కడ మంచిగంధపు చెట్లు కనిపించాయి.
వాటిని కొట్టి అమ్మి మంచి ధనవంతుడయ్యాడు.
ఆ తరవాత అతడు అక్కడితో సంతృప్తి పడి ఆగిపోలేదు.
గతంలో బాటసారి చెప్పిన మాటనే మననం చేసుకుంటూ అంతకంతకూ ముందుకు, ఇంకా మున్ముందుకు వెళ్ళాడు.
బంగారపు గనులు, ఆపై వజ్రాల గనులు తారసపడ్డాయి.
వాటిని సేకరించి, అమ్మి ఐశ్వర్యవంతుడయ్యాడు.
ఆధునిక కాలమైనా ఆదిమానవుల కాలమైనా అందరికీ స్ఫూర్తినిచ్చేది, ముందుకు నడిపేది- ‘అక్కడే ఆగిపోవద్దు’ అనే ఒకే ఒక మాట.
‘మరికొంత ప్రయత్నం చెయ్యాలని ఉద్బోధించే స్ఫూర్తి మంత్రమది!
కుందేలు, తాబేలు కథలో పందెం మొదలైన కొంతసేపటికి- కుందేలు వెనుదిరిగి చూసింది. తాబేలు బాగా వెనకబడిపోయి దూరంగా ఉండటం గమనించింది.
అది తన దగ్గరకు రావడానికి చాలా సమయం పడుతుందని ఒక చెట్టుకింద విశ్రమించింది.
తన వేగానికి తానే గర్వపడుతూ ఏమరుపాటుగా ఉంది.
తాబేలు మాత్రం గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా గమ్యం చేరడమే ధ్యేయంగా ముందుకు సాగింది.
గెలుపొందింది…!
విద్యార్థులు కాని, మరే ఇతర రంగాల్లో రాణించే వారు గాని ఎన్ని విషయాలు తెలిసినా ఆగిపోకూడదు.
ఎప్పుడు, ఎక్కడ సంతృప్తి చెందితే అప్పుడు అక్కడితో ప్రగతి ఆగిపోతుంది.
అతడి స్థానాన్ని మరొకరు ఆక్రమించి ఇతణ్ని మించిపోవచ్చు.
అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తున్న సమయంలో దేవదానవులకు ఆశలు కల్పిస్తూ ఎన్నో రకాల వస్తువులు బయటపడ్డాయి.
దేవతలు గాని, రాక్షసులు గాని వాటిని చూసి ఏ క్షణంలోనూ మురిసిపోయి సంతృప్తి పడిపోలేదు.
అమృతోదయమే అంతిమ లక్ష్యంగా చేసుకుని యత్నం కొనసాగించారు.
సీతాన్వేషణకు బయలుదేరిన హనుమంతుడు ఎవరూ దాటలేని సముద్రాన్ని దాటాడు.
ఎవరికీ లొంగని లంకిణిని జయించాడు.
ఇంకా ఎవరూ చెయ్యలేని అనేక గొప్ప కార్యాలు చేశాడు.
అయినప్పటికీ ఏ స్థితిలోనూ తాను పొందిన విజయానికి సంతృప్తి చెందలేదు.
ఆయన అంతిమ లక్ష్యం సీతమ్మవారి జాడ తెలుసుకోవడమే.
ఆ పని జరిగేవరకు ఎక్కడా సంతృప్తి చెంది ఆగిపోలేదు.
మహా నిర్వాణ తంత్రం అనే గ్రంథం ‘గమ్యప్రాప్తి పర్యంతం సాధన చేస్తూండవలసిందే’ అని చెబుతోంది.
‘ప్రతివారూ ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవాలి.
దాన్ని చేరడానికి తగిన ప్రణాళిక రచించుకోవాలి. మధ్యలో ఏర్పడే చిన్నచిన్న ఆటంకాలకు బెదిరిపోకుండా, వచ్చే చిన్నచిన్న ఫలితాలకు పొంగిపోకుండా సమస్థితిలో ఉండాలి’ అనేది ఈ వాక్యంలోని అంతరార్థం.
వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇతర వాఙ్మయం ఏదైనా చెప్పేమాట ఒక్కటే ‘సాగితేనే ప్రగతి- ఆగితే అధోగతి’!
రంగం-రాణింపు, స్థితి-స్థాయి, వయసు-హోదా, కాలం-పరిస్థితులు... ఏవైనా సరే, ఎక్కడా ఆగిపోవద్దు. గమ్యం చేరే వరకు సాగిపోతూనే ఉండాలి!✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment