అల్లుడేమన్నా అంటే ఇంటికొచ్చేయ్!
ప్రేమపెళ్ళిళ్ళు! పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు! పెళ్ళి జరిగిన వారాలు, నెలల్లోనే విఫలమవడం ఒక భయంకరమైన సామాజిక సమస్య. దీనిని ఉపేక్షించగలమా! “నీకు అత్తవారింట్లో ఏ కాస్త ఇబ్బంది అనిపించినా, నీ భర్త కాసింత బాధపెట్టినా వెంటనే మా దగ్గరకి వచ్చేయ్ మేము చూసుకుంటాం’ – ఇదీ నేడు చాలామంది ఆడపిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న బోధ. ఈ బోధ తలకేక్కించుకున్న అమ్మాయి అడుగడుగునా అనుమానంతోనే అత్తింట్లో మసలుతుంది. భర్తతో ఏ మాత్రమూ సర్దుబాటు చేసుకోలేని ‘అసహనా’న్ని పెంచుకుంటుంది.
నిజానికి పుట్టింటి భరోసా అవసరమే! అది కాపురాన్ని నిలబెట్టడానికే గానీ, విడదీసి వినోదించడానికి కాదు.
ఇలాంటి తల్లిదండ్రులుంటారా – అని వెనకటి తరాల వాళ్ళు ఆశ్చర్యపోవచ్చు. కానీ, చాలాచోట్ల ఇప్పుడు ఇలాంటి వారిని చూడడం వల్ల ఇది వాస్తవమని అంగీకరించక తప్పడం లేదు.
పెద్ద ఎత్తున ‘నిశ్చితార్థాలు’ జరుపుకున్న వాళ్ళు కూడా పెళ్ళి ముహూర్తం లోపలే వివాహం రద్దయింది అని ప్రకటిస్తున్నారు. పెళ్ళయ్యాకనే సులభంగా తెగతెంపులు చేసుకున్నప్పుడు, నిశ్చితార్థాలను రద్దు చేసుకోవడంలో అబ్బురమేముంది – అంటున్నారు.
ఇది మన సంస్కృతి పరంగా చూస్తే – పరమ అధర్మం. ‘నిశ్చితార్థం’ అంటే మామూలు విషయమా! భగవత్పూజ చేసి, పెద్దల సమక్షంలో రెండు కుటుంబాలు ఇచ్చుకున్న మాటని, ఏవో అత్యల్ప కారణాలను వెదికి, ఇరువైపులా తల్లిదండ్రులే వాగ్దానాన్ని భంగం చేస్తున్నారు. ఇది వాళ్లకి ఈషణ్మాత్రం కూడా తప్పనిపించడం లేదు. ఇంతకంటే కలిదోషం మరొకటి ఉంటుందా!
ఈ పెద్దలు తమ కాపురాలు సర్దుబాటులేకుండా చేసుకొచ్చారా? మరి అదే సర్దుబాటు పిల్లలకెందుకు నేర్పడం లేదు? మంత్రాలు, పెళ్ళి తంతు జీవం లేని ప్రక్రియలా? మాట ఇచ్చినదీ, శుభలేఖ రాసినదీ, డానికి ముందు సీతారామ, పార్వతీ పరమేశ్వరాది దివ్య దంపతుల్ని స్మరించినదీ వ్యర్థమేనా? ఇలాంటి వారికి ఇంకా సంప్రదాయాలెందుకు? పూజా పునస్కారాలెందుకు?
భారతీయ సంస్కృతిలో ఒకసారి పడిన బంధం జీవితాంతం ఉంటుంది. వ్యక్తులకు అతీతమైన ఒక శక్తి వివాహ బంధానికి సాక్షి, ఆధారం – అనే విశ్వాసం తరతరాల కుటుంబ వ్యవస్థని నిలబెట్టింది.
యౌవనంలో జీవితపు లోతు వాస్తవ చిత్రం అవగాహన కావడం కష్టమే. ఎదురైన కాసింత ఇబ్బందిని కూడా సహించలేక వెంటనే విడగొట్టుకునేందుకు సిద్ధపడుతున్న స్వార్థబుద్ధి, సుఖలాలస కారణంగా జీవిత స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం లేదు.
“ఎందుకు నిన్ను చేసుకున్నానో తెలియదు. ఇప్పుడ మాత్రం నీతో బ్రతకడం కష్టం, మనం విడిపోతే మంచిది” అని అమిత తేలికగా ఒక భర్త భార్యతో అంటున్నాడు.
పెద్దలుండి ఏం చేస్తున్నారు? ఈ సమయంలోనే వారు కలుగజేసుకొని, వివాహబంధం, కుటుంబం, పిల్లల భవిష్యత్తు వ్యవస్థ, సామాజిక భద్రత లాంటి వాస్తవాలను వివరించగలగాలి. ‘ఆవేశాల పొంగులు అణిగాక ఆలోచన స్థిరత్వాన్నిస్తుంది’ అని సర్ది చెప్పగలగాలి. ‘సుఖపడడం కంటే ధర్మంగా బ్రతకడం గొప్ప’ అని బోధ పరచగలగాలి.
వీటన్నింటికి బదులుగా ‘ఈ కాలం పిల్లలకి ఎవరు చెప్పగలరండి? వాళ్ళిష్టం!” అనేసి ఊరుకుంటున్నారు.
మోహాన్ని ప్రేమ అనుకోని వివాహమాడిన వాళ్ళు కూడా కొద్ది రోజుల్లోనే విడిపోయేందుకు ముందుకోస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలు, స్వేచ్ఛ, కట్టుబాటులో ఇమడలేనితనం వంటివి వీటికి హేతువులు.
ప్రధానంగా ప్రేమలోపమే దీనికి కారణం. “పిల్లలు విలాసంగా బ్రతకాలి’ అని చిన్నప్పటి నుంచి సుఖజీవన సోపానాలే బోధించే తల్లిదండ్రులు – ‘పిల్లలు విలువలతో జీవించాలి’ అనే ధర్మ జీవనపు పునాదులను నేర్పడం లేదు.
నేటి యౌవనం ఇలాగే ఉండదు. మారి తీరుతుంది. సౌందర్యాలు, సౌకర్యాలు తరిగి జీవితంయొక్క వికృత పార్శ్వాలు క్రమేపీ గోచరిస్తాయి. సుఖదుఃఖాల సంగమమైన బ్రతుకులో ఒక దుఃఖాన్ని ఓర్చుకోలేక, సవరించలేక బంధాన్ని తెంచిపోతే – మరో రూపంలో మరో దుఃఖం రాక తప్పదు! దానినేం చేయగలం! ఇంక ఎవరికోసం బ్రతికి ఏం ప్రయోజనం? “నాది’ అని ఏ బంధాన్ని నిలుపుకోగలం?
బంధాన్ని నిలిపే ప్రేమనీ, ప్రేమని నిలిపే ధర్మాన్నీ మన సంస్కృతి ఏనాడో ఇతిహాస పురాణాల్లో బోధించింది.
‘సహిస్తూ పడుండమంటారా? అని ప్రశ్నించిన తరం కాసింత కూడా సర్డుకుపోవడాన్ని అలవరచుకోని స్వార్థపరత్వంloki ఎదిగిపోయింది.
“మా అమ్మా నాన్న చివరివరకు కలిసి మమ్మల్ని తీర్చిదిద్దారు” అని పిల్లలు సగర్వంగా, సంతృప్తిగా చెప్పగలిగే విధంగా దంపతులు జీవించలేకపోతున్నారు.
కొద్ది దశాబ్దాలుగా భయంకరమైన తెగతెంపులు విజ్రుంభిస్తున్నాయి. విదేశీ సంస్కృతి వెనుక మనకున్నంత బలీయమైన కుటుంబ వ్యవస్థలు లేవు కనుక వారి చీలికల పద్ధతుల్ని వేలెత్తి చూపనక్కరలేదు. లేనివాళ్ళకి ఎలాగూ లేదు. తమకున్న దానిని వదులుకోవడం ఒక విధమైన పరమ దరిద్రమే.
‘పిల్లలు ధనం సంపాదించుకొనే తెలివితేటలు సంపాదిస్తున్నారు కదా’ అని తృప్తిపడే పెద్దలు తమ కుటుంబాల ప్రాచీన నేపథ్యాలు, సంప్రదాయాలలోని పరస్పర ప్రేమ, సహనాలతో సాగిన అనుబంధాలు ఎరుకపరచడం లేదు. వాటిని బాల్యం నుండి అలవరచడం లేదు. ఆలోచనా ధోరణిలోనే వేర్పాటుతనం ఏర్పడుతోంది.
పిల్లల తుంటరితనానికి పెద్దల తొందరపాటు తోడు కారాదు. అనుబంధాలు కడదాకా నిలిపే ప్రయత్నమే నిజమైన జీవకళ.
No comments:
Post a Comment