1. చాలీసా" అంటే ఏమిటి?
జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)
2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి?
జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. **అజ్ఞానమును* *హననము చేయునది కనుక* *జ్ఞానమునకు హనుమ అని పేరు.*
3. ఆంజనేయ - అర్థం?
జ. ఆంజనేయ అంటే .... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.
4. తులసీదాస్ అస్సలు పేరు ?
జ. *రామ్ బోల*. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.
5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?
జ. దేవుళ్ళ భార్యలను, మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య వల్ల వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల".
ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.
6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?
జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్.
హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.
7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?
జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.
8. హనుమంతుని పంచముఖములు ఏవి?
జ. హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు,హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....
తూర్పున వానర ముఖం జన్మతః వచ్చినది అది సద్యోజాత శివవదనము.
దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.
పశ్చిమం గరుడ ముఖం అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.
ఉత్తరం వరాహ ముఖం అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు.
ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం . వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది🙏🙏🙏🙏
9. "జయ" హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?
జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.
10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?
జ.126 సం.జీవించాడు.
11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు?
జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.
12. రాక్షస సంహారానికై హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?
జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.
13 . రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?
జ. మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో.
14 . సీతారాములు పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?
జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని బహుమతిగా ఇచ్చాడు.
15. కపీశ అంటే అర్థం ఏమిటి?
జ. కపీశ అంటే...
a) కపులకు ఈశుడు
b) కపి రూపంలో ఉన్న ఈశుడు
సి) కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం.
16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు🙏
No comments:
Post a Comment