*కాకిగోల (జాతీయం వివరణ)* -డా.ఎం.హరికిషన్-9441032212-కర్నూలు
**************************
మనం పెద్దగా ఇష్టపడని పక్షుల్లో కాకి ఒకటి. దానికి కారణం దాని రంగు కాదు. అరుపే. ఎందుకంటే కోకిల కూడా కాకిలానే వున్నప్పటికీ దాని మధురమైన కూతను మనం ఆస్వాదిస్తాం, అనుకరిస్తాం. కానీ కాకి అరుపు కర్ణకఠోరంగా వుంటుంది. అది ఇంటి బైట ఏ తీగమీద కూచోని అరుస్తుంటే చాలా విసుగ్గా వుంటుంది. ఒక్క కాకి అరుస్తేనే అలా వుంటే, ఏకంగా పదో ఇరవయ్యో గుంపుగా చేరి అరుస్తే అంతే సంగతి. ఆ గోలను మనం భరించలేం.
కాకికి ఎక్కడైనా ఏదైనా ఆహారం కనబడితే అది ఆనందంగా ఇతర కాకులని కా...కా... అని పిలవడం ప్రారంభిస్తుంది.
కాసేపటికంతా అక్కడ ఒక చిన్న గుంపు పోగవుతుంది. అవన్నీ ఆహారాన్ని తింటూ, అరుస్తూ గందరగోళాన్ని సృష్టిస్తాయి. అలాగే ఏదయినా కాకి చనిపోయినప్పుడు గూడా కాకులు గుంపులు గుంపులుగా అక్కడ చేరి రొద పెడుతుంటాయి. భరించలేని, విసుగు తెప్పించే శబ్దాలు ఆగకుండా వస్తూ వుంటే దానిని కాకిగోల అంటూ వుంటాం.
మామూలుగా చిన్న పిల్లలు గుంపుగా ఏర్పడి పెద్దగా నవ్వుకుంటూ, అరుచుకుంటూ, వస్తువులతో చప్పుడు చేస్తూ వున్నప్పుడు పెద్దలు "ఆపండ్రా మీ కాకిగోల... భరించలేక చస్తున్నాం" అంటూ విసుక్కోవడం మనం చాలా సార్లు చూస్తుంటాం. అలాగే పెద్దవాళ్ళు గొడవపడి ఒకరినొకరు పెద్దగా వీధుల్లో అరుచుకుంటున్నా, బడిలో పిల్లలు మాష్టారు లేనప్పుడు అల్లరి చేస్తున్నా... దానిని కాకిగోలతో పోల్చడం మామూలే. మనం ఎక్కువగా ఉపయోగించే జాతీయాల్లో ఈ కాకిగోల ఒకటి.
ఇంకో విషయం ... కాకి అరిస్తే బంధువులు వస్తారని , శుభం జరుగుతుందని కొందరి నమ్మకం.ఈ నమ్మకం ఎలా వచ్చిందంటే రామాయణంలో సీతను వెతుక్కుంటూ హనుమంతుడు లంకను చేరతాడు. అశోకవనంలో బాధతో ఉన్న సీతకు ఆ సమయంలో కాకి అరుపు వినబడుతుంది. ఆ తరువాత అక్కడకు హనుమంతుడు వస్తాడు. దీనివల్ల కాకి అరుపు తరువాత కావలసినవారు వస్తారనీ , శుభవార్త తెస్తారనీ ఈ నమ్మకం వచ్చేసింది.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
No comments:
Post a Comment