మహర్షులు అందించిన సనాతన ధర్మం మనది. ఇతర మతాల వారు పిల్లలని బాల్యం నుండి వాళ్ళ మతాలపై మంచి అవగాహనతో పెంచుతారు. కానీ సనాతన ధర్మమైన హిందూమతంలో పిల్లలు మాత్రం సరైన అవగాహన లేకుండా పెరుగుతున్నారు. యుగాల క్రితమే ఙ్ఞానం, విఙ్ఞానం, అంతులేని నైతికత ఇలాంటివన్నీ నేర్పింది మన మతం. కానీ దాని స్వరూపంపై పెద్దలకే సరైన అవగాహన లేదు. అందువల్ల పిల్లలకు లలిగించలేకపోతున్నారు.
సనాతన ధర్మం అంటే ఆలయాలకి వెళ్ళి దండం పెట్టుకోవడమే అనుకుంటున్నారు. ఈమధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. అందుకే వివరణ ఇవ్వడం జరుగుతోంది.
మన మతానికి ప్రవక్త ఎవరు? దేవుడు ఎవరు? గ్రంథం ఏమిటి?
ఇవీ పిల్లలు అడిగేవి. ఎందుకంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క దేవుడు, గ్రంథం, ప్రవక్త కనబడుతున్నారు. మనకి అలా లేదేమిటి అని అడుగుతున్నారు. దీనినిబట్టి చూస్తుంటే ఇతర మతములు ఎలాగో ఇది కూడా అలాంటిదే అనుకుంటున్నారు. మరి ఒక మతానికి ఒక గ్రంథం ఉంది. కనుక అన్ని మతాలకు ఉండాలని, ఒక మతానికి ఒక ప్రవక్త ఉన్నాడు కనుక మన మతానికి కూడా ఉండాలని చెప్పడానికి లేదు. ఒక్కొక్క మతస్వరూపం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎక్కువ తక్కువలు దేనికీ లేవు. అన్ని మతాలనీ మనం గౌరవిద్దాం.
హిందూమత గ్రంథాలు
కానీ మన మతంపైన అవగాహన కలగాలి. మన మతం పేరు సనాతన ధర్మమని, హిందూధర్మమని, ఆర్ష ధర్మమని పేరు. అయితే విశేషించి ఈ సనాతన ధర్మంలో ఒక గ్రంథం అంటూ ఉండదు. ఙ్ఞానం ఉంటుంది. అయితే ఙ్ఞానం గాలిలోంచి వచ్చినట్లుగా కాకుండా దీనికీ ఏదైనా గ్రంథం చెప్పుకోవాలి అంటే సనాతన ధర్మానికి ఆధార గ్రంథం వేదం.
“వేదోక్తేన ధర్మమిదం” అని చెప్పుకోవాలి. వేదము యొక్క భాష కానీ, అందులో వచ్చిన అంశములు కానీ సామాన్య జనులకి ఉపదేశించే నీతి వాక్యాల్లా ఉండవు. మంత్రాలు ఉశుల సమాధి స్థితిలో దర్శించిన దివ్య శబ్దాలు. పరమ సత్యం సమాధి స్థితికి అర్థం అవుతుంది. కానీ మామూలు మనుషుల ఊహ, తర్కానికి, ఆలొచనకి గొప్ప ధర్మాలు అర్థం కావు. అది తపస్సు చేత వికసించిన అతీంద్రియ ప్రఙ్ఞ కలిగిన ఋషులు ఏ సత్యాన్ని దర్శించారో ఆ సత్యాల సమాహారమే వేదము.
కనుక వాటిలోని అంతర్యాలని, అవి మనకు చూపిస్తున్న జీవన విధానాన్ని మనకి అందించడానికి మహర్షులు మరొక పనిచేశారు. అవే పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు. కనుక వేదాలు మొదలుకొని పురాణ, ఇతిహాస, ధర్మ శాస్త్రముల ద్వారా మన సనాతన ధర్మం వర్ధిల్లింది. కనుక పిల్లలు అడిగితే మనం చెప్పవలసింది సనాతన ధర్మానికి ఆధారం వేదం అని. వేదములలోని లోతైన భావాలు సామాన్యులకు అందజేయడానికై ఆ వేద ఋషుల్లో కొందరు మనకు పురాణాల్ని, ఇతిహాసాల్ని అందించారు. వారిలో వాల్మీకి, వ్యాసుడు, అగస్త్యుడు ఇలా ఎంతోమంది చెప్పబడుతూ ఉంటారు. వారందరూ ఇటు పురాణాల్లోనూ, అటు వేదాల్లోనూ తెలియబడుతూ ఉంటారు.
అంటే వేదాలలో ఉన్న మహర్షులే మనకి పురాణ, ఇతిహాసాల్లోని ఙ్ఞానాన్ని అందించారు.
ఇది సామాన్యులకు కూడా చేరడానికి వారు చేసిన ప్రక్రియ. అందుకే హిందూమతం అత్యంత సామాన్య జనుల్లోకి కూడా చొచ్చుకుపోయింది.
ఇవి హిందూమతానికి గ్రంథాలు అని తెలుసుకోవాలి.
హిందూమతానికి ప్రవక్తలు ఎవరు?
ఇక హిందూ మతానికి ప్రవక్త ఎవరు? అంటే పరమేశ్వరుడే. “యస్య నిశ్వసితం వేదాః” అంటే పరమాత్మయొక్క ఊపిరియే వేదములు. పరమేశ్వరుడు ప్రవక్త అయినప్పటికీ కూడా పరమేశ్వర స్వరూపమైన వేదాలను మహర్షులు దర్శించారు.
కనుక మహాత్ములు అందరూ ప్రవక్తలే అని చెప్పుకోవాలి. ఈ మహర్షులు వేల సంఖ్యలో ఉన్నారు. ఇది ఒక ప్రవక్త ఇచ్చిన విఙ్ఞానం కాదు. అనేకమంది మహర్షులు ఇచ్చిన విఙ్ఞానం. సాధారణంగా ఇద్దరు, ముగ్గురు మూడు మాటలు చెప్తేనే ఒక మాటకి ఇంకొక మాటకి పొంతన కుదరదు. ఒక వ్యక్తికీ, మరొక వ్యక్తికీ పొంతన కుదరదు. ఇంతమంది మహర్షులు ఇంత విఙ్ఞానం ఇచ్చినా ఎక్కడా పరస్పర విరుద్ధంగా లేవు. ఇది మనం తెలుసుకోవలసిన గొప్ప అంశం.
ఎవరియొక్క విఙ్ఞానం వారిదే అయినా ఒకరి విఙ్ఞానానికి ఇంకొకరి విఙ్ఞానానికి వైరుధ్యం లేదు. ఇవన్నీ కలిపి సనాతన ధర్మం అనిపించుకుంటుంది. అది మన మతం యొక్క ప్రత్యేకత. ఈవిషయాన్ని పిల్లలకు తెలియజేయగలగాలి.
No comments:
Post a Comment