మంచి ప్రవర్తనం, మంచి ఆలోచనం, నిశ్చలమైన మనసు మనల్ని సన్మార్గంలో పయనింపజేస్తాయి. ఎల్లప్పుడూ ఆనందాన్నిస్తాయి. మన సదాలోచనలు బలాన్ని, ధైర్యాన్ని చేకూరుస్తాయి. మంచి వర్తనం వల్ల మితంగా, మృదువుగా మధురంగా మాట్లాడటం అలవడుతుంది. మృదు భాషణం మనపట్ల గౌరవం పెంచుతుంది. నిజం చెప్పడం, రుజుమార్గంలో పయనించడం అవసరం. నిజం చెబితే నిష్ఠురం అనుకోవచ్చు. నేటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. కొన్నాళ్లకు వాస్తవం తెలిశాక నిష్ఠురం సామెత మటుమాయం అవుతుంది. దైవాన్ని నమ్మడం వల్ల, పాపభీతితో నిజాయతీ అలవడి మనల్ని మంచిమార్గంలో నడిపిస్తుంది. మన సత్ ప్రవర్తనం ఇతరుల్లో ఆనందనర్తనం చేయించాలి.
పరమశివుడు జటలు ముడివేసుకుంటాడు. ఆ జటలు విప్పుకోవాలంటే మొదలు తుది తెలియవు. అందుకే జటిలసమస్య అనే మాట ఉద్భవించింది. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి జటిల సమస్యా మనకు ఓ గుణపాఠం నేర్పుతుంది. ఆ పాఠం నేర్చుకుంటే ఇతరులకు నేర్పవచ్చు. మాన్యులైన పెద్దల సలహాలనూ సూచనలనూ సామాన్యులమైన మనం పాటించడం అలవరచుకోవాలి. ఉపన్యాసాలు దంచడం కాదు. అవి ఆచరించి చూపగలగాలి.
ఒక పావురాన్ని డేగ వెంటాడుతుంటే- ఆ పావురం శిబి చక్రవర్తిని ఆశ్రయించి శరణు కోరుతుంది. ఆ పావురం బరువు ఎంత తూగుతుందో, అంత మాంసాన్నీ తన శరీర భాగంలోంచి కోసి ఇస్తానంటాడు శిబి చక్రవర్తి. అంతేకానీ, శరణు కోరిన పావురాన్ని విడిచిపెట్టనంటాడు. పావురాన్ని కాటాలో వేస్తే అదే ఎక్కువ బరువు తూగుతుంది. చివరకు తానే వెళ్లి కాటాలో కూర్చుంటాడు. అంతటి త్యాగశీలి, దానశీలి శిబి. ఆ 'శిబి' చక్రవర్తిని బట్టే నేడు రక్తదాన 'శిబి'రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడవి విజయవంతంగా సాగుతున్నాయి. మనం ఇచ్చే దానాలు అంత గొప్పవి కాకపోయినా అటువంటి పురాణ గాథలు మనకు స్ఫూర్తినిస్తాయి. మన ఆదాయంలో ఎంతోకొంత దీన జనోద్ధరణకీ, జీర్ణ దేవాలయాల సముద్ధరణకీ ఖర్చుపెట్టాలి.
ఏదైనా నదికి కాని, చెరువుకి కాని ఉన్న ఒడ్డును కూలం అంటారు. మనం ఈవలి ఒడ్డున ఉండటం అను'కూలం'; ఆవలి ఒడ్డున ఉండటం ప్రతి'కూలం'. మనం సంఘజీవులం కనుక అందరితోనూ అను కూలంగా ఉండాలి. మన ప్రవర్తనం అలా ఉండాలి. మనకు ప్రతికూలంగా ఉన్నవారు ఎటువంటి దుష్టపదజాలాన్ని ప్రయోగించినా, మనం ఆ 'జాలం'లో పడక, ఆవేశం చెందక, శిష్టపదజాలంతోనే సమాధానం చెప్పాలి. అప్పుడు వారే తమ ధోరణి మార్చుకుంటారు. మన నడవడిలో 'వడి' తగ్గాలి. మన తరవాతి తరానికి ఒరవడి కావాలి!
సేకరణ . మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment