అసలైన ఆభరణం
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈
💫 ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి.
💫 నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.
💫 చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.
💫 మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. ‘వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణం’ అన్నాడు భర్తృహరి.
💫 సంభాషణం - మిత భాషణం, హిత భాషణం, స్మిత భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం అయినప్పుడు - అంతకన్నా భూషణం మరొకటి లేదు.
💫 ‘మితంగా, హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ.
💫 ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది.
✅ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి.
💫 ఎదుటి వారిని ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం.
💫 రాముడు స్మిత పూర్వ భాషి - మాట కన్నా ముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది.
💫 సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి.
💫 ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.
💫 ‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’ అన్నారు స్వామి వివేకానంద.
💫 ఎవరైతే తమ మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.
💫 ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణ పూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ.
💫 ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ.
💫 మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.
💫 మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి.
💫 మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం.
మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్నీ తయారు చేస్తుంది.
💫 నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. అలాంటివారికి శత్రువులే ఉండరు.
💫 మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయనూగలవు. సరైన మాటతీరు - చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.
💫 మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే పాయసంలో జీడిపప్పులా మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.
💫 ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.
💫 మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పారనేదానిక న్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
💫 భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది!
సేకరణ:
🌈💫🌈💫🌈💫🌈💫🌈💫🌈💫
No comments:
Post a Comment