Monday, October 17, 2022

జీవితాన్ని ఎలా గడపాలి?

 జీవితాన్ని ఎలా గడపాలి?

🍁🍁🍁🍁

ఈ ప్రశ్నకు ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. ‘‘మీరింక ఒక్క గంట మాత్రమే బతుకుశతారని తెలిస్తే ఏం చేస్తారో ఆ స్థితిలో జీవించాలి’’ అని చెప్పారాయన. 

ఇంకో గంటలో మరణిస్తా అని తెలియగానే బాహ్యమైన వ్యవహారాలు వెంటనే చక్కబెడతారు. వీలునామా రాయడం, కుటుంబ సభ్యులను, మిత్రులను పిలిచి వాళ్లకేదయినా నష్టం కలిగించి ఉంటే క్షమించాలని అడగడం, వాళ్లు మీకేదయినా హాని చేసి ఉంటే వాళ్లను క్షమించడంతో పాటు మనసుకు సంబంధించిన కోరికలను, ప్రపంచాన్ని వదిలేస్తారు. 

ఒక్క గంట కోసం ఇదంతా చేయగలిగినప్పుడు.. మీరు ఉన్నంతకాలం ఎందుకు ఆ పని చేయలేర’’ని కృష్ణమూర్తి ప్రశ్నిస్తారు. ఇది మహోన్నత స్థితి.

 శ్రీరామకృష్ణులు పొందిన నిర్వికల్ప సమాధి అయినా, రమణ మహర్షి పొందిన ‘సహజస్థితి’ అయినా ఈ చట్రంలోనివే.

నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః
శారీరం కేవలం కర్మ కుర్వనాప్నోతి కిల్బిషమ్‌

అంతఃకరణాన్ని, ఇంద్రియాలను జయించినవాడు,  సమస్త భోగ సామగ్రిని వదిలిపెట్టినవాడు, ఆశారహితుడైన సాంఖ్యయోగి.. శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవిస్తాడని గీతాచార్యుడు చెప్పాడు. 

మన పౌరాణిక, ఇతిహాస గాథల్లో భోగాలను తృణప్రాయంగా త్యజించిన చక్రవర్తులు కన్పిస్తారు. రుషభుడు కేవలానందావస్థలో సర్వం త్యజించి వెళ్లిపోయాడు. అలాగే ఎందరో మహారాజులు అన్నింటినీ కాలితో తన్నేసి అంతర్ముఖులై జ్ఞానులయ్యారు.

 ఇక రమణ మహర్షి వంటి వాళ్లు రోగాన్ని కూడా లక్ష్యపెట్టకుండా అదే స్థితిలో జీవించారు. ఇంకొందరు సిద్ధ పురుషులు వాళ్లకున్న యోగత్వాన్ని కూడా గమనించలేదు. అదొక కర్మబంధ విముక్తి. అయితే ఇక అందరూ సన్యాసం పుచ్చుకోవాల్సిందేనా? అంటే.. ఎంతమాత్రం కాదు. జిడ్డు కృష్ణమూర్తి చెప్పింది అదే.

 నిత్యజీవనంలో ఆ స్థితిని పొంది దానిలో నిలిచి ఉండడం. అపుడు ఏమీ మనల్ని అంటుకోవు. అదే ముక్త జీవనం.


ఎవరైతే ప్రకృతి స్వభావంలో ఇరుక్కుని అహంకారం అనేపాశంలో బందీలు అవుతారో వారు ఎప్పుడూ అన్ని రకాల ఆధిపత్యాల కోసం జీవిస్తూ ఉంటారు. 

ఎవరైతే సర్వభూతాంతర్గతమైన ఈశ్వర దర్శనం పొందుతారో వారికి అన్ని జీవుల్లో ‘ఆత్మదర్శనం’ కలుగుతుంది. ఆ స్థితిని నిలకడగా నిలబెట్టుకోవడమే యోగం.

 ఆ దర్శనం మానవుల్లో ఏ వయసులో, ఏ పరిస్థితుల్లో కలిగినా అది ధారాపాత్రలా నడుస్తూనే ఉంటుంది.

 చమత్కారంలా కన్పించే ఈ పరమోన్నత స్థితిని.. చాలా మంది మరణం తర్వాత ఆశిస్తుంటారు. కానీ, దేహం ఉండగానే ముక్తిని కలిగించే మహోన్నత స్థితి అది. 

అది తెలుసుకుంటే జీవితం ఎలా గడపాలో అర్థమవుతుంది.

🍁🍁🍁🍁

No comments:

Post a Comment