Monday, October 17, 2022

ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ కూర్చోవాలో, ఎలా కోర్చోవాలో, ఏం చెయ్యాలో ఆ పద్దతి అంతా వివరంగా విపులంగా అతి చిన్న విషయం నుండి అతి పెద్ద విషయం వరకూ చెప్పబడింది భగవద్గీతలో.

ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ కూర్చోవాలో, ఎలా కోర్చోవాలో, ఏం చెయ్యాలో ఆ పద్దతి అంతా వివరంగా విపులంగా అతి చిన్న విషయం నుండి అతి పెద్ద విషయం వరకూ చెప్పబడింది భగవద్గీతలో.

"శుచౌదేశే" అంటే పరిశుద్ధమైన ప్రదేశంలో కూర్చోవాలి. ధ్యానం చేయడం కోసం ఎక్కడికో వెళ్లనక్కర లేదు. హిమాలయాలకో, అరణ్యాలకో వెళ్లనక్కరలేదు. మన ఇంట్లోనే శుభ్రమైన ప్రదేశం ఉంటే చాలు. కాకపోతే ఎటువంటి డిస్ట్రబెన్స్ ఉండకూడదు.

ఈ రోజుల్లో మానవుడి ఏకాగ్రతను దెబ్బతీసే ఏకైక సాధనం స్మార్ట్ ఫోన్. దానిని ఆఫ్ చేస్తే సగం ప్రశాంతత లభిస్తుంది.

పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే ధ్యానం కుదరదు. చాలా మంది ప్రదేశం ఎక్కడైతే నేమి మనస్సు పరిశుభ్రంగా ఉంటే చాలు కదా అని అంటుంటారు. అది తప్పు. కూర్చునే ప్రదేశము, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ధ్యానం ఏకాగ్రంగా సాగుతుంది. చుట్టు పరిశుభ్రంగా ఉన్నపుడే పరిశుద్ధమైన భావాలు కలుగుతాయి. చుట్టు ఉన్న మలినాలు, దుర్వాసనలు మనసును కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనస్సు వాక్కు శరీరము నిర్మలంగా ఉండాలంటే తాను ఉన్న ప్రదేశము కూడా పరిశుధ్ధంగా ఉండాలి.

ఆసనము అంటే కూర్చునే స్థలం స్థిరంగా ఉండాలి. హెచ్చుతగ్గులు ఉండకూడదు. ఎక్కువ ఎత్తు గానీ, మరీ తగ్గుగా గానీ ఉండకూడదు.  

అంత ఎత్తుగానీ, మరీ అంత తగ్గుది కానీ కాకుండా ఉంటే ఆసనం ఏర్పాటు చేసుకున్న తరువాత దాని మీద ఏమి వెయ్యాలి అంటే ముందు దర్భలతో చేసిన చాప వేయాలి. దాని మీద జింక చర్మం పరవాలి. (ప్రస్తుత కాలంలో అది నిషిద్ధం) దాని మీద మెత్తని గుడ్డ పరవాలి. ఇది కేవలం సౌకర్యంగా ఇబ్బందిలేకుండా కూర్చోడానికి అనువుగా ఉండటానికి మాత్రమేగానీ, సుఖానికి కాదు. అంతే కాకుండా మనం ధ్యానం చేసేటప్పుడు మనలో నుండి వెలువడే ధ్యానతరంగాలు భూమిలోకి ఆకర్షింపబడకుండా ఉండాలి. అలా అయితే మనం చేస్తున్న ధ్యానం వృధా అవుతుంది. కాబట్టి ఈ దర్భాసనము, జింక చర్మము, వస్త్రము మనకు ఇన్సులేషన్గా అంటే ఒక తొడుగుగా ఉపయోగపడతాయి. అటువంటి ఆసనము స్థిరంగా ఉండాలి. ఎందుకంటే, కూర్చున్న ఆసనం అటు,ఇటుగా ఉంటే శరీరం కూడా కదులుతుంది. మనసు ధ్యాస దాని మీదనే ఉంటుంది కానీ ధ్యానం మీద ఉండదు. కాబట్టి మనం కూర్చునే ఆసనం అటు ఇటు ఊగకుండా స్థిరంగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

స్థిరమైన ఆసనంలో పద్మాసనము కానీ సుఖాసనంలో కానీ వేసుకొని కూర్చోవాలి. ధ్యాన సమయంలో ఇబ్బందికరం కాని ఏ ఆసనమైనా వేయవచ్చు కాకపోతే స్థిరంగా సుఖంగా ఉండాలి.

దర్భాసనం, జింక చర్మం అనేవి ఆ రోజులలో దొరుకుతాయి కాబట్టి చెప్పారు. ఈ రోజుల్లో జింక చర్మాలు, దర్భాసనాలు దొరకవు. పైగా జింక చర్మాలు నిషిద్ధం. కాబట్టి వాటి కోసం ప్రయత్నించకండి. 

కాని జింక చర్మాలు, దర్భాసనాలు దొరకలేదని ధ్యానం చేయడం మానకూడదు. మనకు దొరికిన వాటితో మనకు అనుకూలమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద సుఖాసనంలో కూర్చోవాలి. ఈ రోజులను బట్టి చెప్పాలంటే బజారులో దొరికే పీట,మ్యాట్ ఒకటి కొనుక్కొని, దాని మీద మెత్తటి షాల్ లాంటిది పరిచి, దాని మీద ఒక శుభ్రమైన తెల్లటి తుండు గుడ్డ వేసుకుంటే చాలు. ధ్యానం చేయడానికి ఆసనం ఏర్పాటు అయినట్టే. 

ధ్యానంలో ఏకాగ్రత సాధించాలంటే కదలకుండా స్థిరమైన ఆసనం మీద సుఖంగా కూర్చున్న తరువాత మనసును, ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోవాలి. ఒక చోట స్థిరంగా కూర్చుంటే చేతులు, కాళ్లు, కళ్లు మన స్వాధీనంలో ఉంటాయి. కాని ఏ చిన్ని శబ్దం వినబడ్డా అటు ఇటు తిరగడం, కళ్లు తెరిచి అటువైపు చూడటం, శరీరం మీద ఏదైనా పాకితే చెయ్యితో తాకడం ఇటువంటి పనులు చేస్తుంటాము. ఆ పనులను కూడా సాధ్యమైనంత వరకు చేయకూడదు. దానినే ఇంద్రియ నిగ్రహం అంటారు. ఏకాంత ప్రదేశంలో, శుభ్రమైన ప్రదేశంలో కూర్చుంటే ఇటువంటివి జరగవు.

ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉన్నా, మనసు మాత్రం సాధారణంగా అటు ఇటు పరుగెడుతుంటుంది. దానిని కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. అటు ఇటు పోయినా తిరిగి లాక్కొచ్చి మనస్వాధీనంలో పెట్టుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే ధ్యానం చేసే ఆ కాసేపు మీ కోసం మీరు జీవించండి. బయట విషయాలను మనసులోకి రానీయవద్దు. పనికిమాలిన విషయాలు గురించి ఆలోచించకుండా మనసును కట్టడి చేయాలి.
ఎందుకు కట్టడి చేయాలి..? ధ్యానం చేస్తున్నామని మనసుకు తెలియదా అని మనం అనుకోవచ్చు. మనసు యొక్క స్వభావం అటు ఇటు చంచలంగా పరుగెత్తడం. అందుకే మనోవేగము అని అన్నారు. ఆ వేగవంతమైన మనసుయొక్క స్వభావాన్ని మనం కాసేపు కట్టడి చేయాలి కానీ మనసే తనంతట తాను నిశ్చలంగా ఉండాలనుకోవడం మన పొరపాటు. కట్టడి చేయడం అంటే పూర్తిగా ఏపనీ చేయకుండాఉండటం కాదు. మనసును దాని స్వభావాన్ని బట్టి అన్ని విషయాల మీదికి పోకుండా, ఒకే విషయం అంటే దైవం మీద నిలపాలి. దానినే ఏకాగ్రత అని అంటారు.

మనసును ఏకాగ్ర పరచి, దైవం మీదనే నిలపాలి. అప్పుడు మనలో అఖండమైన శక్తి పుడుతుంది. 

ఎలాగంటే సూర్యకిరణం మామూలుగానే ఉంటుంది. దానిని భూతద్దంలో నుండి ప్రసరింపచేస్తే అమితమైన వేడి పుట్టి ఏ పదార్థాన్నైనా కాలుస్తుంది. అలాగే ఏకాగ్రమైన మనస్సు విపరీతమైన శక్తిని సంతరించుకుంటుంది. ఆ వేడికి మనలో ఉన్న అజ్ఞానం మాడిపోతుంది. మనం సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. అందుకే మన పెద్దవాళ్లు విద్యార్థులను.,
"మనసు పెట్టి చదవరా అదే అర్థం అవుతుంది" అని అంటూ ఉంటారు. మనసు పెట్టి చదవడం అంటే ఏకాగ్రతతో చదవడం. ఈ ప్రకారంగా సుఖమైన ఆసనంలో కూర్చుని, ఇంద్రియములను మనసును నిగ్రహించి ఏకాగం చేస్తే, హృదయం నిర్మలంగా ఉంటుంది. ధ్యానం కుదురుతుంది.

🙏 *కృష్ణం వందే జగద్గురూమ్* 🙏

No comments:

Post a Comment