Sunday, October 16, 2022

పురాతన భాష ఏది?

 141022b2214.   151022-2.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀265.


              పురాతన భాష ఏది?
                   ➖➖➖✍️

నేను పరమాచార్య స్వామివారి దర్శనానికి మొదటిసారి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు విదేశీయులు ఉన్నారు. 

ఒక ఇజ్రాయిలి, ఒక ఇటలీయుడు, 
ఒక జర్మనీయుడు, ఒక ఆంగ్లేయుడు. 
వారు ‘పాశ్చాత్య మరియు తూర్పు ఆసియాలో అత్యంత ప్రాచీన భాషలు’ అనే అంశంపై పి.హెచ్.డి చేయడానికి వచ్చారు. పాశ్చాత్య విభాగంలో లాటిన్, హీబ్రూ మరియు గ్రీకు భాషలు; తూర్పు ఆసియా విభాగంలో సంస్కృతము మరియు తమిళము అధ్యయనం చేస్తున్నారు. 

మహాస్వామి వారు అనుష్టానం కొరకు లోపలికి వెళ్ళారు. వారు స్వామివారి ఫోటో తీయాలనుకున్నారు కాని సహాయకులు ఒప్పుకోలేదు. వారు ఉదయం నుండి ఒక చెట్టు నీడన నిలుచున్నారు. స్వామివారి పూజ ఎంతసేపటికి అవుతుంది అని సేవకులను అడిగారు కాని వారికి సరైన సమాధానం దొరకలేదు. 

మహాస్వామి వారు పది నిముషాలలో బయటకు వచ్చారు. మేమందరమూ వెళ్ళి సాష్టాంగం చేసాము. మెడలో కెమెరా తగిలించుకున్న వ్యక్తివైపు చూసి మహాస్వామి వారు ఫోటోలు తీసుకోండి అన్నట్టు సైగ చేసారు. మూడు చిత్రాలకు అనుమతి ఇచ్చి నాల్గవ చిత్రం తీస్తుండగా ఆపమన్నారు. వారి రాకకు కారణం అడిగారు. 

వారు వచ్చిన ఉద్దేశమును వివరించారు. 

మహాస్వామి వారు వారితో, ”ఏది అత్యంత ప్రాచీన భాష అని మీరు ఒక నిర్ణయానికి వచ్చారా?” అని అడిగారు. 

”పాశ్చాత్య భాషలలో హీబ్రూ చాలా ప్రాచీనమైనది. కాని తూర్పు ఆసియాలో సంస్కృతము తమిళము రెండు ప్రాచీనమైనవి అని అందరూ అంటున్నారు. మాకు అనుమానం వచ్చి మీ వద్దకు వచ్చాము” అని ఇజ్రాయిలీ చెప్పాడు.

అందుకు మహాస్వామి వారు “వీటన్నిటికంటే ప్రాచీనమైన భాష ఒకటి ఉంది. అది వైదిక భాష. సంస్కృతము హీబ్రూ కూడా దాని నుండే వచ్చాయి” అని అన్నారు. ”హీబ్రూ లో పునర్జన్మ గురించి ఒక శ్లోకం ఉంది. దాన్ని మొత్తం చెప్పగలవా?” అని ఇజ్రాయలీని అడిగి మొదటి రెండు పదాలు ఎత్తిచ్చారు.

అతను మూడు నాలుగు నిముషాలపాటు దాన్ని చెప్పాడు. స్వామి వారు చుట్టూ చూసి, అక్కడున్న పిల్లలతో “మీరు ఋగ్వేదం చదువుకున్నారా? ఈ శ్లోకాన్ని చెప్పగలరా?” అని అడిగారు. 

ఆ పిల్లలు ఐదు నిముషాలపాటు ఉచ్చరించారు. స్వామి వారు నాతో “ఈ పిల్లలు చెప్పినది వారికి అర్థమైందేమో అడుగు?” అన్నారు. 

నలుగురూ ఏమి మాట్లాడలేదు. స్వామి వారు ఆ పిల్లలవైపు తిరిగి “ఇతను హీబ్రూ లో చెప్పినది మీకు ఖచ్చితంగా అర్థమై ఉండదు” అని అన్నారు. 

మరలా నావైపు తిరిగి, “ఆ ఇజ్రాయిలీతో చెప్పు అతను చెప్పినది ఈ పిల్లలు చెప్పినది రెండూ ఒక్కటేనని” అని అన్నారు. నేను అతనితో, “నువ్వు చెప్పిన శ్లోకం ఆ పిల్లలు చెప్పిన శ్లోకం రెండూ ‘ఉచ్చారణలలో’ ఒక్కటే అని స్వామివారు చెప్తున్నారు” అని చెప్పాను. 

”ఏమిటి? కేవలం ‘ఉచ్చారణలలో’ మాత్రమే కాదు ‘అక్షరాలలో’ కూడా రెండూ ఒక్కటే” అని నా మాటలను సరిచేసారు. 

ఈ విషయాన్ని నిరూపిస్తానని ఒక కలం కాగితం ఇమ్మనారు. “వేదాలలో భూగోళం 32 భాగాలుగా విభజించబడింది అని చెప్పబడింది. ఈ 32 భాగాలలోని ప్రతి భాగంలో వేదాక్షరాలు ఎలా మార్పు చెందాయి ఎలా ఉచ్చరింపబడతాయి అని కూడా చెప్పబడింది”. వచ్చిన ఆ నలుగురిని వారు ఏ ప్రాంతం వారో కనుక్కుని ప్రతి వేదాక్షరం వారి ప్రాంతాలలో ఎలా మార్పు చెందింది అనే విషయం చెప్పారు. ఆ పిల్లల్ని ఋగ్వేదం నుండి మళ్ళా ఒక శ్లోకం చెప్పమని ఆ శ్లోకంలోని ప్రతి అక్షారం వారి వారి ప్రాంతంలో ఎలా పలుకుతారో చెప్పారు. 

ఆ పిల్లల వైపు తిరిగి “ఈ శ్లోకాన్ని నేను కొద్దిగా వేరే ఉచ్చారణలో హీబ్రూ భాషలో వీటిని ఎలా పలుకుతారో అలా చెప్తాను. అది తప్పు అనుకోకండి. వేదాలలో ఇది ఇలా కూడా ఉచ్ఛరించవచ్చు అన్న ఆదేశము ఉన్నది” అని అన్నారు. 

పరమాచార్య స్వామివారు మెల్లిగా మొదలుపెట్టారు. అద్భుతం ఆ ఇజ్రాయిలీ కూడా స్వామివారితో చెప్పడం ప్రారంభించాడు. 

మేమందరమూ నిర్ఘాంతపోయాము. “నేను అప్పుడే చెప్పాను. ఋగ్వేదములో ఉన్న శ్లోకమే హీబ్రూ లో కూడా ఉన్నదని!  కాని అక్షరాలు కొద్దిగా మార్పుతో ఉంటాయి. (దక్షిణాన ‘యమున’ అంటే ఉత్తరాన ‘జమున’ అంటారు. దక్షిణాన ‘వ’ పశ్చిమ బెగాల్ లో ‘బ’. తమిళంలో ‘ప’ కన్నడంలో ‘హ’ అలా . . .) కాబట్టి ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష  ‘వైదిక భాష!’

మహాస్వామి వారు ఆ నలుగురిని ఋగ్వేద అక్షరములు వారి వారి భాషలలో ఎలా ఉచ్చరింపబడతాయో ఒక పట్టిక వెయ్యమన్నారు. పదిహేను నిముషాలలో అంతా రాసారు. దాన్ని చూసి ఇజ్రాయిలీ ఆశ్చర్యముతో ఇది అసలు ఊహింపశక్యము కానిది అని అన్నాడు. 

స్వామి వారు అతనితో “ఏమిటి అన్ని భాషలూ వేద భాషనుండే పుట్టాయని ఇప్పుడు ఒప్పుకుంటావా?” అని అడిగారు. 

కాని అతని మొహంలో అతను ఒప్పుకున్నట్టు కనబడడంలేదు. ”హీబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండొచ్చు. అని అతని సందేహము కదా?” అని అడిగారు. అందుకు అతను అవును “హీబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండొచ్చు కదా?” అన్నాడు. 

స్వామి వారు నవ్వుతూ, “మీవద్ద తాళం మాత్రమే ఉంది. మా వద్ద తాళంచెవి కూడా ఉంది. వేదాలలో ఏ మహర్షి భారతదేశం నుండి వెళ్ళి ఇజ్రాయల్ లో వేదాన్ని వ్యాప్తి చేసారో అనే విషయం కూడా ఉంది” అని చెప్పారు. 

అతను చివరికి ఒప్పుకున్నాడు. 

     --- తిరువణ్ణామలై గౌరీశంకర్ గారి తమిళ ఇంటర్వ్యూ వీడియో నుండి.

అపార కరుణా సింధుం
జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం 
ప్రణమామి ముదావహం ॥✍️

https://t.me/paramacharyaVaibhavam
#KanchiParamacharyaVaibhavam
#కంచిపరమాచార్యవైభవం

                       🌷🙏🌷

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment