X3.x. 1-2. 041022-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సారంగ పక్షులు*
➖➖➖✍️
(మహాభారతం లోని ఈ కధను మీరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే తప్పక ఇది చదవండి!)
*పురాణాల్లో కొన్ని కధల్లో కొన్ని పక్షులు ,జంతువులు మనుషుల్లాగే మాట్లాడుతుంటాయి. అంతే కాదు కొన్ని సార్లు మేలుచేసే సూచనలు ఇస్తాయి. మరికొన్ని సార్లు వేదాంతపరమైన భాషణలు కూడా చేస్తుంటాయి. పురాణాల్లో ఉన్న ఈ అద్భుత కధలు వింటానికి ఉత్సాహంగా కూడా ఉంటాయి. పక్షులు, జంతువులు మాట్లాడే కధలు చిన్న పిల్లలకు చాలా ఇష్టం. కానీ పురాణాలు మాత్రం పెద్దవారు చదవటానికి నిర్దేశించపడ్డాయి, అవి వారికే అర్ధమవుతాయి! అలా మాట్లాడే పక్షులకు, జంతువులకు ఒక నేపధ్యం, గత చరిత్ర ఉంటాయి. వాటికి మాట్లాడే వరం ఎలా వచ్చిందో కూడా పురాణాలే చెబుతాయి. సాధారణంగా అవి పూర్వజన్మలో మనుష్య జన్మ పొంది ఉండొచ్చు. ఉదాహరణకు ఒక జింక పూర్వ జన్మలో ఋషి అయి ఉండొచ్చు, అలానే ఒక నక్క పూర్వ జన్మలో రాజు అయి ఉండొచ్చు. శాపవశాత్తు, కర్మఫలం వలన వాటికి ఈ జన్మలు లభించి ఉండొచ్చు. అటువంటి సందర్భాలలో జింక రూపంలో ఉన్న ఋషి, ఋషిలాగే మాట్లాడుతాడు. నక్క రూపంలో ఉన్న రాజు, రాజులాగే తెలివితేటలు కలిగి ఉంటాడు. అలాంటి కధలు నీతిదాయకంగా, జీవిత సత్యాలను చెబుతాయి. ఖాండవప్రస్థం ఎన్నో ఔషధాలు, ముళ్ళు, మిట్టపల్లాలు, భయంకరమైన జంతువులున్న ఒక పెద్ద అడవి. కృష్ణార్జునులు కలసి దాన్ని దహనం చేసి వారి స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అక్కడ ఒక సుందరమైన నగరాన్ని నిర్మించాలని వారి ఆలోచన. ఆ సమయంలో ఆ అడవిలో ఒక సారంగ పక్షి తన పరివారంతో నివసిస్తుంది. వాటిల్లో ఒక మగ సారంగ పక్షి ఆనందంగా మరొక ఆడపక్షితో కలసి అడవంతా విహరిస్తుంది. ఆ మగ పక్షి భార్యాపిల్లలను వదిలేసి తిరుగుతుంది. పాపం ఆ తల్లిపక్షే పిల్లల మంచి చెడులు చూస్తుంది. అడవికి నిప్పు అంటుకునే వేళ, ఆ అగ్నికీలలు అడవంతా వ్యాపిస్తుంటే, తల్లిపక్షి పిల్లల క్షేమాన్ని గురించి బాధపడుతుంది. ఆ తల్లిపక్షి పిల్లలతో ఇలా అంటుంది, “అడవంతా నిప్పు అంటుకుంది. మీ తండ్రి మీ గురించి పట్టించుకోకుండా ఎక్కడ తిరుగుతున్నాడో కూడా తెలియదు. నేనొక్క దాన్ని మిమ్మల్ని కాపాడలేను! అడవిలో జంతువులన్నీ కకావికలై క్షేమమైన ప్రదేశాలకు పోవటానికి పరుగిడుతున్నాయి. ఈ పరిస్థితులలో నేను ఒక్కదాన్నే మిమ్మల్ని తీసుకొని ఎగిరి మరో చోటికి వెళ్ళలేను.” బాధపడుతున్న తల్లిని చూసి పిల్లలు ఇలా అన్నాయి, “అమ్మా! మా గురించి నీవు బాధపడవద్దు. మా కర్మకు మమ్మల్ని వదిలెయ్యి! కృష్ణార్జునులు దహనం చేస్తున్న ఈ అడవిలో మేము ఒక వేళ చనిపోతే, మరు జన్మలో మాకు ఉత్తమమైన జన్మ లభించటానికి అవకాశం ఉంది. కానీ నీవు చనిపోతే మన జాతి నశిస్తుంది. అందుచేత మమ్మల్ని వదిలేసి నీవు క్షేమమైన చోటికి ఎగిరిపో! అక్కడ మరొక మగపక్షిని జత చేసుకొని ఆనందంగా ఉండు. కాలగతిలో నీకు మళ్ళీ సంతానం కలగొచ్చు, క్రమేణా మమ్మల్ని మరచిపోవచ్చు కూడా! మన జాతికి ఏది మేలో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకో!” పిల్లలు అన్ని విధాలా నచ్చచెప్పినప్పటికీ తల్లికి వాటిని వదలి వెళ్ళాలనిపించలేదు. ”మీ తోటే నేను కూడా ఈ మంటల్లోనే మసి ఐపోతాను” అని అంది తల్లిపక్షి . ఈ పక్షుల గత చరిత్రను తెలుసుకుందాం!
**************
పూర్వం మందాలపుడు అనే ఋషి బ్రహ్మచర్య దీక్షను బూని తపస్సు చేసి ఉత్తమలోకాలకు వెళ్ళాలనుకుంటే…. స్వర్గ ద్వారం వద్ద ఉన్న రక్షకుడు ఋషితో, ”సంతానం లేని వారికి స్వర్గ ప్రవేశం లేదు” అని చెప్పి వెనక్కి తిప్పి పంపాడు.
అప్పుడు అతను ‘సారంగ’ పక్షిగా మారి ‘జరిట’ అనే స్త్రీ పక్షితో కలసి సంసారం చేస్తాడు! జరిట నాలుగు గుడ్లను పెడుతుంది. కొద్దికాలం తర్వాత సారంగ (మగపక్షి) కట్టుకున్న భార్యను వదిలేసి, ‘లపిట’ అనే మరో స్త్రీ పక్షితో నివసిస్తున్నాడు!
జరిట తన నాలుగు గుడ్లను పొదిగి వాటికి ఒక రూపాన్ని ఇచ్చింది. నిజానికి ఆ పక్షి పిల్లలు ఒక ఋషి సంతానం కావటం వల్ల వాటికి ఆ ఉన్నతమైన భావాలు వచ్చి, తల్లితో అలా చెప్పాయి!
ఆ తల్లిపక్షి పిల్లలతో మళ్ళీ ఇలాగా అంది, ”ఆ చెట్టు కింద ఒక ఎలుక కన్నం ఉంది. అక్కడ మిమ్మల్ని ఉంచుతాను. ఆ కన్నాన్ని నేను మట్టితో పూడుస్తాను. ఆ కన్నంలో ఉంటే మిమ్మల్ని అగ్ని దహించలేదు! అగ్ని చల్లారగానే మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను!”
అందుకు పిల్లలు అంగీకరించలేదు. వాళ్ళు తల్లితో ఇలా అన్నారు, ”కన్నంలో ఉన్న ఎలుక మమ్మల్ని తినేస్తుంది, దాని కన్నా మంటల్లో మసి కావటమే మేలు!”
పిల్లలకు ఉన్న భయాన్ని గ్రహించిన తల్లి ఇలాగా అంది, ”ఆ కన్నంలో ఉన్న ఎలుకను ఒక గద్ద తినటం నేను చూసాను. అందువల్ల మీకేమీ భయం లేదు”.
“కన్నంలో ఇంకా కొన్ని ఎలుకలు ఉండొచ్చు,కాబట్టి మేము ఆ కన్నంలో ఉండలేము. నీవు క్షేమమైన చోటికి వెళ్ళు! మా కోసం నీ జీవితాన్ని త్యాగం చేయొద్దు. నీవు మమ్మల్ని పెంచి పెద్ద చేసావు, కానీ మేము నీకేమీ చేయలేకపోయాం! నీ కడుపున పుట్టి నీకే దుఃఖాన్ని కలిగిస్తున్నాం!”అని పిల్ల పక్షులు బదులు చెప్పాయి.
అడవంతటిని దహించిన అగ్ని ఆశ్చర్యంగా ఆ పక్షి పిల్లలను మాత్రం దహించలేదు. మంటలు ఆరిన తర్వాత తల్లి పక్షి వచ్చిఆశ్చర్యంగా,ఆనందంగా తన పిల్లలను ముద్దాడింది.
మంటలు రేగుతున్నప్పుడు మగ సారంగ పక్షి తన పిల్లల కోసం పరితపించింది. అదే భయాన్ని తన కొత్త భార్య అయిన లపిటకు చెప్పింది. అప్పుడు లపిట, ”నీ ఉద్దేశ్యం నాకు తెలుసు, నీకు నా మీద మోజు తీరింది. నీవు మళ్ళీ నీ మొదటి భార్య జరిట దగ్గరికి వెళ్లాలని చూస్తున్నావు. నీ మాయలన్నీ నాకు తెలుసు. నీవు మొదటి భార్య దగ్గరికే వెళ్ళు” అని చీదరించుకుంది లపిట.
సారంగ పక్షి(ఋషి మందాలపుడు) ఇలా అంది, ”నీవు ఊహించింది అంతా అబద్ధం. సంతానం కోసం నేను ఈ జన్మ ఎత్తాను. సంతానం కలిగింది. సంతానం మీద ప్రేమ ఉండటం సహజం! నా సంతానాన్ని చూసి మళ్ళీ నీ దగ్గరకే వస్తాను!” అని అలా నచ్చచెప్పి మొదటి భార్య ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళింది.
వచ్చిన భర్తను జరిట పట్టించుకోలేదు. ఇక్కడికి ఎందుకొచ్చావని అడిగింది కూడా!
అప్పుడు ఆ సారంగ పక్షి,”నాకు కలిగిన సంతానాన్ని చూడాలని వచ్చాను,వాళ్ళు బాగున్నారా?” అని అడిగింది.
అప్పుడు జరిట దు:ఖంతో ,”నీవు పిల్లలను గురించి ఎప్పుడు పట్టించుకున్నావు? దాని దగ్గరికే వెళ్ళు!” అంది.
సారంగ పక్షి(మందాలపుడు) ఇలా అనుకుంటాడు–స్త్రీకి సంతానం కలిగిన తర్వాత భర్తను గురించి పెద్దగా పట్టించుకోదు. లోకపు తీరే ఇది. వశిష్టుడి అంతవాడికే ఈ బాధలు తప్పలేదు. పతివ్రత అయిన అరుంధతి కూడా సంతానాన్ని పొందిన తర్వాత భర్త అయిన వసిష్టుడిని పెద్దగా పట్టించుకోలేదు!
సృష్టిలోని సకల జీవరాసుల ప్రవృత్తి ఒకే రకంగా ఉంటుందనే సందేశాన్ని ఈ కధ మనకు ఇస్తుంది!✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment